గోరఖ్‌పూర్: బీజేపీ ఎంపీ, నటుడు రవి కిషన్‌ను హత్య చేస్తామంటూ బెదిరింపులు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. తమ వర్గాన్ని అనుమానించేలా రవి కిషన్ మాట్లాడారంటూ నిందితుడు ఆవేశంతో రగిలిపోయాడు. అయితే, ఈ బెదిరింపులపై ఎంపీ రవి కిషన్ స్పందిస్తూ ఇలాంటి ఫోన్ కాల్స్‌కు తాను భయపడే ప్రసక్తే లేదని తెలిపారు. దీంతో, బెదిరింపుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
వివరాలు ఇలా ఉన్నాయి.. ఈ ఘటనలో నిందితుడు బీహార్‌లోని అరా జిల్లాకు చెందిన అజయ్ కుమార్.. ఎంపీ వ్యక్తిగత కార్యదర్శి శివం ద్వివేదీకి ఫోన్ చేసి ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో ద్వివేది స్పందిస్తూ.. ‘రవి కిషన్ మా వర్గాన్ని అవమానించేలా మాట్లాడాడు. కాబట్టి అతన్ని కాల్చేస్తాం. ఎంపీకి సంబంధించి ప్రతీ కదలిక నాకు తెలుసు. నాలుగు రోజుల్లో అతను బీహార్‌కు వచ్చేటప్పుడు.. చంపేస్తాం’ అని హెచ్చరించాడు. ఇదే సమయంలో ఎంపీని ఉద్దేశిస్తూ నిందితుడు పలు అభ్యంతరకర వ్యాఖ్యలు కూడా చేశాడని తెలిపారు.
ఇదిలా ఉండగా, రవికిషన్ ఏ వర్గాన్ని ఉద్దేశిస్తూ.. ఎలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయలేదని ద్వివేది పేర్కొన్నారు. ఈ ఘటనపై గోరఖ్‌పుర్‌లోని పోలీస్‌స్టేషన్‌లో ఎంపీ సిబ్బంది ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎంపీకి భద్రత పెంచాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మరోవైపు, ఈ బెదిరింపు ఫోన్ కాల్‌పై గోరఖ్‌పూర్ ఎంపీ రవి కిషన్ స్పందిస్తూ..‘నన్ను ఫోన్‌లో దుర్భాషలాడారు, నా తల్లి గురించి కూడా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. నన్ను చంపేస్తామని బెదిరించారు. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదన్నారు. ప్రజాస్వామ్య బలం, సైద్ధాంతిక సంకల్పంతో ఇలాంటి వాటిని ఎదుర్కొంటాను. ఇటువంటి వ్యక్తులే సమాజంలో ద్వేషం, అరాచకత్వాన్ని వ్యాప్తి చేస్తారు. ప్రజాసేవ, ధర్మమార్గంలో నడవాలనేది నా రాజకీయ వ్యూహం. ఇది నా వ్యక్తిగత గౌరవంపై ప్రత్యక్ష దాడి మాత్రమే కాదు.. మనందరిపై దాడి’ అని వ్యాఖ్యలు చేశారు.


