
కీలక ఉద్యోగ నైపుణ్యాలుగా విశ్లేషణ, విమర్శనాత్మక ఆలోచన, భావోద్వేగ మేధస్సు
‘గ్లోబల్ సర్వే ఆఫ్ ఎంప్లాయర్స్’నివేదికలో వెల్లడి
వరల్డ్ ఎకనామిక్ ఫోరం ‘ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ 2025’నివేదికలోనూ ప్రస్తావన
రోజురోజుకు కృత్రిమమేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ వినియోగం విస్తృతం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌కు అనుగుణంగా ఉద్యోగాల సాధన ఉద్యోగార్థులకు కష్టసాధ్యంగా మారుతోంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో కార్పొరేట్ సంస్థలు కోరుకున్న విధంగా వివిధ నైపుణ్యాలున్న వారు ఉద్యోగాలు పొందడం సులభమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే... విమర్శనాత్మక ఆలోచన, విశ్లేషణాత్మక నైపుణ్యాలు, భావోద్వేగ మేధస్సు వంటివి కీలక ఉద్యోగ నైపుణ్యాలుగా పరిగణిస్తున్నారు.
ఏఐ, మెషీన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా విశ్లేషణ వంటి సాంకేతిక నైపుణ్యాలకూ అధిక డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో అత్యంత ముఖ్యమైన ఉద్యోగ నైపుణ్యాలపై ‘గ్లోబల్ సర్వే ఆఫ్ ఎంప్లాయర్స్’నివేదిక రూపొందించింది. అలాగే, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆయా నైపుణ్యాలకు ర్యాంకింగ్స్ ఇస్తూ ‘ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ 2025’నివేదికను వెలువరించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా 1.41 కోట్లకు పైగా ఉద్యోగులున్న 1,043 కంపెనీల ప్రతినిధుల అభిప్రాయాల ఆధారంగా రిపోర్ట్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ర్యాంకింగ్స్‌లో అనలిటికల్ థింకింగ్ (విశ్లేషణాత్మక ఆలోచన) 69 శాతంతో అగ్రస్థానంలో నిలుస్తోంది. – సాక్షి, హైదరాబాద్
ఇక భారత్ విషయానికొస్తే...
వివిధ అధ్యయనాలు, సర్వేలు, నిపుణుల అభిప్రాయాలు సూచనలను బట్టి చూస్తే దేశంలో ముఖ్యమైన ఉద్యోగ నైపుణ్యాలు... కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్, డేటా అనాలిసిస్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ చుట్టూ కేంద్రీకృతం అవుతున్నాయి. భారత్‌లో కంపెనీలు కోరుకుంటున్న ముఖ్య సాంకేతికత ఇలా ఉన్నాయి.
కృత్రిమ మేథ,మెషీన్ లెర్నింగ్:
ఏఐ అల్గోరిథంలు, న్యూరల్ నెట్‌వర్క్ అప్లికేషన్లలో నైపుణ్యం కలిగిన నిపుణులకు డిమాండ్.
డేటా విశ్లేషణ:
డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడం ఒక ప్రమాణంగా మారుతోంది. అందువల్ల డేటా మానిప్యులేషన్, గణాంక విశ్లేషణ, విజువలైజేషన్‌లో నైపుణ్యాల ఆవశ్యకత పెరిగింది.
సైబర్ భద్రత: రోజురోజుకు సైబర్ ముప్పు పెరుగుతుండటంతో నెట్‌వర్క్‌ల రక్షణలో నైపుణ్యాలు, సాంకేతికంగా ఎదురయ్యే ముప్పును అర్థం చేసుకోవడం, భద్రతా ప్రోటోకాల్ అమలుకు అత్యంత ప్రాధాన్యత
క్లౌడ్ కంప్యూటింగ్: వ్యాపారాలు క్లౌడ్‌లోకి మార్పిడి జరుగుతుండటంతో, క్లౌడ్ సేవలు, ఆర్కిటెక్చర్ డిజైన్, డిప్లాయ్‌మెంట్ వ్యూహాల పరిజ్ఞానం వంటి వాటికి అధిక డిమాండ్
సాఫ్ట్‌వేర్ అభివృద్ధి: సాఫ్ట్‌వేర్ డెవలపర్ల కోసం ముఖ్యంగా ఏఐ–ఆధారిత అప్లికేషన్‌లు, క్లౌడ్ టెక్నాలజీలలో అనుభవం ఉన్నవారి కోసం డిమాండ్.
బ్లాక్‌చైన్ టెక్నాలజీ: ఫైనాన్స్, సప్లయ్ చైన్ పరిశ్రమల్లో పరివర్తనాత్మక ప్రభావంతో బ్లాక్‌చెయిన్ నిపుణులకు డిమాండ్ పెరిగింది.
సాఫ్ట్ స్కిల్స్, అనుకూలతలు:కొత్త వ్యవస్థలను త్వరగా నేర్చుకోవడం, మారుతున్న పని వాతావరణాలకు అనుగుణంగా మారడం, కొత్త సాంకేతికతలను స్వీకరించే సామర్థ్యం చాలా ముఖ్యం.
సమస్య పరిష్కారం: దినచర్యలనూ ఆటోమేట్ చేస్తున్నందున సంక్లిష్ట సమస్యల పరిష్కారం, విమర్శనాత్మక ఆలోచనా నైపుణ్యాలకు డిమాండ్ పెరిగింది.
భావోద్వేగ మేధస్సు: ఆటోమేటెడ్ ప్రపంచంలో సానుభూతి, భావోద్వేగ మేధస్సు వంటి మానవ నైపుణ్యాలకు డిమాండ్.
నాయకత్వం, సామాజిక ప్రభావం: టీమ్‌లకు మార్గనిర్దేశం చేయడానికి, సంక్లిష్ట పరిస్థితులను అధిగమించడానికి సమర్థ నాయకత్వం, సామాజిక ప్రభావ నైపుణ్యాలు ముఖ్యం.
కస్టమర్ సర్వీస్: వ్యాపార విజయానికి బలమైన కస్టమర్ సంబంధాలను పెంపొందించుకోవడం ముఖ్యం.
డిజిటల్ మార్కెటింగ్: వ్యాపారాలు తమ నిర్దేశిత, టార్గెటెడ్ కస్టమర్లను చేరుకునేందుకు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమేషన్ స్కిల్స్, కంటెంట్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్‌లో నైపుణ్యాలు చాలా అవసరం వ్యాపారాలు తమ నిర్దేశిత, టార్గెటెడ్ కస్టమర్లను చేరుకునేందుకు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమేషన్ స్కిల్స్, కంటెంట్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్‌లో నైపుణ్యాలు చాలా అవసరం
ప్రాజెక్ట్ నిర్వహణ: వనరుల నిర్వహణ, సాంకేతిక ప్రాజెక్ట్ నాయకత్వంతో సహా ప్రాజెక్ట్ నిర్వహణ నైపుణ్యాలకు డిమాండ్ ఉంది.
