తిరువనంతపురం: సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) కేవలం ఒక వ్యంగ్య ప్రచారం కాదని, దీని వెనుక సరిహద్దు ఆవల నుండి జరుగుతున్న ఒక క్రమబద్ధమైన కుట్ర ఉందని కేరళ బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను పెంచి, దేశాన్ని అస్థిరపరచడమే ఈ ప్రచారంలోని ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.
డిజిటల్ యుద్ధంలో కొత్త ఎత్తుగడ
రాజీవ్ చంద్రశేఖర్ ఈ వ్యవహారాన్ని ‘క్లాసిక్ క్రాస్-బోర్డర్ ఇన్ఫ్లుయెన్స్ ఆపరేషన్’గా అభివర్ణించారు. బాట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డిజిటల్ మానిప్యులేషన్ ఉపయోగించి, సహజమైన ప్రజా ఉద్యమంలా సోషల్ మీడియాలో కథనాలను అల్లుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం సాధిస్తున్న ఆర్థిక ప్రగతిని ఓర్వలేని శక్తులే ఇలాంటి అశాంతిని ప్రేరేపిస్తున్నాయని, ఇవన్నీ దేశాభివృద్ధిని దెబ్బతీయలేవని ఆయన స్పష్టం చేశారు.
కేరళలో ఊపందుకున్న ప్రచారం
గత వారం వెలుగులోకి వచ్చిన ఈ సీజేపీ ఉద్యమం సోషల్ మీడియాలో వేగంగా విస్తరించింది. ‘ ఎక్స్’ ఖాతాను భారత ప్రభుత్వం నిలిపివేసినా, 'కాక్‌రోచ్ ఈజ్ బ్యాక్' పేరుతో మరో ఖాతా పుట్టుకొచ్చింది. కేరళకు చెందిన పలువురు యువ ఎమ్మెల్యేలు, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి నాయకులు ఈ ఉద్యమానికి మద్దతు తెలపడం గమనార్హం. విద్యాశాఖ మంత్రిని తొలగించాలన్న డిమాండ్‌తో వీరు చేస్తున్న ఆన్‌లైన్ ప్రచారాలు చర్చనీయాంశంగా మారాయి.
బెంగళూరు పోలీసుల హెచ్చరిక
ఈ వ్యవహారంపై బెంగళూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. మే 24న బెంగళూరు టౌన్ హాల్ వద్ద ‘శాంతియుత మానవ గొలుసు’ నిర్వహిస్తామని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని, వాటికి ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. బాధ్యతారహితమైన సమాచారాన్ని సోషల్ మీడియాలో వ్యాప్తి చేయవద్దని పోలీసులు హెచ్చరించారు. రాజకీయ వ్యంగ్యం పేరుతో జరుగుతున్న ఈ పరిణామాలు ఇప్పుడు దేశవ్యాప్త చర్చకు దారితీశాయి.


