కరోనాతో మరో మావోయిస్టు అగ్రనేత మృతి

Top Maoist Leader Vinod Succumbed Due To Covid In Chhattisgarh - Sakshi

దంతేవాడ (చత్తీస్‌ఘడ్‌) : మావో​యిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. కరోనా కాటుకు మావోయిస్టు అగ్రనేత వినోద్‌ మృతి చెందారు. ఇన్ఫెక్షన్ తీవ్రత పెరగడంతో వినోద్‌ మృత్యువాత పడ్డారు. మూడు దశబ్ధాల కిందటే తెలంగాణ నుంచి చత్తీస్‌గడ్‌కి వెళ్లిన మావోయిస్టుల్లో వినోద్‌ కూడా ఒకరు. చత్తీస్‌గడ్‌లో జనతన సర్కార్‌ను విస్తరించడంతో, మద్దతు సాధించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.  దక్షిణ ప్రాంతీయ మావోయిస్టుల కమిటీలోనూ వినోద్‌ కీలకంగా వ్యవహరించారు. 

మోస్ట్‌వాంటెడ్‌ మావోయిస్టు
చత్తీస్‌గడ్‌, ఏవోబీ కేంద్రంగా జరిగిన పలు కీలక దాడుల్లో వినోద్‌ ప్రమేయం ఉంది. దీనికి సంబంధించి ఆయనపై చాలా కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు వినోద్‌ను పట్టుకునేందుకు  ఎన్‌ఐఏ చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. ఎన్‌ఐఏకి  మావోయిస్టు వినోద్‌ మోస్ట్‌ వాంటెండ్‌గా ఉన్నారు. ప్రస్తుతం అతనిపై పదిహేను లక్షల రివార్డ్ ఉంది. ఇందులో పది లక్షల రూపాయలు చత్తీస్‌గడ్‌ ప్రభుత్వం ప్రకటించగా రూ. 5 లక్షలు ఎన్‌ఐఏ ప్రకటించింది. దర్భఘటి, జీరం అంబుష్‌, బీజేపీ ఎమ్మెల్యే బిమా మండవి మృతి ఘటనల్లో వినోద్‌ కీలక పాత్ర పోషించారు.

కామ్రేడ్లలో కరోనా కల్లోలం
కరోనా మావోల శిబిరాల్లో అలజడి సృష్టిస్తోంది.  ఇటీవల మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ చనిపోయారు. కేంద్ర కమిటీలో కీలక సభ్యుడిగా ఉన్న ఆయన కరోనాతో అనారోగ్యంతో మరణించారు. దీంతోపాటు పలువురు సభ్యులు కూడా చనిపోయినట్లు పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. హరిభూషణ్‌  ఘటన మరిచిపోక ముందే మరో అగ్రనేత మరణించడం మావోయిస్టులకు సవాలుగా మారింది.

ఇద్దరు వినోద్‌లు
చత్తీస్‌గడ్‌లో కీలకంగా పని చేస్తున్న మావోయిస్టు నేతల్లో ఇద్దరు వినోద్‌లు ఉన్నట్టు పార్టీ సానుభూతిపరులు అంటున్నారు. ఇందులో ఒకరు వరంగల్‌ నుంచి చత్తీస్‌గడ్‌కు వెళ్లిన మావోయిస్టు శాంసుందర్‌రెడ్డి కాగా మరొకరు ఆదిలాబాద్‌కు చెందిన కామ్రేడ్‌గా చెబుతున్నారు. అబుజ్‌మడ్‌ అడవుల్లో పార్టీ విస్తరణకు వీరు తీవ్రంగా పని చేశారు. అయితే ప్రస్తుతం కరోనాతో చనిపోయింది ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన వినోదా ? లేక ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన వ్యక్తినా అనే దానిపై స్పస్టత లేదు. పోలీసులు, మావోయిస్టుల్లో ఎవరైనా ప్రకటన చేస్తేనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top