హైదరాబాద్: భారతీయ రుమటాలజీ రంగానికి అద్భుతమైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ స్థాయిలో అమెరికాలోని షికాగోలో నిర్వహించిన ఏసీఆర్ నాలెడ్జ్ బౌల్ 2025 పోటీలో ట్రోఫీ, స్వర్ణపతకం సాధించడంతో పాటు, అదే పోటీలో టీమ్ స్పిరిట్ (బృందస్ఫూర్తి) బహుమతినీ సొంతం చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఏసీఆర్ నాలెడ్జ్ బౌల్ పోటీలో భారతీయ బృందం ఇలా స్వర్ణపతకం సాధించి ట్రోఫీని సగర్వంగా ఎత్తుకోవడం అనేది గడిచిన 40 ఏళ్లలో ఇదే తొలిసారి. అంతర్జాతీయ యవనికపై భారతీయ రుమటాలజీ విభాగానికి ఈ చరిత్రాత్మక విజయంతో అంతర్జాతీయ గుర్తింపు లభించింది.
విజేతగా నిలిచిన కార్ టైటాన్స్ బృందంలో హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలోని రుమటాలజీ విభాగాధిపతి, క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ వీరవల్లి శరత్ చంద్రమౌళి, కిమ్స్ ఆస్పత్రికే చెందిన డాక్టర్ మోహిత్, పుదుచ్చేరి జిప్‌మర్‌కు చెందిన డాక్టర్ రితేష్ ఉన్నారు. వీరంతా అత్యంత సంక్లిష్టంగా సాగిన అన్ని రౌండ్లలోనూ అసాధారణ ప్రతిభాపాటవాలు కనబరిచారు. దాంతో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత స్థాయి సంస్థలన్నింటినీ తోసిరాజని ఛాంపియన్లుగా నిలిచారు. రుమటాలజీ రంగానికి సంబంధించి లోతైన వైద్య పరిజ్ఞానం, పరిశోధనల్లో వస్తున్న తాజా పరిణామాల గురించిన విజ్ఞానం, రుమటాలజీ, ఇమ్యునాలజీ విభాగాలకు సంబంధించిన ప్రతి రంగంలోనూ అప్పటికప్పుడే నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం.. ఇలాంటి అంశాలన్నింటిలో అసాధారణ ప్రతిభ కనబరిచారు.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేయో క్లినిక్, మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్, యూనివర్సిటీ ఆఫ్ షికాగో, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, యూనివర్సిటీ ఆఫ్ శాన్ ఫ్రాన్సిస్కో లాంటి అగ్రశ్రేణి సంస్థలతో పోటీపడిన కార్ టైటాన్స్ బృందం అద్భుతమైన వైద్య పరిజ్ఞానం, బృందంగా పనిచేయడం, క్లినికల్ నైపుణ్యాలతో సహచర పోటీదారులతో పాటు జడ్జిలను కూడా ఆకట్టుకుంది.
అమెరికన్ కాలేజ్ ఆఫ్ రుమటాలజీ (ఏసీఆర్) ఆధ్వర్యంలో నిర్వహించే ఏసీఆర్ నాలెడ్జ్ బౌల్ పోటీ అనేది ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేలమంది వైద్యులు, పరిశోధకులు, శాస్త్రవేత్తలు ఎంతగానో ఎదురుచూసే ఒక ఎకడమిక్ ఈవెంట్. ఈసారి ఈ సదస్సుకు వందకు పైగా దేశాల నుంచి 15 వేలమంది హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా అనేక బృందాలు దీనికి దరఖాస్తు చేసుకోగా, చివరగా అన్ని దేశాల నుంచి వడబోసి అత్యున్నత అకడమిక్, క్లినికల్ సెంటర్ల బృందాల్లోంచి 16 టాప్ బృందాలను నాలెడ్జ్ బౌల్ పోటీ తుది రౌండ్లలో పోటీ పడేందుకు ఎంచుకున్నారు.
ఈ అసాధారణ విజయం గురించి డాక్టర్ శరత్ చంద్రమౌళి మాట్లాడుతూ, “ఈ విజయం కేవలం మా ఒక్క బృందానిదే కాదు. ఇది మొత్తం భారతీయ రుమటాలజీ వైద్యులందరికీ గర్వకారణం. రుమటాలజీ రంగంలో భారతదేశం నుంచి వెళ్లిన వైద్యబృందం ప్రదర్శించిన లోతైన పరిజ్ఞానం, టీమ్ వర్క్, అంతర్జాతీయ నైపుణ్యాలను ఇది ప్రతిబింబిస్తుంది” అని చెప్పారు.
ఈ జట్టుకు స్వర్ణపతకం, ట్రావెలింగ్ ట్రోఫీతో పాటు.. అమెరికాలోని ఓర్లాండోలో వచ్చే సంవత్సరం నిర్వహించే ఏసీఆర్ 2026 సదస్సుకు కాంప్లిమెంటరీ రిజిస్ట్రేషన్‌ను అందించారు and free accommodation for all team members అక్కడ వారు ప్రస్తుత ఛాంపియన్లుగా పాల్గొనేందుకు అవకాశం లభిస్తుంది.
అంతర్జాతీయ రుమటాలజీ రంగంలో భారతదేశ ప్రతిభా పాటవాలకు కార్ టైటాన్స్ జట్టు సాధించిన అద్భుత విజయం దేశవ్యాప్తంగా భావి తరాల వైద్యులు, శిక్షణార్థులకు స్ఫూర్తిగా నిలుస్తుంది.
ఏసీఆర్ కన్వర్జెన్స్ 2025 నాలెడ్జ్ బౌల్ ఫలితాలు:
ఛాంపియన్: కార్ టైటాన్స్ (కిమ్స్ ఆస్పత్రి, భారతదేశం) - బృందస్ఫూర్తి అవార్డు కూడా
రన్నరప్: ద ఆంకా-టీర్స్ (గైసింజర్ మెడికల్ సెంటర్)
మూడోస్థానం: స్టిఫ్ కాంపిటీషన్ (యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా)


