మార్పునకు దగ్గరి దారి భవానీపూర్‌  | Suvendu Adhikari files nomination from Bhabanipur | Sakshi
Sakshi News home page

మార్పునకు దగ్గరి దారి భవానీపూర్‌ 

Apr 3 2026 6:01 AM | Updated on Apr 3 2026 6:01 AM

Suvendu Adhikari files nomination from Bhabanipur

సీఎం మమతను ఓడించండి  

సువేందు నామినేషన్‌ ర్యాలీలో అమిత్‌ షా పిలుపు 

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో మార్పునకు సొంత నియోజకవర్గం భవానీపూర్‌లో సీఎం మమతా బెనర్జీని ఓడించడమే దగ్గరిదారి అని బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యానించారు. మమతకు పోటీగా బీజేపీ నేత సువేందు అధికారి భవానీపూర్‌లో గురువారం నామినేషన్‌ వేశారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి రావాలంటే 170 సీట్లను గెలుచుకోవడం ఒక ఎత్తయితే, భవానీపూర్‌లో సువేందు గెలవడం మరో ఎత్తుగా పేర్కొన్నారు.

 ఇక్కడ సువేందు విజయంతో రాష్ట్రంలో మార్పు దానంతటదే వస్తుందని పేర్కొన్నారు. కోల్‌కతాలోని హజ్రా నుంచి గురువారం మొదలైన సువేందు నామినేషన్‌ ర్యాలీలో మంత్రి ప్రసంగించారు. ‘బెంగాల్‌లో మార్పు సంభవిస్తుంది. అయితే, ముందుగా భవానీపూర్‌లో మార్పు రావాలా? వద్దా? అంటూ ప్రజలనుద్దేశించి ఆయన ప్రశ్నించారు. ‘రాష్ట్రాన్ని విముక్తం చేసేందుకు మన అభ్యర్థిని సువేందు అధికారిని భారీ మెజారిటీతో గెలిపించాలని భవానీపూర్‌ ప్రజలను చేతులెత్తి వేడుకుంటున్నా’అని పేర్కొన్నారు. 

నందిగ్రామ్‌ నుంచే కాదు భవానీపూర్‌లో కూడా పోటీ చేసి మమతను ఓడించాలని సువేందును ఒప్పించానన్నారు. 2021లో మరోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ సువేందు చేతిలో మమత ఓడారన్నారు. ఈసారి మాత్రం, రాష్ట్రంలో అధికారంతోపాటు భవానీపూర్‌లోనూ మమతా బెనర్జీ ఓటమి ఖాయమని అమిత్‌ షా ప్రకటించారు. ‘మోదీ జీ నాయకత్వంలో ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావాలి. చొరబాటుదార్లను రాష్ట్రం నుంచే కాదు దేశం నుంచి వెళ్లగొట్టాలి’అని మంత్రి పేర్కొన్నారు. బెంగాల్‌ అస్తిత్వానికే ముప్పు ఏర్పడిందన్నారు.  

కాళీఘాట్‌ వద్ద హైటెన్షన్‌. 
బీజేపీ ర్యాలీలో జై శ్రీరాం, బీజేపీ జిందాబాద్, మమతా హటావో, బంగ్లా బచావో నినాదాలు భవానీపూర్‌లో మారుమోగుతున్న వేళ ర్యాలీ సీఎం మమతా బెనర్జీ నివాసమున్న కాళీఘాట్‌ సమీపానికి చేరుకుంది. అక్కడ టీఎంసీ మద్దతుదారులు పార్టీ జెండాలు చేబూని జోయ్‌ బంగ్లా, మమతా బెనర్జీ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు. రెండు పార్టీల మద్దతుదారుల నడుమ కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. 
 

Advertisement
 
Advertisement
Advertisement