భిల్వారా: రాజస్థాన్‌లో కొనసాగుతున్న పాఠశాల విద్యావిధానంలో నూతన మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. భిల్వారాలో జరుగుతున్న హరిత్ సంగం జాతర ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర విద్య పంచాయతీరాజ్ మంత్రి మదన్ దిలావర్ కీలక ప్రకటన చేశారు. ఇక నుంచి ఏ ఉపాధ్యాయుడు కూడా తరగతి గదిలోనికి మొబైల్ ఫోన్ తీసుకెళ్లకూడదని, పాఠశాల సమయంలో ప్రార్థన లేదా నమాజ్ పేరుతో ఏ ఉపాధ్యాయుడు కూడా పాఠశాలను వదిలి వెళ్లకూడదని ఆయన ఆదేశించారు.
రాష్ట్రంలో విద్యా రంగాభివృద్ధికి విద్యా శాఖ(Department of Education) జారీ చేసిన ఆదేశాలను అమలయ్యేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నామని మదన్ దిలావర్ పేర్కొన్నారు. అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయాలని, తరగతి గదిలో బోధించేటప్పుడు ఏ ఉపాధ్యాయుడు మొబైల్ ఫోన్ తీసుకెళ్లకూడదన్నారు. తరగతి గదిలో ఫోన్ మోగితే, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఇబ్బందికరంగా మారుతుందన్నారు. ఫలితంగా చదువులకు అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు.
ఇదేవిధంగా పాఠశాల జరుగుతున్న సమయంలో మతపరమైన ప్రార్థనల పేరుతో ఏ ఉపాధ్యాయుడు పాఠశాల నుండి బయటకు వెళ్లకూడదని ఆదేశించారు.  ఇటువంటి ఘటనలపై పలుమార్లు ఫిర్యాదులు(Complaints) వచ్చిన దరిమిలా విద్యాశాఖ ఇటువంటి నిర్ణయం తీసుకున్నదన్నారు. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు.. విద్యార్థులకు 20కి 20 మార్కులు ఇస్తున్నారని, అలా ఇవ్వడం సరైనది కాదన్నారు. బోర్డు పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
ఇది కూడా చదవండి: Delhi Election 2025: ఐదు వ్యాన్లతో ఆప్‌పై కాంగ్రెస్ ప్రచార దాడి

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
