 
													న్యూఢిల్లీ: ప్రమాద బీమా చెల్లింపు విషయమై సుప్రీంకోర్టు తీర్పు కీలక తీర్పు వెలువరించింది. హఠాత్తుగా ప్రమాదం చోటుచేసుకున్న సందర్భాల్లో యజమాని లేదా నిర్వాహకుడిపై పరిహారం భారం నేరుగా పడకుండా కాపాడటమే బీమా పాలసీ ఉద్దేశమని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాల ధర్మాసనం స్పష్టం చేసింది.
ప్రమాదానికి గురైన వాహనం మార్గాన్ని (రూట్‌ను) ఉల్లంఘించి, పర్మిట్‌ను అతిక్రమించిందనే ఏకైక కారణం చూపుతూ బీమా సంస్థలు బాధితులకు పరిహారం నిరాకరించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. బాధితుడికి లేదా అతడిపై ఆధారపడిన వారికి పరిహారం నిరాకరించడం న్యాయ విరుద్ధం. ఆ ప్రమాదం బాధితుడి తప్పేమీ లేకుండా జరిగింది కాబట్టి, బీమా సంస్థ కచ్చితంగా పరిహారం చెల్లించాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది.
ఈ మేరకు వాహన యజమాని, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ బీమా కంపెనీ వేసిన పిటిషన్లను కొట్టివేసింది. 2014 అక్టోబర్ 7వ తేదీన కర్నాటకలో ఓ మోటారు సైకిల్‌ను రాంగ్‌రూట్‌లో వేగంగా వచ్చిన బస్సు ఢీకొట్టింది. ఘటనలో మోటారు సైకిలిస్ట్ అక్కడికక్కడే చనిపోయారు.
ఈ ఘటనపై విచారణ చేపట్టిన మోటారు ప్రమాదాల ట్రిబ్యునల్ రూ.18.86 లక్షల పరిహారాన్ని వడ్డీ సహా చెల్లించాలంటూ బీమా కంపెనీని ఆదేశించింది. దీనిపై, ఆ కంపెనీ కర్నాటక హైకోర్టుకు వెళ్లింది. ఆ మొత్తం సరైందేనని ధ్రువీకరించిన హైకోర్టు.. పరిహారాన్ని ముందుగా బాధిత కుటుంబానికి చెల్లించి, ఆ తర్వాత వాహన యజమాని నుంచి వసూలు చేసుకోవాలని తీర్పు వెలువరించింది. ఈ తీర్పును వాహన యజమానితోపాటు బీమా కంపెనీ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా, పైవిధంగా తీర్పు వెలువరించింది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
