
న్యూఢిల్లీ: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్న భారత వ్యోమగామి శుభాన్షు శుక్లాకు చివరి ఐసోలేషన్ ప్రక్రియ మొదలైంది. ఆగ్జియం మిషన్–4 (యాక్స్–4)కు సన్నాహకంగా ముగ్గురు సహచరులతో కలిసి కలిసి ఆయన ప్రీ–లాంచ్ క్వారంటైన్‌లోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా ఆగ్జియం స్పేస్ ఉద్యోగులు వారికి వీడ్కోలు సమావేశం నిర్వహించారు. మిషన్ విజయవంతమవుతుందని శుక్లా ధీమా వెలిబుచ్చారు.
ఈ మిషన్‌ను జూన్ 8న అమెరికాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించనున్నారు. నాసా సీనియర్ వ్యోమగామి, ఆగ్జియం స్పేస్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ డైరెక్టర్ పెగ్గీ విట్సన్ దీనికి నేతృత్వం వహిస్తున్నారు. నౌకకు పైలట్‌గా వెళ్తున్న శుక్లా ఐఎస్‌ఎస్‌లో అడుగు పెట్టిన తొలి భారతీయ వ్యోమగామి కానున్నారు. వీరితో పాటు పోలండ్‌కు చెందిన స్లావోజ్ ఉజ్నాన్‌స్కీ– విస్నియోవ్‌స్కీ, హంగేరీకి చెందిన టిబోర్ కాపు బృందంలో ఉన్నారు. వారిద్దరికీ కూడా ఇది తొలి అంతరిక్షయానం. అలా ఈ మిషన్ భారత్‌కే గాక పోలండ్, హంగరీలకు కూడా ఎంతో ముఖ్యమైనది.
ఐసోలేషన్ ఎందుకు?
ప్రీ లాంచ్ క్వారంటైన్ వ్యోమగాములకు కీలకమైన ప్రొటోకాల్. అంతరిక్షంలో గడపటం పలు సవాళ్లతో కూడిన విషయం. వ్యోమగాములకు అనారోగ్యం వంటివి ఉంటే అది మిషన్‌నే కాకుండా ఇప్పటికే ఐఎస్‌ఎస్‌లో ఉన్న వ్యోమగాములనూ ప్రభావితం చేస్తుంది. గురుత్వాకర్షణ శక్తి లేని చోట వ్యోమగాముల రోగని రోధక శక్తి మరింత బలహీనపడి ఇన్ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదముంటుంది. అందుకే వ్యోమగాముల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి దీనిని నిర్వహిస్తారు. ప్రయోగానికి 14 రోజుల ముందుకాలం క్వారంటైన్ ఉంటుంది. ఈ సమయంలో వ్యోమగాములు ప్రయోగ ప్రదేశానికి సమీపంలో ఉంటారు. ఒక చిన్న సహాయక బృందం కూడా వారికి అందుబాటులో ఉంటుంది. కఠినమైన ఒంటరితనం, మెరుగైన పరిశుభ్రత చర్యలు, రోజువారీ ఆరోగ్య పర్యవేక్షణ ఉంటాయి. తుది మిషన్ బ్రీఫింగ్‌లు, శిక్షణ, వ్యాయామాలు నిర్వహిస్తారు. సిబ్బందిలో అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వారిని మరింత ఒంటరిగా ఉంచి నిశితంగా పర్యవేక్షిస్తారు.