దేశంలో పెరిగిపోతున్న ఉల్లం‘ఘనులు’

Traffic Challan Increased Four Times After New MV Rules Implemented - Sakshi

ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ లేడు కదా అని సిగ్నల్‌ జంప్‌ చేసినా, రోడ్డు బాగుంది కదా అని పరిమితికి మించి వేగంగా నడిపారో జాగ్రత్త. మీ కోసం ఛలానా రెడీగా ఉంటుంది. ట్రాఫిక్‌ నిబంధనలు మీరు ఉల్లంఘించడం పోలీసులు చూడకపోయినా మెషిన్లు చూస్తున్నాయి. మీ తప్పులను అట్టే పసిగట్టి ఫైన్లు విధిస్తున్నాయి. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే ట్రాఫిక్‌ ఫైన్ల సంఖ్య నాలుగు రెట్లు పెరిగాయి.

7.7 కోట్ల ఛలానాలు
నూతన మోటారు వాహనాల చట్టం 2019 అమల్లోకి వచ్చిన తర్వాత ట్రాఫిక్‌ ఛలాన్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఫైన్లు కడుతున్న వారి సంఖ్య పెరిగిపోయింది. 2017 ఆగస్టు 1 నుంచి 2019 ఆగస్టు 1 వరకు దేశవ్యాప్తంగా 1.9 కోట్ల జరిమానాలు విధిస్తే 2019 ఆగస్టు నుంచి 2021 జులై వరకు ఈ సంఖ్య ఏకంగా 7.7 కోట్లకు చేరుకుంది.  ఇదే కాలానికి తమిళనాడులో ట్రాఫిక్‌ ఛలాన్ల సంఖ్య 10.50 లక్షల నుంచి ఏకంగా 2.5 కోట్లకు చేరుకుంది. దాదాపు 24 రెట్లు ఎక్కువగా ఈ రాష్ట్రంలో అధికారికంగా ట్రాఫిక్‌ ఉల్లంఘనలు జరిగినట్టుగా రికార్డయ్యింది. 

దేశ రాజధానిలో
నేషనల్‌ కాపిటల్‌ రీజియన్‌లో ఉండి ఎల్లవేళలా వీఐపీల తాకిడి ఎక్కువగా ఉండే ఢిల్లీలోనూ ట్రాఫిక్‌ ఉల్లంఘనలు తక్కువగా లేవు. కిలోమీటరకు నలుగురు కానిస్టేబుళ్లు ఉండే దేశ రాజధానిలో ఛలాన్ల సంఖ్య 49.70 లక్షల నుంచి 2.2 కోట్లకు చేరుకుంది. ముంబై, కోల్‌కతా, చెన్నైలలో రిజిస్టరయిన వాహనాల సంఖ్య కంటే ఢిల్లీలో జారీ అయిన ట్రాఫిక్‌ ఛలాన్ల సంఖ్యనే ఎక్కువ. ఇక్కడ సగటున ఒక్కో వాహనంపై రెండు మూడు వరకు జరిమానాలు ఉన్నాయి. మరోవైపు గుజరాత్‌, హర్యానలో ఈ చలాన్ల సంఖ్య తగ్గింది.

కెమెరాల వల్లే
గతంలో ట్రాఫిక​ రూల్స్‌ మీరిన వారికి  పోలీసులే ఫైన్లు విధించడం చేసే వారు కానీ ఇప్పుడా పనిని సీసీ కెమెరాలు చేస్తున్నాయి. టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో మనుషులు చేసే పనిని అవే చేస్తున్నాయి. దీంతో ఓవర్‌ స్పీడ్‌, సిగ్నల్‌ జంప్‌, రాంగ్‌సైడ్‌ డ్రైవింగ్‌, ట్రిపుల్‌ రైడింగ్‌ ఇలా  ప్రతీ ఒక్క సంఘటన రికార్డు అవుతోందని పోలీసులు అధికారులు అంటున్నారు. కొత్త మోటారు వాహనాల చట్టం అమల్లోకి రాకముందు ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించే విషయంలో నిర్లక్ష్యం ఉండేదని ఇప్పుడది తగ్గిందని రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కారీ అభిప్రాయపడ్డారు. 

వివిధ రాష్ట్రాల్లో ట్రాఫిక్‌ ఛలాన్ల పెరిగిన తీరు (ఆగస్టు నుంచి ఆగస్టు వరకు)

రాష్ట్రం               2017  నుంచి 2019         2019 నుంచి 2021
తమిళనాడు         10.5 లక్షలు                      2.50 కోట్లు
ఢిల్లీ                     49.70 లక్షలు                    2.20 కోట్లు
ఉత్తర్‌ప్రదేశ్‌        44.30   లక్షలు                  1.50 కోట్లు
హర్యాన               41.60 లక్షలు                    27.30 లక్షలు
గుజరాత్‌             27.80 లక్షలు                    11.40 లక్షలు

మొత్తం               1.90 కోట్లు                          7.70 కోట్లు
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top