ఢిల్లీకి చెందిన 31 ఏళ్ల మార్కెటింగ్ ప్రొఫెషనల్ మృదుల్ అరోరా, క్రమశిక్షణ, పట్టుదలతో తన బాడీ షేప్‌ను చక్కగా మార్చుకున్నాడు. బిజీ లైఫ్ స్టైల్ తన అస్తవ్యస్తమైన జీవనశైలి, నిరంతరం అలసటతో బాధపడే వ్యక్తి పొరబాటును గ్రహించి, క్రమశిక్షణ, నిలకడ, అంకితభావానికి ప్రాధాన్యతనిచ్చి, అనుకున్నట్టుగా బరువును తగ్గించుకున్నాడు. తన ఫిట్‌నెస్‌ను ఒక 'మార్కెటింగ్ క్యాంపెయిన్' లాగా భావించి ఈ లక్ష్యాన్ని సాధించడం విశేషం.
మార్కెటింగ్ నిపుణుడు మృదుల్ అరోరా చాలా మంది ఉద్యోగ నిపుణుల మాదిరిగానే గంటల తరబడి కూర్చోవడం, వేళాపాళాలేని ఆహారపు అలవాట్లతో గడిపేవాడు. అయితే ఎలాంటి అనారోగ్యం లేకపోయినా ఉన్నట్టుండి శక్తి తగ్గిపోయినట్టు అనిపించడం మొదలైంది. 97 కిలోలకు చేరుకోవడంతో బాగా అలసటగా అనిపించేది. కానీ హఠాత్తుగా తన శరీరాన్ని మార్చుకోవాలనుకోలేదు మృదుల్. డెడ్ లైన్లు, ఆఫీసు పని ఒత్తిడిలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నానని గ్రహించిన మృదుల్ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. క్రమంగా బరువు తగ్గించుకోవడానికి 45 రోజుల గడువు పెట్టుకున్నాడు.
ఇందుకోసం అధిక ప్రోటీన్డ్‌ఫుడ్, రోజువారీ వ్యాయామాలు, ఇంకా మరెన్నో అంశాలపై దృష్టిపెట్టాడు.
అన్నింటి కన్నా ముఖ్యంగా,క్రాష్ డైట్‌లు లేవు. షార్ట్‌కట్‌లు లేవు.
ఏం తింటున్నాం, ఎంత తినాలి అనే క్యాలరీ మేనేజ్‌మెంట్‌పై దృష్టిపెట్టారు. తీసుకునే ఆహారం కంటే ఖర్చు చేసే క్యాలరీలు ఎక్కువగా ఉండేలా చూసుకున్నాడు.
ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడంతోపాటు, జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారానికి పూర్తిగా దూరం
ప్రతిరోజూ వ్యాయామం చేయడం.
తగినంత నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం.
దీంతోపాటు ప్రతి వారం తన బరువును, ఎనర్జీ లెవల్స్‌ను గమనిస్తూ రికార్డ్ చేసుకునేవాడు. తద్వారా మరింత ప్రేరణ పొందేవాడు.
ఫలితంగా అతని బరువు కేవలం 45 రోజుల్లో 97 కిలోల నుండి 85 కిలోలకు చేరింది. అంటే దాదాపు 12 కిలోల బరువు తగ్గడమే కాకుండా ఆత్మవిశ్వాసం పెరిగింది, పనిలో మరింత చురుగ్గా ఉండేవాడు.
తన వెయిట్‌లాస్ జర్నీపై మృదులు ఏమంటారంటే.. "తీవ్రత (Intensity) కంటే స్థిరత్వం (Consistency) ముఖ్యం. ప్రతిరోజూ చేసే చిన్న చిన్న ప్రయత్నాలే పెద్ద మార్పులకు దారితీస్తాయి. సమయం కోసం ఎదురుచూడకుండా, బరువు తగ్గాలనుకునే ప్రయాణాన్ని ఇపుడే మొదలు పెట్టండి అని సూచించారు.
నోట్ : బరువు తగ్గడానికి ఖరీదైన ప్లాన్లు అవసరం లేదు, కేవలం క్రమశిక్షణ, అంకితభావం ఉంటే చాలు! కానీ ఈ ప్రయాణాన్ని మొదలు పెట్టే ముందు, మన బరువు ఎంత ఉంది? ఎంత తగ్గాలి, ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి? అసలు బరువు పెరగడానికి కారణాలను విశ్లేషించుకోవాలి. ఇందుకు నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.
ఇదీ చదవండి: జస్ట్, పెళ్లికి ముందు : వరుడి వింత ప్రశ్న, అతిథులు అవాక్కు


