సీబీఎస్‌ఈ వ్యవహారంపై విరుచుకుపడ్డ కాంగ్రెస్
రాజధర్మం పాటించి మంత్రి ప్రధాన్ రాజీనామా చేస్తే మేలు
నేరస్తులను కాపాడేందుకు విద్యాశాఖ ప్రయత్నం
ఎక్స్ వేదికగా రాహుల్, జైరామ్ రమేశ్ తీవ్ర విమర్శలు
అగ్ని ప్రమాదంపై అనుమానాలు
సాక్షి, న్యూఢిల్లీ: సీబీఎస్‌ఈ వ్యవహారంలో మోదీ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్ష కాంగ్రెస్‌పార్టీ సోమవారం తీవ్రస్థాయి విమర్శలతో విరుచుకు పడింది. ‘మంత్రి ప్రధాన్’అసమర్థతకు నిలువెత్తు నిదర్శనమని ప్రధాని మోదీపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టింది. రాజధర్మం పాటించి పదవికి రాజీనామా చేయడం మేలని సలహా ఇచ్చింది. ఎక్స్ వేదికగా ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్‌రమేశ్ సీబీఎస్‌ఈ ఓఎస్‌ఎం వివాదంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
జవాబు పత్రాలను ఆటోమేటిక్ రోబోటిక్ స్కానర్ల సాయంతో స్కాన్ చేయాలని సీబీఎస్‌ఈ 2025 మే నెలలో జారీ చేసిన టెండర్ స్పష్టం చేసిందని, ఈ స్కాన్ల స్పష్టత 300 డీపీఐ వరకూ ఉండాలని కూడా నిర్దేశించిందని రాహుల్ గాంధీ తన ఎక్స్ ఖాతాలో తెలిపారు. అయితే ఆగస్టులో ‘స్కానర్లు’అన్న నిబంధనను నిశ్శబ్ధంగా తొలగించారని, స్పష్టతను కూడా 200 డీపీఐకి తగ్గించారని రాహుల్ ఆరోపించారు.
ఫలితంగా జవాబు పత్రాల నాణ్యత బాగా తగ్గిపోయిందని, చాలా పత్రాలు అస్పష్టంగా ఉండటంతోపాటు, కొన్ని పత్రాలు కనిపించకుండా పోయాయని దీనివల్లే మార్కుల జారీలో గందరగోళం ఏర్పడిందని రాహుల్ గాంధీ ‘నిసర్గ’ఎథికల్ హ్యాకర్ పోస్టును షేర్ చేశారు. ‘‘ఇది కచ్చితంగా మోసమే. తప్పుడు మార్కులు వచ్చిన ప్రతి విద్యార్థీ బాధితుడే’’అని స్పష్టం చేశారు. మామిడి పండ్ల గురించి మాట్లాడేందుకు సమయమున్న ప్రధానమంత్రి 18.5 లక్షల మంది విద్యార్థుల ఆన్సర్‌షీట్లకు సంబంధించి మాత్రం నోరు మెదపలేకపోయారని విమర్శించారు.
కోఎంప్ట్ పై చర్యలెందుకు లేవు: జైరామ్ రమేశ్
సీబీఎస్‌ఈ వివాదంలో బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ తప్పు పట్టారు. ఎక్స్‌లో ఆయన ఒక పోస్టు పెడుతూ ఓఎస్‌ఎం సాఫ్ట్‌వేర్‌లో భద్రత లోపాలను వారాలపాటు నిరాకరించిన సీబీఎస్‌ఈ ఎట్టకేలకు అంగీకరించిందని, బహుశా ఈ విషయం ముందుగానే తెలియడం వల్లనే కోంఎప్ట్కు అనుగుణంగా నిబంధనలను మార్చి ఉంటారని విమర్శించారు.
సరిగ్గా పనిచేయని కాంట్రాక్టు సంస్థలను బ్లాక్‌లిస్ట్ చేస్తామని 2025 ఆగస్టు టెండర్ నిబంధనలు స్పష్టం చేయగా సెపె్టంబర్ నెలలో సవరణల పేరుతో ఈ నిబంధనను తొలగించిన విషయాన్ని రమేశ్ ఎత్తిచూపారు. కోఎంప్ట్ను రక్షించేందుకు కేంద్రం ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నమిదని స్పష్టం చేశారు.
‘‘మంత్రి ప్రధాన్ అసమర్థతకు, అహానికి నిలువెత్తు నిదర్శనం. తన రాజకీయ అజెండాను అన్ని రకాల బాధ్యతలకు అతీతంగా ముందుకు నడిపించాలని చూసే వ్యక్తి’’అని ఆరోపించారు. ఇదిలా ఉండగా... సోమవారం ఉదయం కేంద్ర విద్యా శాఖ భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంపై కూడా జైరామ్ రమేశ్ ఇంకో ఎక్స్ పోస్టులు అనుమానాలు వ్యక్తం చేశారు. ‘‘ఇది (ప్రమాద ఘటన) కూడా చాలా అనుమానాస్పదంగా ఉంది’’అని వ్యాఖ్యానించారు.
విద్యా వ్యవస్థ పునాదులు ధ్వంసం: పవన్ ఖేరా
పన్నెండేళ్ల పాలనలో మోదీ ప్రభుత్వం విద్యావ్యవస్థను ధ్వంసం చేసిందని కాంగ్రెస్ పార్టీ మీడియా అండ్ పబ్లిసిటీ విభాగం అధ్యక్షుడు పవన్ ఖేరా సోమవారం విమర్శించారు. ‘‘సీబీఎస్‌ఈ కాంప్రమైజ్ అయిపోయింది. యూజీసీ ధ్వంసమైపోయింది. ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలు కాషాయమైపోయాయి. యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్లను ఆర్‌ఎస్‌ఎస్ నియమిస్తోంది. విద్యార్థులు ఎవరైనా ప్రతిఘటిస్తే అణచివేస్తున్నారు.
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, మైనార్టీ యవత హక్కులు కాలరాస్తున్నారు. నిరుద్యోగం ప్రబలిపోయింది. శాస్త్రీయ దృక్పథం కొరవడింది.’’అని ఆయన మోదీ హయాంపై విమర్శలు వెల్లువెత్తించారు. భారతీయ విద్యార్థుల భవిష్యత్తును ఈ ప్రభుత్వం స్తంభింపజేసిందని అన్నారు. పరీక్ష పే చర్చ, ఎగ్జామ్ వారియర్స్ పేరుతో ప్రధాని తన ప్రచారాన్ని మాత్రం కొనసాగిస్తూంటే... పిల్లలు వారి తల్లిదండ్రులు మాత్రం రోజూ ఎంతో వేదనను అనుభవిస్తున్నారని అన్నారు. ఓఎస్‌ఎంపై ఉపాధ్యాయులు, నిపుణులు సుమారు 36 ప్రధాన లోపాలను ఎత్తిచూపినా సీబీఎస్‌ఈ ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు.


