
రాయ్‌బరేలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రకటన
రాయ్‌బరేలీ: ‘ఓటు చోర్, గద్దీ చోడ్’ నినాదం దేశమంతటా వినిపిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఓట్ల చోరీ బాగోతాన్ని భిన్నరూపాల్లో బయటపెడతామని చెప్పారు. ఓట్ల దొంగలు పదవుల నుంచి దిగిపోవాలని ప్రజలు నినదిస్తున్నారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ పార్లమెంట్ నియోజక వర్గానికి చేరుకున్నారు. పార్టీ కార్యకర్తలతో సమావేశమ య్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఓట్ల చోరీ ముమ్మాటికీ నిజమని తేల్చిచెప్పారు. ప్రజల ఓట్లను దొంగలించి గద్దెనెక్కినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. మహారాష్ట్ర, కర్ణాటకలో జరిగిన ఓట్ల చోరీపై తమవద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని పునరుద్ఘాటించారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కోటి మందిని కొత్తగా ఓటర్లుగా చేర్పించి బీజేపీ గెలిచిందని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్, హరియాణా, మధ్యప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లోనూ భారీ ఎత్తున ఓట్ల దొంగతనం జరిగిందని మండిపడ్డారు. ఓట్ల చోరీపై పోరాటం మరింత ఉధృతం చేస్తామని స్పష్టంచేశారు. కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తే రాజ్యాంగాన్ని, జాతీయ జెండాను కూడా కాపాడినట్లేనని రాహుల్ అన్నారు. దేశ సంపద ప్రజలందరికీ చెందుతుందని రాజ్యాంగం నిర్దేశిస్తున్నట్లు గుర్తుచేశారు. ఇదిలా ఉండగా, రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీతోపాటు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఫోటోలతో కూడిన పోస్టర్లు ఏర్పాటు చేశారు. ‘భారతదేశం చివరి ఆశ కలియుగ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు’ అంటూ వాటిపై నినాదాలు రాశారు.