కేతన్‌ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు.. సీన్‌లోకి మూడో వ్యక్తి! | Third person detained in Ketan Agarwal case | Sakshi
Sakshi News home page

కేతన్‌ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు.. సీన్‌లోకి మూడో వ్యక్తి!

Jul 3 2026 5:21 PM | Updated on Jul 3 2026 6:48 PM

Third person detained in Ketan Agarwal case

పుణె: దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో పుణె పోలీసులు కీలక ఆధారాల్ని సేకరించారు. ఈ కిరాతక హత్యకు సంబంధించి బీడ్ జిల్లాకు చెందిన, బాలేవాడి కంపెనీలో పనిచేస్తున్న మరో వ్యక్తిని పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న సియా గోయల్, చేతన్ చౌదరిలతో ఇతనికి పాత పరిచయం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

విచారణ సంస్థల కథనం ప్రకారం.. నిందితులు ఇద్దరూ కేతన్‌ను హతమార్చాలనే తమ కుట్రను ఈ మూడో వ్యక్తితో పంచుకున్నారు. అంతేకాకుండా, జూన్ 18న కేతన్‌ను లోహగఢ్ కోటపై నుండి నెట్టేసిన రోజున, తమతో పాటు రమ్మని అతడిని కోరారు. అయితే, ఆ వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడవద్దని వారిని వారించినట్లు తెలుస్తోంది.

ఈ నేరపూరిత ప్రణాళిక గురించి అతనికి ఎంతవరకు తెలుసు. ఇందులో అతని పాత్ర ఎంత అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా అతని వివరాలను గోప్యంగా ఉంచారు. ఈ కేసులో మరో దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. పక్కా ప్రణాళికతో హత్య చేసి, సాక్ష్యాలు దొరకకుండా ఎలా తప్పించుకోవాలో తెలుసుకోవడానికి నిందితులు ఇద్దరూ టీవీ సిరీస్ ‘క్రైమ్ పెట్రోల్’ఎపిసోడ్‌లను పదే పదే చూసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

అసభ్య ప్రవర్తన 
కేసు దర్యాప్తులో భాగంగా గురువారం పుణె రూరల్ పోలీసులు సియా గోయల్‌ను ఆమె మార్కెట్ యార్డ్ నివాసానికి తీసుకువెళ్లారు. లోహగఢ్ కోటకు వెళ్లిన సమయంలో ఆమె ధరించిన దుస్తులను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. అయితే, దర్యాప్తు ముగించుకుని తిరిగి వాహనంలోకి వెళ్తున్న సమయంలో, అక్కడ కవరేజ్ చేస్తున్న మీడియా ప్రతినిధుల కెమెరాల వైపు సియా గోయల్ మధ్య వేలు చూపిస్తూ తీవ్ర అసభ్యంగా ప్రవర్తించడం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Siya-goyal-ketan-agarwal-murder - 1

25 ఏళ్ల కేతన్ అగర్వాల్‌కు, సియా గోయల్‌కు వచ్చే నవంబర్‌లో వివాహం జరగాల్సి ఉంది. అయితే, సియాకు చేతన్ చౌదరితో ఉన్న వివాహేతర సంబంధానికి కేతన్ అడ్డుగా మారాడని భావించిన వీరు జూన్ 18న లోహగఢ్ కోటపై నుండి అతడిని లోయలోకి నెట్టి హత్య చేశారు. పక్కాగా రిహార్సల్స్ చేసి మరీ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితులు ముగ్గురిని కఠినంగా శిక్షించేందుకు పోలీసులు వేగంగా ఆధారాలను సేకరిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement