రిటైర్మెంట్ వయసులో నియామక ఉత్తర్వు | PSC Appointment Order Reaches 60 Year Old Candidate After Two Decades of Delay | Sakshi
Sakshi News home page

రిటైర్మెంట్ వయసులో నియామక ఉత్తర్వు

Jun 1 2026 11:51 AM | Updated on Jun 1 2026 7:46 PM

PSC Appointment Order Reaches 60 Year Old Candidate After Two Decades of Delay

మలప్పురం: కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన ముచ్చికల్ అబ్దుల్ మజీద్‌కు ఎదురైన పరిస్థితి ఇప్పుడు అంతటా చర్చనీయాంశమైంది. రెండు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆయనకు పీఎస్‌సీ ఉద్యోగ నియామక ఉత్తర్వు అందింది. అయితే ప్రస్తుతం మజీద్ వయస్సు 60 ఏళ్లు దాటడంతో, ఉద్యోగంలో చేరడమా లేదా రిటైర్మెంట్ తీసుకోవడమా అన్న సందిగ్ధంలో ఆయన చిక్కుకుపోయారు.

2005లో పీఎస్‌సీ పరీక్ష రాసి..
2005లో మజీద్ పార్ట్-టైమ్ జూనియర్ ఎల్‌పీఎస్ అరబిక్ లాంగ్వేజ్ టీచర్ పోస్టు కోసం పీఎస్‌సీ పరీక్ష రాశారు. ఆ ర్యాంక్ లిస్టులో ఆయన 12వ స్థానంలో నిలిచారు. నిబంధనల ప్రకారం ఆ ఉద్యోగం ఆయనకు దక్కాల్సింది. కానీ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆ ప్రక్రియ 18 ఏళ్ల పాటు సాగదీతకు గురైంది. 2022లో ఆ ఖాళీని పీఎస్‌సీ గుర్తించినప్పటికీ, ఉత్తర్వు రావడానికి మరో నాలుగేళ్లు పట్టింది.

పరిపాలనా వైఫల్యాలకు పరాకాష్ట
ఒక నియామక ప్రక్రియ గరిష్టంగా ఏడాదిలోపు పూర్తి కావాల్సిన చోట, దాదాపు రెండు దశాబ్దాలు పట్టడం వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతోంది. 2026 ఏప్రిల్ 26న మజీద్‌కు నియామక ఉత్తర్వు అందినప్పటికీ, అప్పటికే ఆయన పదవీ విరమణ వయసు చేరుకోవడంతో అది అపహాస్యం పాలైంది. అధికార యంత్రాంగం,  పీఎస్‌సీ వ్యవహరించిన తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

న్యాయం కోసం పోరాటం
ప్రస్తుతం తన రికార్డుల్లో పుట్టిన తేదీకి సంబంధించి ఉన్న చిన్న తప్పును సరిదిద్దాలని మజీద్ కోరుతున్నారు. తన అసలు పుట్టిన తేదీ ఆధారంగా, కనీసం ఒక్క ఏడాది పాటు సర్వీసులో ఉండే అవకాశం కల్పించాలని ఆయన ముఖ్యమంత్రిని ఆశ్రయించారు. లేనిపక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి సిద్ధమవుతున్నారు. పట్టు వదలని ఈ ఉపాధ్యాయుని పోరాటపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చసాగుతోంది.

ఇది కూడా చదవండి: ‘పహల్గామ్’ ఉగ్రవాదులకు పాక్ బ్యాంక్ అండ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement