‘గాడ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ అడ్వర్‌టైజింగ్’ ‘యాడ్ గురు’గా విఖ్యాతుడైన పీయుష్ పాండే (70) శుక్రవారం కన్ను మూయడంతో అడ్వర్టయిజింగ్ చరిత్రలో ఒక మహోధ్యాయం ముగిసింది. ఏదైనా వస్తువును దాని ఘనతతో కంటే ‘ఆత్మ’తో కొనిపించాలని నమ్మే పీయుష్ భారతీయులు ఇష్టపడే హాస్యాన్ని మేళవించి క్యాంపయిన్స్ నిర్వహించి ప్రొడక్ట్స్‌ను సూపర్‌హిట్ చేయడంలో దిట్ట.ఫెవికాల్. కాడ్బరీస్, ఏసియన్ పెయింట్స్... ఎన్నో. ఆయనకు నివాళి.
మీకు ఈ యాడ్ గుర్తుండి ఉంటుంది. ఒక పెద్దమనిషి చెరువు గట్టున కూచుని గంటల తరబడి చేపలు పట్టడానికి ప్రయత్నిస్తుంటాడు. కాని ఒక్క చేపా పడదు. అప్పుడు ఒక తమిళ వ్యక్తి హడావిడిగా వచ్చి ఒక చిన్న కర్రకు జిగురు అంటించి నీళ్లలో పెడతాడు. అంతే. చేపలు అంటుకుపోతాయి. పెద్దమనిషి నోరెళ్లబెడుతుండగా ఆ తమిళవ్యక్తి హుషారుగా చేపలతో చిత్తగిస్తాడు. కారణం? అతడు వాడింది ‘ఫెవిక్విక్’. ఈ యాడ్ వచ్చాక ఫెవిక్విక్ అమ్మకాలు అమాంతం పెరిగాయి. దానిని తయారు చేసినవాడు పీయుష్ పాండే. ఓగిల్వి ఇండియా యాడ్ ఏజెన్సీక్రియేటివ్ చైర్మన్, సి.ఇ.ఓ.
‘నువ్వు ఏ యాడ్ అయినా తయారు చెయ్. అది ముందుగా జనానికి నచ్చాలి’ అంటాడు పీయుష్.
పీయుష్ పాండేది జైపూర్. అతని కుటుంబం ఢిల్లీలో స్థిరపడగా అక్కడే చదువుకున్నాడు. క్రికెటర్ కావాలని ఉండేది. రంజీ స్థాయిలో పెద్ద ఆటగాడిగా ఇతర రాష్ట్రాలు తిరుగుతూ ఆడేవాడు. కాని ఆట కంటే కూడా ఇంట్లో వాతావరణమే అతణ్ణి ఎక్కువగా తీర్చిదిద్దింది.
‘మా ఇంట్లో ఎప్పుడూ పుస్తకాలు, సంగీతం, కళల గురించి చర్చ ఉండేది’ అంటాడు పీయుష్. సుప్రసిద్ధ గాయని ఇలా అరుణ్ అతడి పెద్దక్క. దాంతో అతను తెలియకనే అడ్వర్టయిజింగ్‌లోకి వచ్చాడు. 1982లో ముంబైలోని ఓగిల్విలో ‘క్లయింట్ సర్వీసింగ్ ఎగ్జిక్యూటివ్’గా చేరిన పీయుష్ ‘సన్‌లైట్’డిటెర్జెంట్‌కు మొదటి ప్రకటన తయారు చేయడంతో సంస్థ దృష్టిలో పడ్డాడు.
ఇక అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఆ సంస్థకు బిగ్‌బాస్‌గా మారి భారతదేశంలో నం.1 యాడ్ ఏజెన్సీగా విస్తరింపచేశాడు. ప్రపంచ వ్యాప్త శాఖలు ఉన్న ఈ ఏజెన్సీకి అన్నింటికన్నా లాభదాయమైన శాఖగా ఇండియా శాఖను నిలబెట్టాడు పీయుష్. నవ్విస్తూ కొనిపించడం, సున్నితమైన భావోద్వేగాలతో ప్రొడక్ట్‌ను మనసులో నాటుకునేలా చేయడం పీయుష్ ప్రత్యేకత. ‘హమారా బజాజ్’ యాడ్ అందుకు ఉదాహరణ. ఆ యాడ్‌లో భారతీయులకు ఒక స్కూటర్‌తో ఎలాంటి అనుబంధం ఉంటుందో చూపడం ద్వారా పెద్ద అమ్మకాలు సాధించాడు.
స్కూటర్ కొనేవారు అదే కొనాలని, స్కూటర్ కొనలేని వారు కనీసం కలల్లో నిలుపుకోవాలని ఆ యాడ్ ద్వారా అతడు నిరూపించాడు. ఇక క్రికెట్ మైదానంలో వింత స్టెప్స్ వేస్తూ చొచ్చుకుని వచ్చే కాడ్బరీ అమ్మాయిని కనిపెట్టింది పీయుషే. కాడ్బరీ యాడ్‌లో చాక్లెట్‌ను, ఆ అమ్మాయిని ఎవరూ మర్చికోలేకపోయారు. ఒక విధంగా అమ్మాయిల ఉత్సాహం ఏ స్థాయిలో ఉంటుందో పీయుష్ చూపించాడు.
ఆ తర్వాత పీయుష్ చేసిన ‘ఫెవికాల్’ క్యాంపెయిన్ అందరినీ నవ్వుల పూవులు పూయిస్తూ ఫెవికాల్ అభిమానులుగా మార్చింది. ‘ఈ బంధం దృఢమైనది’ అనడంలో ‘బంధం’ అనే మాటను జాగ్రత్తగా ఎంచింది. ఫెవికాల్ యాడ్‌లో ఒక తల్లి పని చేసుకుంటూ మాటిమాటికి అటూ ఇటూ తిరుగుతున్న పసిపిల్లాణ్ణి ఒక ఖాళీ డబ్బా మీద కూచోబెడుతుంది. అక్కడ నుంచి ఇక ఆ పిల్లాడు కదలడు. కారణం? అది ఫెవికాల్ ఖాళీ డబ్బా.
అలాగే ‘ఎంసీల్’ యాడ్స్ కూడా జనానికి తెగ నచ్చాయి. ఇక ‘పగ్’ డాగ్‌ను ‘హచ్’ డాగ్‌గా మార్చిన బ్రహ్మ పీయుష్. ‘వేరెవర్ యూ గో అవర్ నెట్‌వర్క్ ఫాలోస్’ అంటూ ఒక పసిపిల్లాడి వెంట కుక్కపిల్ల వెళుతున్న హచ్ నెట్‌వర్క్ యాడ్‌కు కోట్ల మంది అభిమానులున్నారు. ఇక వొడాఫోన్ ‘జూజూస్’ ఎంత వింత గొలిపి కుతూహలం రేడియో అందరికీ తెలుసు.
ప్రకటనలు వ్యాపారానికే కాదు దేశహితవుకు కూడా ఉపయోగపడాలని నమ్మిన పీయుష్... అమితాబ్‌తో కలిసి చేసిన ΄ోలియో కాంపెయిన్ చరిత్రాత్మకమైనది. ‘దో బూంద్ జిందగీకె’ పేరుతో రెండు పోలియో చుక్కలు పిల్లలకు ఎంత జీవధాతువులో పల్లెపల్లెకూ చేరేలా ప్రచారం చేయగలిగాడు.
పీయుష్ పేరు దేశ అడ్వర్టయిజింగ్ రంగంలో చిరకాలం నిలిచిపోతుంది.


