స్వచ్ఛంద సంస్థల్లో రూ. 49 వేల కోట్ల విదేశీ నిధులు

Rs 49,000 Crore Foreign Funding To Indian NGOs Minister Nityanand Rai Tells   - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌కు చెందిన 18 వేలకు పైగా స్వచ్ఛంద సంస్థలు (ఎన్‌జీఓలు) కలసి మూడేళ్లలో రూ. 49 వేల కోట్లుకు పైగా విదేశీ నిధుల్ని పొందాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన రాజ్యసభకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 2017–18లో రూ. 16,940.58 కోట్లు, 2018–19లో రూ. 16,525.73 కోట్లు, 2019–20లో రూ. 15,853.94 కోట్ల విదేశీ నిధులు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. విదేశీ భాగ స్వామ్య నియంత్రణ సవరణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ)–2020 చట్టానికి ముందు ఎఫ్‌సీఆర్‌ఏ ఖాతాలను ఐచ్ఛికంగా ఉంచారని ఆయన పేర్కొన్నారు. అయితే సవరణ చట్టం వచ్చాక దగ్గర్లో ఉన్న ఎస్‌బీఐలో ఎఫ్‌సీఆర్‌ఏ ఖాతా తెరవడాన్ని తప్పనిసరి చేసినట్లు పేర్కొన్నారు. 2021 జూలై 31న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడించిన ప్రకారం మొత్తం 18,377 గుర్తింపు పొందిన ఎఫ్‌సీఆర్‌ఏ ఖాతాలు ఉన్నాయి. 

పోలీస్‌ కస్టడీలో 348 మంది మృతి..
గత మూడేళ్లలో పోలీసుల కస్టడీలో 348 మంది వ్యక్తులు మరణించారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ తెలిపారు. మరో 5,221 మంది జ్యుడీషియల్‌ కస్టడీలో ఉండగా మరణించారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన రాజ్యసభలో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. రాష్ట్రాలవారీగా చూస్తే 2018–20 మధ్య ఉత్తరప్రదేశ్‌లో పోలీస్‌ కస్టడీలో 23, జ్యుడీషియల్‌ కస్టడీలో 1,295 మంది మరణించారు. మధ్యప్రదేశ్‌లో పోలీస్‌ కస్టడీలో 34, జ్యుడీషియల్‌ కస్టడీలో 407 మంది మరణించారు. పశ్చిమబెంగాల్‌లో పోలీస్‌ కస్టడీలో 27, జ్యుడీషియల్‌ కస్టడీలో 370 మంది మరణించారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top