
న్యూఢిల్లీ: ‘రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, లేదా శత్రువులు ఉండరని, శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ట్రంప్ విధించిన సుంకాలు భారతదేశంతో సహా ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తున్న తరుణంలో రాజ్‌నాథ్ సింగ్ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు.
ఎన్డీటీవీ డిఫెన్స్ సమ్మిట్ -2025లో సింగ్ మాట్లాడుతూ నేడు ప్రపంచం చాలా వేగంగా మారుతోందని, ప్రతిరోజూ కొత్త సవాళ్లు ఉద్భవిస్తున్నాయన్నారు. స్వావలంబనకున్న ప్రాముఖ్యత గురించి ప్రస్తావిస్తూ, అది నేటి కాలంలో ఒక ఎంపిక కాదని, అది ఒక అవసరమని అన్నారు. మనం సవాళ్లతో నిండిన కూడిన యుగాన్ని ఎదుర్కొంటున్నామని, మహమ్మారి అయినా, ఉగ్రవాదం, ప్రాంతీయ సంఘర్షణలు అయినా, ప్రతి రంగంలోనూ సవాళ్లను ఎదుర్కొంటున్నామన్నారు. ఆగస్టు 10న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశంపై విధించిన సుంకాల అంశాన్ని ప్రస్తావిస్తూ, కొంతమంది తాము అందరికీ బాస్ అని అనుకుంటారని ట్రంప్‌ను ఉద్దేశించి పరోక్షంగా అన్నారు. వారు భారతదేశ అభివృద్ధిని చూసి ఇష్టపడలేరన్నారు.