అధికారి పొరపాటు..17 ఏళ్ల పోరాటం  | Police officer mistakes wrongly arrested due to clerical error under the Gangster Act | Sakshi
Sakshi News home page

అధికారి పొరపాటు..17 ఏళ్ల పోరాటం 

Jul 28 2025 6:22 AM | Updated on Jul 28 2025 6:22 AM

Police officer mistakes wrongly arrested due to clerical error under the Gangster Act

22 రోజుల జైలు, 300 కోర్టు వాయిదాలు 

ఎట్టకేలకు యూపీ వాసి విజయం 

మెయిన్‌పురి: పోలీసు అధికారి పొరపాటు కారణంగా గ్యాంగ్‌స్టర్‌ చట్టం కేసులో ఇరుక్కున్న ఓ వ్యక్తి 17 ఏళ్లపాటు న్యాయ పోరాటం సాగించాడు. చిట్టచివరికి 62 ఏళ్ల వయస్సులో కోర్టు ఆయన్ను నిర్దోషిగా ప్రకటించింది. 22 రోజులపాటు జైలు జీవితం అనుభవించి, కనీసం 300 సార్లు కోర్టు వాయిదాలకు తిరిగి తిరిగీ అలసిపోయిన అతడితో కుటుంబం సంబంధాలు తెంచుకుంది. బడికి వెళ్లాల్సిన ఒక్కగానొక్క కొడుకు రోజు కూలీగా మారాడు. అన్నిటికీ తోడు సొంతూళ్లో అవమాన భారం. ఇదంతా ఏ తప్పూ చేయకుండానే భరించాడు రాజ్‌ వీర్‌. దాదాపు రెండు దశాబ్దాల పాటు అనుభవించిన వేదన పోలీసు అధికారి చేసిన చిన్న పొరపాటు ఫలితం కావడం గమనార్హం..! 

యూపీలోని మెయిన్‌పురి జిల్లా నగ్లా భంట్‌ గ్రామంలో ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవపై పోలీసులు నలుగురిపై 2008 ఆగస్ట్‌ 31న కేసు నమోదు చేశారు. వీరు మనోజ్‌ యాదవ్, పర్వేష్‌ యాదవ్, భోలా యాదవ్, రాంవీర్‌ సింగ్‌. అనంతరం వీరిపై గ్యాంగ్‌స్టర్‌ చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. రాంవీర్‌ సోదరుడే రాజ్‌ వీర్‌. కొత్వాలీ ఇన్‌స్పెక్టర్‌ రాం వీర్‌కు బదులుగా అతడి సోదరుడు రాజ్‌ వీర్‌ సింగ్‌ పేరు నిందితుల పేర్లలో చేర్చారు. దీంతో అతడి జీవితమే మారిపోయింది. రికార్డుల్లో ఉన్న ప్రకారం పోలీసులు రాజ్‌ వీర్‌ను పట్టుకెళ్లారు. పట్టుకోవాల్సింది రాంవీర్‌నని, తాను అమయాకుడిననీ ఎంత మొత్తుకున్నా అధికారులు వినిపించుకోలేదు. 22 రోజులపాటు జైలులో ఉన్నాక బెయిల్‌ లభించింది. అప్పటి నుంచి అతడి కష్టాలు మొదలయ్యాయి.

 అసలు దోషి తాను కాదని నిరూపించుకునేందుకు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. కేసు ఆగ్రా నుంచి మెయిన్‌పురి కోర్టుకు మారే వరకు దాదాపు 300 సార్లు వాయిదాలకు హాజరయ్యాడు. ‘నా క్లయింట్‌ గోడును ఎవరూ పట్టించుకోలేదు. అతడికి ఎలాంటి నేర చరిత్ర లేదు. ఏ కేసులూ లేవు. అయినా 22 రోజులు జైలులో ఉండాల్సి వచ్చింది. ఈ వ్యవస్థపై ఇన్నేళ్లూ ఒంటరిగా పోరాటం సాగించాడు’అని లాయర్‌ వినోద్‌ కుమార్‌ యాదవ్‌ పేర్కొన్నారు. ‘రాజ్‌ వీర్‌ కుటుంబం బాగోగులను చూసుకోలేకపోయాడు. ఇద్దరి కూతుళ్లకు ఎలాగోలా పెళ్లిళ్లు చేయగలిగాడు. కుటుంబ పోషణకు కుమారుడు వ్యవసాయ కూలీగా మారాడు’అని వివరించారు. గురువారం వాదనలు విన్న మెయిన్‌పురి కోర్టు రాజ్‌ వీర్‌ను నిర్దోషిగా ప్రకటించింది. 

జీవితంపై ఎంతో ఆశతో కష్టపడి పనిచేసే వ్యక్తి చట్టపరమైన చిక్కుల్లో పడిపోయాడు. దాచుకున్న డబ్బు హరించిపోయింది. పరువు పోయింది. కుటుంబ జీవితంపై తీవ్ర ప్రభావం చూపింది. తన తప్పు లేకున్నా ఇవన్నీ అనుభవించాల్సి వచ్చింది రాజ్‌ వీర్‌. ఈ నెల 24న మెయిన్‌పురి కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి స్వప్న దీప్‌ సింఘాల్‌ రాజ్‌ వీర్‌కు సాంత్వన నిచ్చేలా తీర్పు వెలువరించారు. ‘పోలీసులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒక అమాయకుడు 22 రోజుల పాటు జైలులో ఉండాల్సి వచ్చింది. ఒక తప్పుడు కేసులో 17 ఏళ్లపాటు పోరాడాల్సి వచ్చింది. దీనిపై విచారణ చేపట్టి, ఇందుకు కారణమైన అధికారులపై తగు చర్యలు తీసుకోవాలి’అని జడ్జి ఆదేశించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement