సాక్షి, చెన్నై : తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యుడు సి.వి. షణ్ముగం తన పదవికి రాజీనామా చేయడంతో ఏర్పడిన ఖాళీ స్థానానికి జూన్ 18న ఉప ఎన్నిక జరగనుంది. ఈ మేరకు భారత ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఎమ్మెల్యే పదవి కోసం రాజీనామా
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో సి.వి.షణ్ముగం మైలం నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి ఒకే సమయంలో అటు ఎమ్మెల్యేగా, ఇటు రాజ్యసభ ఎంపీగా రెండు పదవుల్లో కొనసాగలేరన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆయన మే 7వ తేదీన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ సి.పి.రాధాకృష్ణకు వ్యక్తిగతంగా సమర్పించారు. ఆయన రాజీనామాను ఆమోదించి, ఆ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించడంతో ఎన్నికల సంఘం ఈ ఉప ఎన్నికకు చర్యలు తీసుకుంది.
ఉప ఎన్నికల షెడ్యూల్ వివరాలు
ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో జూన్ 1 నుంచి నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జూన్ 8గా పేర్కొన్నారు. 9వ తేదీ పరిశీలన, 11వ తేదీన ఉపసంహరణ ప్రక్రియలు జరగనున్నాయి. పోలింగ్: జూన్ 18 (ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు) జరగనుంది. ఓట్ల లెక్కింపు – ఫలితాల ప్రకటన అదే రోజు సాయంత్రం 5గంటల నుంచి ప్రారంభమై ప్రకటిస్తారు. సాధారణంగా రాజ్యసభ ఎంపీల పదవీకాలం 6 సంవత్సరాలు ఉంటుంది. అయితే, ఇది ఉప ఎన్నిక (మధ్యంతర ఎన్నిక) కావడంతో, ఇప్పుడు ఎన్నికయ్యే కొత్త ఎంపీ సి.వి. షణ్ముగం మిగిలిన పదవీకాలమైన జూన్ 29, 2028 వరకు మాత్రమే ఎగువ సభలో కొనసాగతారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
టీవీకే ఖాతాలోకి మొదటి ఎంపీ స్థానం
రాజ్యసభ ఎన్నికల్లో రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు ఓటర్లుగా ఉంటారన్న విషయం తెలిసిందే. తమిళనాడు అసెంబ్లీలో ప్రస్తుతం ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే కూటమికి అత్యధిక సంఖ్యాబలం (ఎమ్మెల్యేల మెజారిటీ) ఉంది. ఈ దృష్ట్యా ఉప ఎన్నికలో టీవీకే నిలబెట్టే అభ్యర్థి విజయం సాధించడం నల్లేరుపై నడకే కానుంది. దీని ద్వారా తమిళనాడులో సరికొత్తగా అధికారంలోకి వచ్చిన విజయ్ పార్టీ, ఢిల్లీలోని రాజ్యసభలోనూ అడుగుపెట్టి తన ఉనికిని చాటనుంది. ఈ స్థానానికి టీవీకే తరఫున రాజ్యసభకు వెళ్లే ఆ అభ్యర్థి ఎవరనే దానిపై పార్టీ శ్రేణుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత, విజయ్ సన్నిహితుడైన ప్రవీణ్ చక్రవర్తి రాజ్యసభ సీటును ఆశిస్తున్నట్టు తెలిసింది.


