Vanniyar Quota: సుప్రీం కోర్టులో స్టాలిన్‌ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ! ఆ రిజర్వేషన్‌ చెల్లదంటూ తీర్పు

Supreme Court Cancelled Tamil Nadu Stalin Govt Vanniyar Quota - Sakshi

న్యూఢిల్లీ: తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీం కోర్టు గట్టి షాకిచ్చింది. వన్నియార్‌ కమ్యూనిటీకి కేటాయించిన 10.5 శాతం అంతర్గత రిజర్వేషన్‌ చెల్లదని, ఇందుకోసం రూపొందిచిన చట్టాన్ని రద్దు చేస్తూ  గురువారం ఆదేశాలు ఇచ్చింది. ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందంటూ తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది బెంచ్‌. 

ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో వన్నియార్‌ కమ్యూనిటీకి 10.5 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది ప్రభుత్వం.  ఇందుకోసం స్టాలిన్‌ ప్రభుత్వం 2021లో ప్రత్యేక చట్టం కూడా తీసుకొచ్చింది. అయితే ఓబీసీ కోటాలో ఈ రిజర్వేషన్‌ రాజ్యాంగబద్ధం కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అత్యంత వెనుకబడిన తరగతుల(MBC) కోసం 20 శాతం కోటా ఉండగా.. అందులో 10.5 శాతం వన్నియార్‌ కమ్యూనిటీకి వర్తింపజేస్తూ 2021 తమిళనాడు యాక్ట్‌ను తీసుకొచ్చింది అక్కడి ప్రభుత్వం. ఈ క్రమంలో అభ్యంతరాలు వ్యక్తంకాగా..  తమిళనాడు యాక్ట్‌ 2021ను కొట్టేస్తూ ఇంతకు ముందు మద్రాస్‌ హైకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. 

తాజాగా చట్టాన్ని రద్దు చేయాలంటూ మద్రాస్‌  హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులనే సమర్థించింది సుప్రీం కోర్టు. జస్టిస్‌ ఎల్‌ నాగేశ్వరావు, బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెల్లడించింది. MBCలలో వన్నియార్‌లను ప్రత్యేక సమూహంగా పరిగణించాల్సిన డేటాను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, తద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 14, 16లకు ఈ చట్టం వ్యతిరేకంగా ఉంది, అందుకే ఈ చట్టాన్ని రద్దు చేస్తున్నామని  ఈ సందర్భంగా బెంచ్‌ వ్యాఖ్యానించింది. చట్టాలు చేసుకునే హక్కు చట్ట సభలకు ఉన్నా.. కుల ఉప తరగతులను ప్రభావితం చేసే విధంగా రాష్ట్రాలకు ఉండబోదని బెంచ్‌ పేర్కొంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top