
ధర్మాసనం సీరియస్
మిగిలిన ఆహారాన్ని మూతలున్న చెత్తబుట్టలోనే వేయాలని ఆదేశం
న్యూఢిల్లీ: దేశరాజధానిలో వీధికుక్కల స్వైరవిహారంతో విసిగిపోయిన సర్వోన్నత న్యాయస్థానం వాటిని షెల్టర్లకు తరలించాలని ఆదేశాలిచ్చిన మరుసటిరోజే మరోసారి వాటి ప్రస్తావన తెచ్చింది. సుప్రీంకోర్టు ప్రాంగణంలోనూ వీధికుక్కల బెడద ఎక్కువగా ఉందని అసహనం వ్యక్తంచేసింది. మిగిలిపోయిన ఆహారాన్ని మూతలున్న చెత్తబుట్టలో పడేయకుండా కోర్టుకాంప్లెక్స్‌లో ఎక్కడపడితే అక్కడ పడేయడంతో ఈ సమస్య తీవ్రతరమైందని ఆగ్రహం వ్యక్తంచేసింది.
ఢిల్లీ–జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్‌సీఆర్) పరిధిలోని వీధి శునకాలను కచ్చితంగా షెల్టర్లకు తరలించాలంటూ మంగళవారం జారీచేసిన ఉత్తర్వుల్లో సుప్రీంకోర్టు భవన పరిస్థితినీ ధర్మాసనం ప్రస్తావించింది.
‘‘ సుప్రీంకోర్టుకు వచ్చి ప్రతి ఒక్కరూ తాము వెంట తీసుకొచ్చిన, కొనుగోలుచేసిన ఆహారం మిగిలిపోతే దానిని కచ్చితంగా మూసిఉన్న డస్ట్‌బిన్‌లోనే పడేయండి. ఇష్టమొచ్చిన చోట పడేస్తే దానిని తినేందుకు వీధికుక్కలు సుప్రీంకోర్టు ప్రాంగణమంతా సంచరిస్తున్నాయి. కారిడార్లు మొదలు లిఫ్ట్‌ల దాకా ప్రతిచోటా వీధి శునకాలు కనిపిస్తున్నాయి. కుక్క కాట్ల నుంచి తప్పించుకోవాలంటే వాటికి ఆహారం దొరక్కుండా మూతలున్న చెత్తబుట్టలో పడేయండి.
బహిరంగ ప్రదేశాల్లో ఆహారం పడేయకండి. ఆహారం లభించకపోవడంతో అవి ఇక సుప్రీంకోర్టు ప్రాంగణాలకు రావడం మానేస్తాయి. కుక్క కాటు ముప్పు తప్పుతుంది. కోర్టుకు వచ్చి ప్రతి ఒక్కరి సహకారంతో న్యాయస్థానం పరిసరాలు వీధికుక్కల కాట్ల నుంచి సురక్షితంగా ఉంటాయి’’ అని ధర్మాసనం అభిప్రాయపడింది.