జపాన్‌లో జననాల రేటు సంఖ్య రోజు రోజుకు క్షీణిస్తోంది. అందుకే జపాన్ ప్రభుత్వం అక్కడి సింగిల్ కింగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. యువత డేటింగ్ యాప్స్ ద్వారా భాగస్వాములను వెతుక్కునే ప్రక్రియకు ప్రభుత్వమే ఖర్చు భరిస్తానంటోంది. పదండి మరి ఈ ఇంట్రస్టింగ్ ఆఫర్ కథా కమామిష్షు ఏంటో తెలుసుకుందాం.
జపాన్‌లో తగ్గుతున్న జనాభా సంఖ్యను పెంచడానికి అక్కడి స్థానిక ప్రభుత్వాలు వినూత్నమైన ప్రయత్నాలు చేస్తున్నాయి. ‘మీటింగ్ సపోర్ట్ ప్రాజెక్ట్ గ్రాంట్’ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది. యువత పెళ్లిళ్లు, పిల్లల్ని కనడం పట్ల పెద్దగా ఆసక్తి చూపని నేపథ్యంలో జపాన్‌లోని కోచి ప్రావిన్స్ ప్రభుత్వం 2026 ఏప్రిల్ ఒకటి నుంచి ఈ పథకం అమల్లోకి తీసుకొచ్చింది.
జపాన్‌లోని తీవ్రమైన జనాభా క్షీణతను అరికట్టడానికి అక్కడి స్థానిక ప్రభుత్వాలు యువతకు 'డేటింగ్ యాప్ సబ్సిడీలు' అందిస్తున్నాయి. యువత పెళ్లిళ్లు చేసుకుని పిల్లల్ని కనేలా ప్రోత్సహించడమే ఈ పథకాల ఉద్దేశ్యం.
ఇదీ చదవండి: నో క్రాష్ డైట్, నో షార్ట్‌కట్ : కేవలం 45 రోజుల్లో 12 కిలోలు
20 -39 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఒంటరి యువతీ యువకులకు ఈ సదుపాయం కల్పిస్తోంది.
గుర్తింపు పొందిన 'టాపిల్' (Tapple) వంటి మ్యాచ్ మేకింగ్ యాప్స్ వాడకానికి అయ్యే ఖర్చులో 20,000 యెన్ల (సుమారు రూ. 12 వేలు) వరకు ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది.
ఏప్రిల్ 2026 నుండి మార్చి 2027 మధ్య జరిగే ఖర్చులకు ఇది వర్తిస్తుంది.
భద్రత ,విశ్వసనీయత ప్రమాణాలు పాటించే నిర్దేశిత యాప్‌లను వాడేవారికి మాత్రమే ఈ నగదు అందుతుంది.
కేవలం కోచి మాత్రమే కాకుండా జపాన్‌లోని ఇతర ప్రాంతాలు కూడా ఇలాంటి వినూత్న చర్యల్ని చేపట్టాయి. మియాజాకి ప్రిఫెక్చర్‌లో 10,000 యెన్ల వరకు సబ్సిడీని ఇప్పటికే అందిస్తున్నారు. జపాన్ రాజధానిలో టోక్యోలో పని-జీవిత సమతుల్యత కోసం ఉద్యోగులకు వారానికి 4 రోజుల పనిదినాలను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. తద్వారా యువతకు తమ వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టే సమయం దొరుకుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.
జపాన్ ప్రభుత్వం ఈ స్థాయిలో నిర్ణయాలు తీసుకోవడానికి కారణం అక్కడి జనాభా గణాంకాలే అంటున్నారు విశ్లేషకులు. 2024లో జపాన్ జనాభా రికార్డు స్థాయిలో 9,08,574 తగ్గింది. గతేడాది సుమారు 16 లక్షల మంది మరణించగా, పుట్టిన వారు కేవలం 6,86,061 మంది మాత్రమే. అంటే జననాల కంటే మరణాలు రెట్టింపుగా ఉన్నాయి. ఒక సర్వే ప్రకారం, 39 ఏళ్ల లోపు వివాహం చేసుకున్న ప్రతి నలుగురిలో ఒకరు ఆన్‌లైన్ డేటింగ్ ద్వారానే తమ భాగస్వామిని కలుసుకున్నారు. అందుకే ప్రభుత్వం ఈ మార్గాన్ని ఎంచుకుంది. మరి ఈ 'డేటింగ్ యాప్ సబ్సిడీ' దేశ భవిష్యత్తును కాపాడటంలో ఎంతవరకు విజయ వంతం అవుతుందో వేచి చూడాలి.
ఇదీ చదవండి: జస్ట్, పెళ్లికి ముందు : వరుడి వింత ప్రశ్న, అతిథులు అవాక్కు


