
మధ్యప్రదేశ్‌లోని షాడోల్ జిల్లాలో ఓ గ్రామం వార్తల్లో నిలిచింది. ఇటుకలు కొనుగోలుకు సంబంధించిన బిల్లు చూస్తే షాక్ కొట్టినంత పనైంది. బుధ్‌హర్ బ్లాక్ పరిధిలోని భటియా గ్రామంలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే.. ఆ గ్రామ పరిధిలో ఓ అంగన్‌వాడీ భవనం ప్రహరీ గోడ కోసం ఇటుకను కొనుగోలు చేశారు. మొత్తం 2500 ఇటుకలను కొనుగోలు చేయగా, బిల్లును రూ.1.25 లక్షలకు ఫైనల్ చేశారు. అంటే ఒక్కో ఇటుక ఖరీదు రూ.50 పడిందన్నమాట.
ఈ రేటు సాధారణ ధర కంటే పది రెట్లు ఎక్కువ.. రూ. 1.25 లక్షల బిల్లుపై గ్రామ సర్పంచ్‌తో పాటు పంచాయతీ సెక్రటరీ కూడా సంతకం చేసి ఆమోదించారు. అనంతరం బిల్లులు మంజూరు చేసుకున్నారు. కాగా, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ స్థానిక యువత, గ్రామ ప్రజలు మండిపడుతున్నారు. దీనిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఇటుకల కొనుగోలు బిల్లు పెరిబహారా గ్రామానికి చెందిన చేతన్ ప్రసాద్ కుష్వాహా పేరు మీద ఉంది. ఈ ఇటుకలను పటేరా టోలాలోని అంగన్‌వాడీ భవనం ప్రహరీ గోడ నిర్మాణానికి సరఫరా చేసినట్లు బిల్లులో పేర్కొన్నారు. షాడోల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ కేదార్ సింగ్ ఈ వ్యవహారంలో ఏదో తేడా ఉందని అంగీకరించారు. ఇలాంటి బిల్లులు నిర్లక్ష్యం వల్ల జరిగాయా లేక ఉద్దేశపూర్వక మోసమా అని తెలుసుకోవడానికి, క్లస్టర్ స్థాయి అధికారులను రోజుకు 10-12 పంచాయతీలను తనిఖీ చేయాలని అధికారులు ఆదేశించారు.
ఇలాంటి సంఘటనలు కొత్తేమీ కాదు. కొన్ని రోజుల క్రితం కుద్రి గ్రామ పంచాయతీ రెండు పేజీల ఫోటో కాపీల కోసం రూ. 4,000 మంజూరు చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అలాగే, మధ్యప్రదేశ్‌లోని శాధోల్ జిల్లాలో ఉండే చిన్న గ్రామం భడ్‌వాహీ. వాన నీటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ‘జల్ గంగ సంవర్ధన్’ పేరుతో ఒక కార్యక్రమం చేపట్టింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్, ఎస్‌డీఎం, పంచాయతీ కార్యదర్శి తదితరులు హాజరయ్యారు. అంతా కలిపి 24 మంది మాత్రమే. కానీ బిల్లు మాత్రం రూ..85 వేలు అయినట్లు పెట్టారు.
వీళ్లంతా కలిసి ప్రజాధనం దోచేస్తున్నారు అనుకున్నారో ఏమో.. గుర్తు తెలియని వ్యక్తులు ఈ బిల్లును కాస్తా సోషల్ మీడియాలో పడేశారు. ఇంకేముంది.. ఒక్కపట్టున వైరల్ అయిపోయింది అది. గంట టైమ్‌లో ఈ 24 మంది అధికారులు కూర్చుని 14 కిలోల బాదాం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష తిన్నారట. ఇది చాలదన్నట్టు 30 కిలోల స్నాక్స్, కాఫీ/టీల కోసం ఆరు లీటర్ల పాలు.. ఐదు కిలోల చక్కెర వాడామని బిల్లులో పెట్టారు.