
పుణేలోని ఈ రోడ్డు పౌర ఇంజనీరింగ్ అద్భుతం
ఈ రోజు వేస్తే.. నెల రోజుల తరువాత గుంతలు. ఇది ఇటీవలి కాలంలో రోడ్ల దుస్థితి. కానీ.. ఆ రోడ్డు వేసిన 50 ఏళ్లకు కూడా చెక్కు చెదరలేదు. 35 ఏళ్ల తరువాత ఒక్కసారి మాత్రమే మళ్లీ తారు వేశారంతే.
కేవలం పదేళ్ల వారంటీతో వేసిన రోడ్డు 50 ఏళ్లయినా రిపేరుకు రాకపోవడానికి కారణమేంటి? అసలు ఒక రోడ్డు అన్నేళ్లు గుంతలు పడకుండా ఎలా ఉంటుంది? వేసిన కొద్ది రోజులకే గుంతలు పడేలా రోడ్లేస్తున్న ప్రస్తుత కాంట్రాక్టర్లు, నేతల్ని సిగ్గు పడేలా చేస్తున్న ఆ రోడ్డు ఎక్కడ ఉంది? ఇవన్నీ తెలియాలంటే.. మీరు పుణేకి వెళ్లాల్సిందే.
ఆ రోడ్డు.. పుణేలోని జంగ్లీ మహరాజ్ రోడ్డు. దీన్ని బ్లాక్ పాంథర్ లైన్‌గా కూడా పిలుచుకుంటారు. 1976లో 2.5 కిలోమీటర్ల విస్తీర్ణంలో వేశారు. వేసేనాటికి పదేళ్లుంటే చాలనుకున్నారు. కానీ.. కొత్తగా నిర్మించిన రోడ్లు, వంతెనలు కూలిపోతున్నప్పటికీ, దాదాపు 50 ఏళ్ల కిందట నిర్మించిన రోడ్డు మాత్రం ఒక ప్రత్యేకమైన పౌర ఇంజనీరింగ్ అద్భుతంగా నిలిచింది. అయితే.. చెక్కు చెదరకుండా ఉన్నప్పటికీ.. 2014లో మరోసారి తారు వేశారు.
పుణేలోని జంగ్లీ మహారాజ్ రోడ్డులో ప్రసిద్ధ రెస్టారెంట్లు, కొన్ని ముఖ్యమైన దేవాలయాలున్నాయి. రోడ్డు ఎంత బాగుంటుందంటే.. తమ యవ్వనంలో రాత్రి పూట రేస్ ట్రాక్‌గా ఉపయోగించుకునేవాళ్లమని చెబుతున్నారు స్థానికుడు 70 ఏళ్ల ఉపేంద్ర లక్ష్మేశ్వర్. ‘ప్రారంభించిన మూడు నెలలకే కర్ణాటకలోని రూ. 6.5 కోట్ల చిక్కోడి వంతెన కూలిపోయింది’, ‘ప్రారంభించిన మూడు నెలలకే ఢిల్లీ విమానాశ్రయ పైకప్పు గుంతలు’, ‘గురుగ్రామ్‌లో రోడ్డు గుంతలో భారీ ట్రక్కు దిగబడింది’వంటి కని, వినిపిస్తున్న ఈ కాలంలో నాణ్యమైన మౌలిక సదుపాయాలకు ఇదో మచ్చు తునక అంటారు అతని కొడుకు 40 ఏళ్ల సిద్ధార్థ్ లకేష్మశ్వర్. మిగిలిన రోడ్ల నిర్మాణంలో ఈ బ్లాక్ పాంథర్ లైన్ నిర్మాణాన్ని ఎందుకు అనుసరించలేదనేది స్థానికుల ప్రశ్న.
విశ్వాత్మక్ గురుదేవ్ అని కూడా పిలుచుకునే జంగ్లి మహారాజ్ 1818లో బరోడాలో (ఇప్పుడు గుజరాత్‌లోని వడోదర) జన్మించారు. పుణేలోని శివాజీనగర్‌లో ఉన్న దట్టమైన భంబుర్డే అడవులలో ధ్యానం చేశారు. అక్కడే ఇప్పుడు రోడ్డు ఉంది. 1972లో మహారాష్ట్ర తీవ్రమైన కరువును ఎదుర్కొంది. ఆ తర్వాత 1973లో వరదలు పుణే రోడ్లను ధ్వంసం చేశాయి. అయితే ముంబై రోడ్లు మాత్రం ఆ వరదలను తట్టుకున్నాయి. అప్పట్లో 21 ఏళ్ల కార్పొరేటర్, స్టాండింగ్ కమిటీ చైర్మన్ అయిన శ్రీకాంత్ శిరోలే దీని గురించి ఆరా తీశారు.
మన్నికైన రోడ్ల కోసం అధునాతన హాట్ మిక్స్ టెక్నాలజీని ఉపయోగించిన పార్సీ యాజమాన్యంలోని ముంబై కంపెనీ రెకొండో వేసినట్లు ఇంజనీర్లు తెలిపారు. పుణేలోని రోడ్లను అదే కంపెనీకి అప్పజెప్పారు. రోడ్డు 10 సంవత్సరాల పాటు గుంతలు లేకుండా ఉంటుందని, ఆలోపు ఏవైనా మరమ్మతులు వస్తే ఎటువంటి ఖర్చు లేకుండా చేస్తామనే హామీతో వేశారు. 15 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ రోడ్డును 1976 జనవరి 1న ప్రారంభించారు. ఆ రోడ్డు పూర్తిగా చెక్కుచెదరకుండా ఉంది. 2014లో పుణే స్మార్ట్ సిటీ మిషన్‌లో భాగంగా రోడ్డును పూర్తిగా మార్చారు. సైకిల్ ట్రాక్, విశాలమైన కాలిబాటలు, మెరుగైన లైటింగ్ ఏర్పాటు చేశారు.
– సాక్షి, నేషనల్ డెస్క్