
ఆఫీసులో అయితే జాగ్రత్తలు తప్పనిసరి
సమాచారం బహిర్గతమయ్యే అవకాశం
నెట్‌వర్క్‌కూ పొంచి ఉన్న సైబర్ ముప్పు
యూజర్లను హెచ్చరించిన ఎంఈఐటీవై
వాట్సాప్.. మన దైనందిన జీవితంలో కీలక భాగమైంది. వ్యక్తులు ఎవరైనా.. సౌకర్యవంతమైన ఈ మెసేజింగ్ యాప్ రాకతో సమాచారం ఇచ్చిపుచ్చుకునే విధానాన్నే మార్చింది. ప్రపంచంలో యూజర్ల పరంగా అతిపెద్ద మెసేజింగ్ యాప్‌గా అవతరించి అత్యంత ప్రజాదరణ పొందుతోంది. అయితే సౌలభ్యం కోసం ఉద్యోగులు చాలామంది వాట్సాప్ వెబ్‌ను ఆఫీస్ డెస్క్ టాప్/ల్యాప్‌టాప్‌లలో వాడుతుంటారు. తద్వారా సున్నిత సమాచారం బహిర్గతమయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఈ చిన్న అలవాటు తీవ్రమైన భద్రతా ముప్పకు దారి తీయవచ్చని స్పష్టం చేస్తోంది. -సాక్షి, స్పెషల్ డెస్క్
ప్రజలు తమ కార్యాలయంలోని కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లలో వాట్సాప్ వెబ్‌ను ఉపయోగించడం మానేయాలని భారత ప్రభుత్వ ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై) కోరింది. పని ప్రదేశంలో వేగంగా కమ్యూనికేట్ చేయడం కోసం ఉపకరణాల్లో వ్యక్తిగత చాటింగ్ చేయడం, ఫైల్స్‌ను ఉపయోగించడం సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ.. అలా చేయడం వల్ల సంస్థ యజమానికి సున్నిత సమాచారం బహిర్గతమవుతుందని ప్రభుత్వం వివరించింది.
అంతేగాక కార్పొరేట్ నెట్‌వర్క్స్‌ను అడ్మినిస్ట్రేటర్స్, ఐటీ బృందాలు పర్యవేక్షిస్తుంటాయి. స్క్రీన్–మానిటరింగ్ సాఫ్ట్‌వేర్, మాల్వేర్, బ్రౌజర్ హైజాక్‌లతో సహా వివిధ మార్గాల ద్వారా వీరు ప్రైవేట్ సంభాషణలు, వ్యక్తిగత ఫైల్స్‌ను చూసే అవకాశం ఉందని ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అవేర్‌నెస్ (ఐఎస్‌ఈఏ) వెల్లడించింది.
ప్రమాదంలో డేటా..
కార్పొరేట్ కంపెనీల ఉపకరణాల్లో మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించ డం వల్ల కలిగే నష్టాల గురించి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అవేర్‌నెస్ (ఐఎస్‌ఈఏ) బృందం ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. సైబర్ భద్రతపై కార్యాలయాల్లో పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఎంఈఐటీవై నుంచి ఈ హెచ్చరిక తాజాగా జారీ అయింది.
అనేక సంస్థలు ఇప్పుడు వాట్సాప్ వెబ్‌ను భద్రతా ముప్పుగా పరిణమించే వేదికగా చూస్తున్నాయని ఐఎస్‌ఈఏ చెబుతోంది. ‘మాల్వేర్, ఫిషింగ్ దాడులకు వాట్సాప్ వెబ్ ఒక గేట్‌వే. ఇది వారి మొత్తం నెట్‌వర్క్‌ను పణంగా పెడుతుంది. వ్యక్తిగత ఫోన్‌కు ఆఫీస్ వై–ఫైని ఉపయోగించడం కూడా శ్రేయస్కరం కాదు. నెట్‌వర్క్ సురక్షితంగా లేకున్నా, పర్యవేక్షణ వ్యవస్థలు ఉన్నా ప్రైవేట్ డేటా ప్రమాదంలో పడుతుంది’అని సూచించింది.
యూజర్లు 200 కోట్లు..
ప్రపంచంలో ఎక్కడున్నా టెక్స్‌ట్ సందేశాలు, ఫొటోలు, వీడియోలు, పత్రాలు పంపడానికి, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ చేయడానికి వాట్సాప్ వీలు కల్పిస్తోంది. ఫోన్ కాల్స్, ఈ–మెయిల్స్ వంటి సంప్రదాయ కమ్యూనికేషన్ సాధనాల కంటే సౌలభ్యంగా ఉండడంతో వాట్సాప్‌ను మరింత నమ్మదగిన వేదికగా మార్చింది.
వాట్సాప్ నెలవారీ యాక్టివ్ వినియోగదార్ల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల పైచిలుకు ఉందంటే ఏ స్థాయిలో జనంలో మమేకమైందో అర్థం చేసుకోవచ్చు. 85.4 కోట్ల యూజర్లతో భారత్ తొలి స్థానంలో దూసుకుపోతోంది. ఇంట్లో, బయట ఉన్పప్పుడు ఫోన్లో వాట్సాప్ వాడేవారు కార్యాలయానికి చేరుకోగానే వాట్సాప్ వెబ్‌ను ఉపయోగిస్తున్నారు.
వాట్సాప్ వెబ్‌ను ఆఫీసులో తప్పనిసరిగా ఉపయోగించాల్సి వస్తే..
» డెస్క్ నుండి బయటకు వెళ్లే ముందు వాట్సాప్ వెబ్ నుండి లాగ్ అవుట్ అవ్వండి.
» లింక్‌లపై క్లిక్ చేసేటప్పుడు లేదా అపరిచితుల నుండి వచ్చిన అటాచ్‌మెంట్స్‌ను తెరిచేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
» పని కోసం వ్యక్తిగత అప్లికేషన్స్, ఉపకరణాలను ఉపయోగించే విషయమై కంపెనీ డిజిటల్ పాలసీలను తెలుసుకోండి.
పొంచి ఉన్న ప్రమాదాలు..
ప్రైవసీకి ముప్పు: ఉపకరణాలను పర్యవేక్షించే వ్యవస్థ ఉన్నట్టయితే వ్యక్తిగత సంభాషణలు, పత్రాలు ఐటీ నిర్వాహకులకు కనిపించవచ్చు.
హానికర సాఫ్ట్‌వేర్: కార్యాలయంలోని కంప్యూటర్లు లక్ష్యంగా వాట్సాప్ వెబ్ ద్వారా హానికర ఫైల్స్ (మాల్వేర్) చేరవచ్చు. ఇదే జరిగితే మొత్తం నెట్‌వర్క్ సైబర్ నేరస్తుల చేతుల్లోకి వెళ్తుంది.
నెట్‌వర్క్ ఆధారిత స్నూపింగ్: వాట్సాప్ ఉపయోగిస్తున్నప్పుడు ఫోన్‌ను ఆఫీస్ వైఫైకి కనెక్ట్ చేయడం వలన వ్యక్తిగత డేటా కార్పొరేట్ నిఘా సాధనాలకు బహిర్గతమవుతుంది.