
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. 61వ జన్మదినం సందర్భంగా బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ అంతర్గత భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడానికి, ప్రతి భారతీయుడూ భద్రతతో కూడిన గౌరవప్రదమైన జీవితం గడపడానికి అమిత్ షా అహరి్నశలూ కృషి చేస్తున్నారని మోదీ ప్రశంసించారు. ప్రజాసేవ పట్ల అమిత్ షా అంకితభావం, కష్టపడిపనిచేసే తత్వం అందరినీ ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. ఈ మేరకు మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు.
అమిత్ షాకు కేంద్ర మంత్రి, బీజేపీ అధ్యక్షుడు జగత్‌ప్రకాశ్ నడ్డా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్, బిహార్ సీఎం నితీశ్ , జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి, అస్సాం సీఎం హిమంతబిశ్వ శర్మ, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, అరుణాచల్‌ప్రదేశ్ సీఎం పెమా ఖండూ తదితరులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అమిత్ షా 1964 అక్టోబర్ 22న ముంబైలో జని్మంచారు. తొలిసారిగా 2002లో గుజరాత్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. హోంశాఖ సహా పలు కీలక శాఖల మంత్రిగా సేవలందించారు. నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమిత్ షా అత్యంత కీలకంగా వ్యవహరించారు. నంబర్ టూ స్థానానికి చేరుకున్నారు. 2014 జూలైలో అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2019లో కేంద్ర హోంశాఖ మంత్రి బాధ్యతలు చేపట్టారు. ఆయన మంచి వ్యూహకర్తగా, మోదీకి నమ్మినబంటుగా పేరుగాంచారు.