బెంగాల్‌ పోరులో ఒక సెన్సేషన్‌ కలితా మాఝీ | West Bengal polls Kalita Majhi sensational journey from domestic worker to candidate | Sakshi
Sakshi News home page

బెంగాల్‌ పోరులో ఒక సెన్సేషన్‌ కలితా మాఝీ

Apr 29 2026 6:17 PM | Updated on Apr 29 2026 6:39 PM

West Bengal polls Kalita Majhi sensational journey from domestic worker to candidate

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక సాధారణ  డొమెస్టిక్‌ వర్కర్‌ (Domestic Worker)  పోటీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గత రెండు దశాబ్దాలుగా ఇళ్లలో పాచిపని చేస్తూ  అతి సాధారణ జీవనం సాగిస్తున్న ఆమె, ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

పరిమిత వనరులతో జీవిస్తున్న లక్షలాది మందికి బెంగాల్ ఎన్నికల్లో కలితా మాఝీ  ఎంట్రీ స్ఫూర్తివంతంగా నిలుస్తోంది. నేటికీ ఆమె ఇంట్లో టెలివిజన్, రిఫ్రిజిరేటర్, లేదా ఎయిర్ కండిషనింగ్ వంటి కనీస సౌకర్యాలు లేవు. అయినప్పటికీ, ఆమె నిరాడంబరత, అవిశ్రాంత పోరాటం ఆమెకు గుర్తింపును, రాజకీయ రంగంలోకి అడుగుపెట్టే అవకాశాన్ని సంపాదించిపెట్టాయి. ఒకప్పుడు నలుగురి ఇళ్లలో అలసిపోకుండా పాత్రలు కడిగిన అవే చేతులు, ఇప్పుడు బెంగాల్ రాజకీయాల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి, మార్చడానికి సిద్ధంగా ఉన్నాయి

పశ్చిమ బెంగాల్‌లోని ఔస్‌గ్రామ్ (Ausgram) నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న 37 ఏళ్ల కలితా మాఝీ కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పేదరికం నుండి వచ్చి, రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూ, క్షేత్రస్థాయి నుండి ఎదిగిన నాయకురాలిగా  గుర్తించిన  బీజేపీ ఆమె  రెండోసారి పోటీలో నిలపడం విశేషం. 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆమె ఇదే స్థానం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. 2026లో కూడా పార్టీ ఆమెపై నమ్మకంతో మళ్ళీ టికెట్ ఇచ్చింది. ఇంటింటి ప్రచారం నిర్వహించి వార్తల్లో నిలిచారు. ఆమెకు భర్త (ప్లంబర్), ఒక కుమారుడు ఉన్నారు.

ఆమె పనిచేసే ఇంటి యజమాని ప్రతీలాల్ పాత్ర మాట్లాడుతూ.. "ఆమె మాకు కూతురు లాంటిది. అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కూడా ఆమె పనికి వస్తానంది, కానీ మేమే ఆమెను ప్రచారానికి వెళ్లమని పంపించేశాం. ఆమె లేకపోవడంతో ఇంట్లో పనులు చేసుకోవడం మాకు కష్టమవుతోంది, కానీ ఆమె ఎమ్మెల్యే అవ్వాలని కోరుకుంటున్నాం" అన్నారు. అంతేకాదు ఆమె ప్రచారంలో తలనమునకలై ఉన్నప్పటికీ, ఆమె యజమానులు ఈ నెల జీతాన్ని కూడా ఇస్తామని హామీ ఇవ్వడం విశేషం.

ఇదీ చదవండి: జస్ట్‌, పెళ్లికి ముందు : వరుడి వింత ప్రశ్న, అతిథులు అవాక్కు

ఎవరీ కలితా మాఝీ
ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం నుండి వచ్చిన కలితా ఇళ్లలో పనిమనిషిగా పనిచేస్తూ, నెలకు సుమారు రూ.4,500 సంపాదిస్తూ జీవనం సాగిస్తున్నారు. కలిత తన నిజాయితీతో, కష్టపడే తత్వంతో తాను పనిచేసే ఇళ్లలో కుటుంబ సభ్యురాలిగా మారిపోయారు.  ఇపుడు ఎన్నికల్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించు కుంటున్నారు.  కలితా కుటుంబ మద్దతు కూడా బాగానే లభిస్తోంది.  ఆమె అత్తగారు ఇంటి పనుల్లో సాయం చేస్తుండగా, ఆమె కుమారుడు పార్థ తన తల్లి ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. కలిత బావ కార్తీక్ బాగ్ 2006లో ఇదే నియోజకవర్గం నుండి సీపీఎం ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే ప్రస్తుతం ఆ కుటుంబంతో వీరికి ఎటువంటి సంబంధం లేదు.

ఇదీ చదవండి: నో క్రాష్ డైట్‌, నో షార్ట్‌కట్‌ : కేవలం 45 రోజుల్లో 12 కిలోలు

"నాలాంటి ఒక సామాన్య మహిళ కూడా ఎమ్మెల్యే కాగలదని నిరూపించాలనుకుంటున్నాను. గెలిచిన తర్వాత నాలాంటి పేద ప్రజల గొంతుకగా అసెంబ్లీలో మాట్లాడతాను" అని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒక సాధారణ కార్మికురాలు ప్రజా ప్రతినిధిగా ఎదగాలనుకోవడం ప్రజాస్వామ్యానికి నిదర్శనమని స్థానికులు కొనియాడుతున్నారు. ఆల్‌ది బెస్ట్‌ చెబుతున్నారు.  కలిత గెలుపు కోసం మే 4 వరకు ఎదురు చూడాల్సిందే. 

కాగా పశ్చిమ బెంగాల్‌లో జరిగిన తొలిదశ అసెంబ్లీ ఎన్నికల్లో  రికార్డ్‌ స్థాయిలో 91.78శాతం పోలింగ్ నమోదైంది.  మొత్తం 294 స్థానాలున్న బెంగాల్‌లో ఏప్రిల్ 23, ఏప్రిల్ 29న రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ  నేతృత్వంఓలని అధికార టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. దీదీని ఓడించి  ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రధాని మోదీ, షాలు తీవ్రప్రయత్నాలు చేయగా,  నాలుగోసారి సీఎం పదవే తనదేనని దీదీ  ధీమాగా ఉన్నారు.  మే 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

ఇదీ చదవండి: బంపర్‌ ఆఫర్‌ : డేటింగ్ యాప్ వాడితే వారికి డబ్బులు
 

Advertisement
 
Advertisement
Advertisement