అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో దారుణ పరాభవం. ఆ వెంటనే పార్టీ నేతలపై దాడులు. నిరసనలు.. వీధి పోరాటాల పిలుపు నేపథ్యంలో కీలక సమావేశానికి రావాలని స్వయంగా పార్టీ అధినేత్రి నుంచి ఆహ్వానం. కానీ ఊహించని విధంగా భారీ సంఖ్యలో ఎమ్మెల్యేల డుమ్మా! దీంతో ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో ఒకటే చర్చ. అసలు టీఎంసీలో ఏమి జరుగుతోంది?.. ఇది కేవలం రాజకీయ ఉద్రిక్తతల ప్రభావమా? లేక మరేదైనా పెద్ద సంకేతమా?
పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రస్తుతం రాజకీయంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై దాడి జరగడం కొత్త వివాదానికి తెరతీసింది. ఆ ఘటన తర్వాత పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ కలీఘాట్ నివాసంలో అత్యవసరంగా ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే 80 మంది ఎమ్మెల్యేల్లో కేవలం 20 మంది మాత్రమే హాజరయ్యారు. ఈ పరిణామంతో మమత సైతం ఆశ్చర్యానికి లోనయ్యారు. దీంతో.. చేసేది లేక సమావేశం వాయిదా వేశారు.
సాధారణంగా రాజకీయ సంక్షోభ సమయంలో పార్టీ అధినేత పిలిస్తే శాసనసభ్యులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. అలాంటిది దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు సమావేశానికి దూరంగా ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఎన్నికల తర్వాత టీఎంసీ ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో ఈ గైర్హాజరు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
అయితే టీఎంసీ దీనికి భిన్నమైన వివరణ ఇస్తోంది. అభిషేక్ బెనర్జీపై దాడి జరిగిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయని, పలువురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలతో కలిసి ఆందోళనలను పర్యవేక్షిస్తున్నారని పార్టీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ తెలిపారు. పరిస్థితుల దృష్ట్యా సమావేశాన్ని వాయిదా వేయాలని వారే కోరారని, అందుకే పార్టీ అంగీకరించిందని చెప్పారు.
కానీ ఈ వ్యవహారంలో రాజకీయంగా మరింత ఆసక్తికరమైన అంశం ఆరోపణలు-ప్రత్యారోపణలే. అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి వెనుక బీజేపీ అనుకూల వర్గాల హస్తం ఉందని టీఎంసీ ఆరోపిస్తోంది. మరోవైపు బీజేపీ మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తూ, దాడికి పాల్పడింది టీఎంసీకి చెందిన వర్గాలేనని ఎదురుదాడి చేస్తోంది. పార్టీ అంతర్గత విభేదాలను కప్పిపుచ్చుకునేందుకే బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారని కమలనాథులు విమర్శిస్తున్నారు.
ఇక్కడే రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఒకవేళ బీజేపీ చెబుతున్నట్లుగా ఈ ఘటన వెనుక నిజంగానే టీఎంసీ అంతర్గత వర్గాల ప్రమేయం ఉన్నట్లు తేలితే.. అది పార్టీకి పెద్ద రాజకీయ, సంస్థాగత సవాలుగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్నికల తర్వాత నాయకత్వం, వారసత్వం, భవిష్యత్ వ్యూహాలపై పార్టీలో అసంతృప్తి ఉందన్న ప్రచారానికి అప్పుడు మరింత బలం చేకూరే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సమావేశానికి భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం కూడా అదే కోణంలో విశ్లేషణకు దారితీయొచ్చు.
అయితే ప్రస్తుతం ఈ ఆరోపణలకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు బయటకు రాలేదు. అందుకే టీఎంసీ, బీజేపీ రెండూ తమ తమ రాజకీయ కథనాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. ఒకవైపు అభిషేక్ బెనర్జీపై దాడిని ప్రజా ఉద్యమంగా మలచాలని టీఎంసీ భావిస్తుండగా, మరోవైపు అధికార పార్టీ అంతర్గత సంక్షోభాన్ని ఎత్తిచూపాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.
ఈ నేపథ్యంలో టీఎంసీ మరింత దూకుడైన ఆందోళన కార్యక్రమాలను ప్రకటించింది. బ్లాక్ స్థాయి నుంచి వార్డు స్థాయి వరకు నిరసన ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించింది. కోల్‌కతాలో మమతా బెనర్జీ స్వయంగా పాల్గొనే ధర్నా కార్యక్రమాన్ని కూడా ప్రకటించింది. ఎన్నికల అనంతర హింస, కార్యకర్తలపై దాడులు, బుల్డోజర్ చర్యలు వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
మొత్తంగా చూస్తే.. అభిషేక్ బెనర్జీపై దాడి కంటే, ఆ తర్వాత జరిగిన పరిణామాలే ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారాయి. 80 మంది ఎమ్మెల్యేల్లో 60 మంది గైర్హాజరు కావడం, బీజేపీ-టీఎంసీ మధ్య ఆరోపణల యుద్ధం, వీధి పోరాటాలకు పార్టీ సిద్ధమవడం.. ఇవన్నీ కలిసి ఒక పెద్ద రాజకీయ కథకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి. అసలు ఇది కేవలం ఒక దాడి ఘటన ప్రభావమా? లేదంటే టీఎంసీలో జరుగుతున్న లోతైన రాజకీయ మార్పులకు సూచనా? అనేది రాబోయే రోజుల్లో మరింత స్పష్టమయ్యే అవకాశం ఉంది.


