గరిటె తిప్పే ఆ అమ్మ.. చీరకట్టులో బరువులెత్తుతూ... వైరల్‌ వీడియో వెనుక సంగతి ఇది..

TN Woman Works out Gym Saree Viral Video Inspires Netizens - Sakshi

ఆమె వయసు 56 యేళ్లు. పక్కా గృహిణి. ఓ చేత్తో వంట గదిలో గరిటె తిప్పుతుంది. అదే చేత్తో వెయిట్‌లిఫ్టింగ్‌ ద్వారా జిమ్‌లో చెమటలు చిందిస్తుంటుంది. చీరకట్టులో తేలికగా బరువులెత్తడమే కాదు.. హుషారుగా పుషప్స్ కొడుతుంది. ఆమె చూసి మరికొందరు వయసు పైబడిన వాళ్లు శారీరక ఆరోగ్యం కోసం జిమ్‌లకు క్యూ కడుతున్నారు. ప్రత్యేకించి.. వ్యాయామాలకు, ఫిట్‌నెస్‌కు దూరంగా ఉంటున్న ఈ తరం యువతకు ఆమె ప్రయత్నం ఒక మంచి పాఠం కూడా. అందుకేనేమో ఆమె కథ ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది.  

విపరీతమైన మోకాళ్ల నొప్పులతో తల్లడిల్లిపోతున్న తల్లిని చూసి.. ఆ కొడుకు దిగులు చెందాడు. చివరకు ఆమెకు ఉపశనమం కలిగించే చిట్కా తన దగ్గరే ఉందని తెలుసుకున్నాడు. అప్పటి నుంచి ఆమె జిమ్‌లో చేరింది. బరువులెత్తడంలో శిక్షణ తీసుకుంది. కోడలి సమక్షంలో పోటాపోటీగా వ్యాయామాలు చేయడం మొదలుపెట్టింది. ఆ ప్రయత్నం ఆమె నొప్పులను పోగొట్టడమే కాదు, ఆరోగ్యంగా.. ఫిట్‌గా ఉండేలా చేసింది కూడా. అందుకే 56 ఏళ్ల ఆ మహిళ స్ఫూర్తిదాయక కథ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.  

హ్యూమన్స్‌ ఆఫ్‌ మద్రాస్‌, మద్రాస్‌ బార్‌బెల్‌ సంయుక్తంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. మద్రాస్‌ బార్‌బెల్‌ నిర్వాహకుడి కన్నతల్లే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నకథలో అమ్మ. ఇంటి పనులకే అంకితమయ్యే ఆమె.. నాలుగేళ్ల కిందట కాళ్లు, మోకాళ్ల నొప్పులతో అల్లలాడిపోయింది. ఆస్పత్రులు తిరిగినా లాభం లేకపోయింది. దీంతో తల్లిని వెంటపెట్టుకుని ఫిజియోథెరపీల చుట్టూ తిరిగిన అతనికి.. చివరికి వ్యాయామాలు, వర్కవుట్ల ద్వారానే ఆమెకు ఉపశమనం కలుగుతుందని తెలుసుకున్నాడు.

నాలుగేళ్ల కిందట.. 52 ఏళ్ల వయసు నుంచి ఆమె జిమ్‌లో వ్యాయామాలను మొదలుపెట్టింది. పక్కనే కోడలు ఉండి ఆమెను ప్రొత్సహిస్తూ వస్తోంది.  అలవోకగా వెయిట్‌లిఫ్ట్‌లు ఎత్తుతూ, హుషారుగా ఎక్స్‌ర్‌సైజులు గట్రా చేస్తోంది. ఆమె ఆరోగ్యం గురించి తెలుసుకున్న కాలనీవాళ్లు.. ఆమెను ఆదర్శంగా తీసుకున్నారు. వాకింగ్‌, ఎక్సర్‌సైజులు మొదలుపెట్టారు. తాజాగా ఫిఫ్టీ ఫ్లస్‌ కేటగిరీలో నిర్వహించిన వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీల్లోనూ ఆమె విజయం సాధించినట్లు తెలుస్తోంది!. సాధించాలనే తపన ఉండాలేగానీ ఆటంకాలేవీ అడ్డుకోలేవని ధీమాగా చెప్తోంది  ఆ అమ్మ. ఆరోగ్యంగా ఉండాలంటే కష్టపడాలని, అదీ ఇష్టంతోనని సూచిస్తోంది. 

వయస్సు అనేది కేవలం నెంబర్‌ మాత్రమే.. స్ఫూర్తినిచ్చే అత్తగారు.. ప్రొత్సహించే కొడుకు.. ఆమె అంకితభావానికి మద్దతుగా నిలిచిన కోడలు.. ఈ కథ ఇప్పుడు ఇంటర్నెట్‌లో ట్రెండ్‌ అవుతోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top