Swiggy Post: Delivery Boy Saves Mumbai Man Life Viral - Sakshi
Sakshi News home page

చావుబతుకుల మధ్య ఓ పెద్దాయన.. ఎవరూ ముందుకు రాని టైంలో ఆపద్భాందవుడిలా ఆ డెలివరీ బాయ్‌

Published Wed, Feb 2 2022 1:58 PM

Swiggy Delivery Boy Saves Mumbai Man Life Viral - Sakshi

డెలివరీ బాయ్‌ల జీవితాల గురించి తెలియంది కాదు. కరోనాలాంటి కష్టకాలంలోనూ పొట్టకూటి కోసం రిస్క్‌ చేస్తున్న వాళ్లు కోకోల్లలు. అయితే డెలివరీ బాయ్‌ల విషయంలో కొంత మందికి చిన్నచూపు ఉంటుంది. అలాంటి వాళ్ల కళ్లు తెరిపించే ఘటన ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. 

ముంబై(మహారాష్ట్ర)లో రిటైర్డ్‌ కల్నల్‌ మోహన్‌ మాలిక్‌ కుటుంబం నివసిస్తోంది. కిందటి నెల (డిసెంబర్‌ 25న) హఠాత్తుగా ఆ పెద్దాయన తీవ్ర అస్వస్థలకు లోనయ్యారు. వెంటనే ఆయన కొడుకు ఆస్పత్రికి తీసుకుని బయలుదేరాడు. దారిలో భారీ ట్రాఫిక్‌. ఇంచు కూడా కదల్లేని స్థితి. దీంతో టూవీలర్‌ మీద త్వరగా వెళ్లొచ్చన్న ఉద్దేశంతో కారు దిగి సాయం కోసం మాలిక్‌ కొడుకు అందరినీ బతిమాలాడు. కానీ, ఎవరూ సాయానికి ముందుకు రాలేదు. 

ఆ టైంలో డెలివరీలతో అటుగా వెళ్తున్నాడు ఒక స్విగ్గీ డెలివరీ బాయ్‌. మాలిక్‌ కొడుకు పడుతున్న కష్టం చూసి చలించి.. వెంటనే ఆ పెద్దాయన తన బైక్‌ మీద కూర్చోబెట్టుకుని ముగ్గురూ ఆస్పత్రికి బయలుదేరాడు. అడ్డుగా వాహనాలను గట్టిగా అరుస్తూ పక్కకు తప్పుకునేలా చేసి మరీ వీలైనంత త్వరగా ఆస్పత్రికి చేరుకున్నాడు ఆ డెలివరీ బాయ్‌. అలా సకాలంలో ఆస్పత్రికి చేరడంతో మోహన్‌ మాలిక్‌ ప్రాణం నిలిచింది. అయితే ఆస్పత్రికి చేరిన వెంటనే.. ఆ డెలివరీ బాయ్‌ అక్కడి నుంచి మాయమైపోయాడు. 

ఇన్నాళ్లూ ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్‌ తీసి కోలుకున్న ఆ పెద్దాయన.. ఈ మధ్యే డిశ్చార్జి అయ్యారు. స్విగ్గీ ప్రతినిధులను సంప్రదించి.. ఎలాగోలా ఆ డెలివరీ బాయ్‌ జాడ కనుక్కోగలిగాడు. ఆ డెలివరీ బాయ్‌ పేరు మృణాల్‌ కిర్‌దత్‌. తన ప్రాణం కాపాడిన ఆ యువకుడిని.. రియల్‌ సేవియర్‌గా కొనియాడుతున్నాడు ఆ పెద్దాయన. సకాలంలో స్పందించిన ఆ డెలివరీ బాయ్‌ పనికి సోషల్‌ మీడియాలో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అతనికి ఏదైనా సాయం అందించాలని పలువురు కామెంట్లు చేస్తున్నారు. హ్యాట్సాఫ్‌ టు దిస్‌ రియల్‌ హీరో.

Advertisement
Advertisement