విజయ్‌తో దోస్తీ.. ఉదయనిధి అది గుర్తుంచుకుంటే మంచిది | Tie-up With Vijay Row: Congress Strong Counter To DMK Udhayanidhi Stalin | Sakshi
Sakshi News home page

విజయ్‌తో దోస్తీ.. ఉదయనిధి అది గుర్తుంచుకుంటే మంచిది

May 25 2026 11:19 AM | Updated on May 25 2026 12:28 PM

Tie-up With Vijay Row: Congress Strong Counter To DMK Udhayanidhi Stalin

తమిళనాడు రాజకీయాల్లో ఒకప్పుడు మిత్రపక్షాల మధ్య సీట్ల పంపకం తర్వాత ఏర్పడిన అంతర్గత విబేధాలు.. ఇప్పుడు ప్రత్యర్థులుగా బహిరంగంగా మాటలు విసురుకునే స్థాయికి చేరుకున్నాయి. విజయ్‌ ఫ్యాక్టర్‌ కారణంగా డీఎంకే–కాంగ్రెస్ మధ్య ఉన్న దీర్ఘకాలిక పొత్తు తెగిపోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా డీఎంకే నేత, తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి.

కాంగ్రెస్‌ను ఇకపై నమ్మం.. అంటూ ఉదయనిధి స్టాలిన్ తీవ్ర విమర్శలు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. రెండు దశాబ్దాలుగా ఆ పార్టీ తమపైనే ఆధారపడిందని.. రాజకీయ లబ్ధి కోసం ఆ పార్టీ తమను వెన్నుపోటు పొడిచిందని .. అధికారం కోసం టీవీకేతో చేతులు కలిపిందని.. ఈ విషయాన్ని ఎవరూ మరిచిపోవద్దని.. కాంగ్రెస్‌ను ఇకపై దగ్గరికి రానివ్వకూడదంటూ తీవ్రంగా మాట్లాడారాయన. అయితే ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ తీవ్రంగా స్పందించింది.  

కాంగ్రెస్ సీనియర్ నేత మాణికం ఠాగూర్‌ ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. డీఎంకేకు కష్టకాలంలోనూ కాంగ్రెస్‌ అండగా నిలిచిందని, పొత్తు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిందని ఆయన గుర్తు చేశారు. అలాంటి పార్టీపైనే అనవసర వ్యాఖ్యలు చేయడం అంగీకారయోగ్యం కాదని స్పష్టం చేశారాయన.

‘‘కాంగ్రెస్ ఎప్పుడూ సెక్యులర్ కూటమి కోసం పనిచేసింది. డీఎంకేతో ఉన్న భాగస్వామ్యం పరస్పర నమ్మకంపై ఆధారపడి ఉంది. ఇలాంటి వ్యాఖ్యలు ఆ నమ్మకాన్ని దెబ్బతీస్తాయి. రాజకీయంగా అనవసర ఉద్రిక్తతలను పెంచుతాయి’’ అని ఉదయనిధికి మాణికం ఠాగూర్‌ హెచ్చరికలు జారీ చేశారు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌ నేతృత్వంలోని టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటునకు కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ దక్కలేదు. రాజకీయ ప్రతిష్టంభన ఏర్పడడంతో డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్‌ ప్రొగ్రెసివ్‌ అలయన్స్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీ బయటకు వచ్చేసింది. విజయ్‌కు ప్రభుత్వం ఏర్పాటులో మద్దతు ప్రకటించింది. ఆపై విజయ్‌ కేబినెట్‌లో రెండు స్థానాలు దక్కించుకుంది. ఈ పరిణామాలన్నీ డీఎంకేకు కోపం తెప్పించాయి. కాంగ్రెస్‌పై వెన్నుపోటు రాజకీయమంటూ బహిరంగ విమర్శలకు దిగింది. అయితే తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటూ కాంగ్రెస్‌ కూడా డీఎంకేకు కౌంటర్‌ ఇవ్వసాగింది.

ఈలోపు.. తామింక ఇండియా కూటమిలో లేమని, లోక్‌సభలో తమ ఎంపీల సిట్టింగ్‌ విషయంలో పునరాలోచన చేయాలంటూ డీఎంకే నేత కనిమొళి స్పీకర్‌ ఓం బిర్లాకు డీఎంకే లేఖ రాశారు. దీంతో తమిళనాడు పరిణామాలు.. దేశ రాజకీయ వర్గాల్లో మరింత చర్చనీయాంశంగా మారాయి.

ఇద్దరికీ ఇద్దరూ అండగానే!
కేంద్ర రాజకీయాల్లో యూపీఏ ప్రభుత్వాల సమయంలో కాంగ్రెస్‌కు డీఎంకే బలమైన మద్దతుగా నిలిచింది. ఆ దోస్తీతోనే ఇటు తమిళనాడులోనూ కాంగ్రెస్‌ విజయాలకు కారణమవుతూ వచ్చింది. అలాగే డీఎంకేకు కష్టకాలంలో కాంగ్రెస్ అండగా నిలిచిందన్న మాణికం ఠాగూర్ వ్యాఖ్యలకు రాజకీయంగా కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. 1990ల చివరి నుంచి తమిళనాడులో డీఎంకే–కాంగ్రెస్ మధ్య పొత్తు కొనసాగుతూ వచ్చింది. ముఖ్యంగా 2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తమిళనాడులో గణనీయమైన సీట్లు రావడానికి కూటమి కీలకంగా నిలిచింది. అలాగే 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయంలో డీఎంకే ఓటు బ్యాంక్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. మరోవైపు మన్మోహన్ సింగ్ ప్రభుత్వ కాలంలో డీఎంకే కీలక మిత్రపక్షంగా వ్యవహరించింది. కేంద్ర మంత్రివర్గంలో కూడా డీఎంకేకు ప్రాధాన్యత దక్కింది. బీజేపీ వ్యతిరేక రాజకీయాల్లో రెండు పార్టీలు చాలాకాలం కలిసి పనిచేశాయి. అందుకే ఇప్పుడు ఇరు పార్టీల మధ్య పెరుగుతున్న విభేదాలు కేవలం తాజా రాజకీయ రగడగానే కాకుండా.. రెండు దశాబ్దాల రాజకీయ భాగస్వామ్యంలో ఏర్పడిన పెద్ద చీలికగా రాజకీయ వర్గాలు చూస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement