
చైనాలో ఈవీలు పెరగడంలో టెస్లా కీలకపాత్ర
దేశంలో సంస్థకు కలిసిరానున్న బ్రాండ్ ఇమేజ్
తొలుత అమ్మకాలు.. ఆ తరువాతే తయారీ
భారత్‌లో ఎలాన్ మస్క్ కంపెనీ ప్రణాళిక ఇదే
విశాల భారతావని.. 140 కోట్లకుపైగా జనాభా. విభిన్న తరాలు.. ఖర్చుల్లో అంతరాలు. పది రూపాయలకూ వెనుకడుగు వేసే కస్టమరే కాదు.. బ్రాండ్ కోసం రూ.10 కోట్లకూ సై అనే వినియోగదార్లు ఉన్నారు. ఇలా ప్రీమియం ధర చెల్లించే కొనుగోలుదారులు ఉన్నారు కాబట్టే భారత్‌లో టెస్లా రేస్ ప్రారంభించింది. పైగా ప్రపంచవ్యాప్తంగా ఈ బ్రాండ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ‘బ్రాండ్స్’ అంటే భారతీయులకు మక్కువ. రూ.50 లక్షలకుపైగా విలువ చేసే లగ్జరీ కార్లు సగటున గంటకు ఆరు రోడ్డెక్కుతున్న మార్కెట్ మనది. ఇలాంటి మార్కెట్లో రిటైల్‌తో పరుగు మొదలుపెట్టిన ఈ అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం రానున్న రోజుల్లో తయారీ చేపట్టే అవకాశమూ లేకపోలేదు.
ప్రస్తుతం బీఎండబ్ల్యూ నం.1
భారత్‌లో ప్రీమియం కార్ల మార్కెట్ విభాగంలో 2024–25లో 51,406 యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. మెర్సిడెస్–బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి, జాగ్వార్ ల్యాండ్ రోవర్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఇప్పటికే దేశీయంగా బలమైన తయారీ, సర్వీస్ నెట్‌వర్క్ వ్యవస్థలను నిర్మించాయి. ప్యాసింజర్ వాహనాల (పీవీ) రంగంలో 2025 జూన్ నాటికి ఈవీల వాటా 4.5 శాతం మాత్రమే. లగ్జరీ పీవీల విభాగంలో ఈవీల వాటా 10 శాతం. ఇందులో బీఎండబ్ల్యూ 53 శాతం మార్కెట్ వాటాతో ఆధిపత్యం చెలాయిస్తోంది. 33 శాతం వాటాతో రెండో స్థానంలో మెర్సిడెస్–బెంజ్ పోటీపడుతోంది. టెస్లాకు ఇప్పటికే ఉన్న సవాళ్లకు తోడు ఈ సంస్థకు ప్రపంచ పోటీదారుగా ఉన్న చైనా దిగ్గజం బీవైడీ ఇండియాలో ఇప్పటికే అడుగుపెట్టింది. వియత్నాం కంపెనీ విన్ ఫాస్ట్ ఇక్కడ అడుగుపెట్టబోతోంది.

పదేళ్ల నిరీక్షణ తర్వాత మనదేశంలోకి టెస్లా ఎంట్రీ ఇచ్చింది. తొలి ఎక్స్‌పీరియెన్స్ సెంటర్‌ను ముంబైలో ఆవిష్కరించింది. పూర్తిగా తయారైన కార్లకు దిగుమతి సుంకం భారత్‌లో 100 శాతం వరకు ఉంది. మనదేశంలో తయారీ చేపడితేనే ప్రయోజనాలు ఇస్తామని భారత్ స్పష్టం చేసింది. ఈ అంశాలే టెస్లా రాక ఆలస్యానికి కారణమయ్యాయి. మొత్తానికి పాలసీ అడ్డంకులు, సుంకాల సంక్లిష్టతలు, ఇతర బ్రాండ్లతో పోటీ, భౌగోళిక రాజకీయ ఒత్తిడి.. ఇవన్నీ అధిగమించి ఎట్టకేలకు అరంగేట్రం జరిగింది. దేశీయంగా తయారీ చేపట్టే అంశానికి కట్టుబడేముందు ఇక్కడి మార్కెట్‌ను పరీక్షిస్తామని టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ పలు సందర్భాల్లో పునరుద్ఘాటించారు. సుమారు రూ.60 లక్షల ధరతో తొలుత వై మోడల్‌ను టెస్లా ప్రవేశపెడుతోంది. ప్రపంచంలో అత్యధిక సుంకం ఉన్నది భారత్‌లోనే అని టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. అందువల్లే, ఇతర దేశాలతో పోలిస్తే టెస్లా కారు ధర మనదేశంలోనే ఎక్కువ.
టెస్లానా మజాకా!
యూఎస్, జర్మనీ, చైనాలో టెస్లాకు తయారీ కేంద్రాలున్నాయి. ఇవి ఏటా 25–30 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేయగలవు. 2019లో చైనాలో ఎలక్ట్రిక్ వాహనాల వాటా 3.8 శాతం మాత్రమే. అదే ఏడాది డిసెంబర్‌లో టెస్లా మార్కెట్లోకి ప్రవేశించింది. అప్పటి నుంచి చైనాలో ఎలక్ట్రిక్ వాహనాల వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. 2024లో ఇది 24.6 శాతానికి చేరడంలో టెస్లా కీలకపాత్ర పోషించింది. ఆటో దిగ్గజాల మాదిరిగా కాకుండా ప్రకటనల విషయంలో టీవీలు, ఇతర మాధ్యమాలకు బదులు సెలబ్రిటీల ప్రభావం, నోటి మాటగా ప్రచారంపై టెస్లా ఆధారపడింది. ప్రీమియం, ప్రత్యేక బ్రాండ్‌గా కంపెనీ ఇమేజ్‌ను నిలబెట్టడంలో ఈ విధానం సహాయపడింది. నటుడు బ్రాడ్ పిట్, గూగుల్ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్, ‘ఈబే’ మొదటి అధ్యక్షుడు జెఫ్ స్కోల్, షావొమీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ లే యూ.. ఇలా ఎందరో ప్రముఖులు టెస్లా కస్టమర్ల జాబితాలో ఉన్నారు.
డెలివరీలు తగ్గాయ్
అంతర్జాతీయంగా 2025 జనవరి–మార్చిలో టెస్లా డెలివరీలు 13% పడిపోయాయి. గడిచిన మూడేళ్లలో ఇది అత్యంత భారీ క్షీణత. పెరుగుతున్న ప్రపంచ పోటీ, నూతన మోడళ్ల రాక ముఖ్యంగా మోడల్–వై ఆలస్యం కావడం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు సలహాదారుగా ఎలాన్ మస్క్ పాత్రపై పెరుగుతున్న వ్యతిరేకత వంటివి ఈ క్షీణతకు దారితీశాయి. ఒకప్పుడు టెస్లాకు బలమైన మార్కెట్లలో ఒకటైన చైనాలో సంస్థ ఈవీ వాటా 2025 మొదటి ఐదు నెలల్లో 7.6%కి పడిపోయింది. ఇది గత సంవత్సరం 10%, 2020లో గరిష్ట స్థాయిలో 15%గా నమోదైంది. బీవైడీ, షావొమీ వంటి ప్రత్యర్థులు ఫీచర్–రిచ్ మోడళ్లు, పోటీ ధరలతో సవాల్ విసిరి మార్కెట్ వాటాను పెంచుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా టెస్లా 2025 జనవరి–మార్చి కాలంలో 3,36,681 వాహనాలను విక్రయించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 3,86,810గా నమోదైంది.