
18 మంది మృతి, పలువురు గల్లంతు
కొనసాగుతున్న సహాయక చర్యలు
డెహ్రాడూన్/సిమ్లా: హిమాలయాల్లోని హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో మళ్లీ మేఘ విస్ఫోటం సంభవించింది. సోమవారం రాత్రి నుంచి వివిధ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ఆకస్మిక వరదలు సంభవించి కొండచరియలు విరిగిపడ్డాయి. ఇందుకు సంబంధించిన ఘటనల్లో ఉత్తరాఖండ్‌లో 15 మంది, హిమాచల్ ప్రదేశ్‌లో ముగ్గురు చనిపోయారు. వీరిలో యూపీలోని మొరాదాబాద్ జిల్లాకు చెందిన ఆరుగురు ట్రాక్టర్ ట్రాలీలో డెహ్రాడూన్‌లో టాన్స్ నదిని దాడుతుండగా వచ్చిన వరదలో కొట్టుకు పోయినవారున్నారు. ఉత్తరాఖండ్‌లో గల్లంతైన 16 మంది కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలతోపాటు ఫైర్ సిబ్బంది రంగంలోకి అన్వేషణ చేపట్టారు.
వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన సుమారు 900 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జఝ్రా ప్రాంతంలో చిక్కుకుపోయిన మరో ఎనిమిది మందిని కాపాడేందుకు అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. కొండప్రాంతాల నుంచి వచ్చి పడుతున్న వరదల్లో కార్లు కొట్టుకుపోగా, ఇళ్లు, వ్యాపార సంస్థలు దెబ్బతిన్నాయి. డెహ్రాడూన్‌లో పలు వంతెనలు కొట్టుకుపోయాయి. గంగ, యమున నదులు ప్రమాద స్థాయికి దగ్గర్లో ప్రవహిస్తున్నాయి. వివిధ ఘటనల్లో ముగ్గురు చనిపోయారు. టామ్సా నది ప్రమాద స్థాయికి చేరుకుంది.
దీంతో–ముస్సోరి రోడ్డుపై పలు ప్రాంతాల్లో వరద చేరడంతో పర్యాటకులు, సందర్శకులు ఎక్కడి వారక్కడే ఉండిపోవాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోనూ పరిస్థితి దాదాపు ఇంతే తీవ్రంగా ఉంది. సిమ్లాలో 12 గంటల వ్యవధిలో 14.2 సెంటీమీటర్ల వాన కురిసింది. అతిభారీ వర్షం కురియడంతో మండి జిల్లాలోని ధరంపూర్‌లో ప్రధాన బస్‌స్టాండ్ వరదలో మునిగిపోయింది. ఒక వర్క్‌షాప్, పంప్ హౌస్‌తోపాటు దుకాణాలు, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన 20 బస్సులు నీట మునిగిపోయాయి. ఒక వ్యక్తి గల్లంతైనట్లు చెబుతున్నారు. పలు వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి.
మండి జిల్లా బ్రాగ్టా గ్రామంలో ఇల్లు కూలి ఇద్దరు మహిళలు, చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన మరో ఇద్దరిని ఆస్పత్రిలో చేర్పించారు. గల్లంతైన మరో నలుగురి కోసం సహాయక సిబ్బంది తీవ్రంగా గాలింపు చేపట్టారు. సిమ్లాలోని హిమ్‌ల్యాండ్ సమీపంలో మట్టి చరియలు విరిగి ప్రధాన రహదారి మూసుకుపోయింది. పలు వాహనాలను మట్టి, బురద కప్పేశాయి. ధరంపూర్‌లో వరద కారణంగా ఆర్టీసీ బస్సులకు రూ.6 కోట్ల మేర నష్టం వాటిల్లిందని డిప్యూటీ సీఎం ముకేశ్ అగ్ని హోత్రి తెలిపారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో కొనసాగు తున్న ప్రకృతి బీభత్సం వె