breaking news
Gangster Act
-
అధికారి పొరపాటు..17 ఏళ్ల పోరాటం
మెయిన్‌పురి: పోలీసు అధికారి పొరపాటు కారణంగా గ్యాంగ్‌స్టర్ చట్టం కేసులో ఇరుక్కున్న ఓ వ్యక్తి 17 ఏళ్లపాటు న్యాయ పోరాటం సాగించాడు. చిట్టచివరికి 62 ఏళ్ల వయస్సులో కోర్టు ఆయన్ను నిర్దోషిగా ప్రకటించింది. 22 రోజులపాటు జైలు జీవితం అనుభవించి, కనీసం 300 సార్లు కోర్టు వాయిదాలకు తిరిగి తిరిగీ అలసిపోయిన అతడితో కుటుంబం సంబంధాలు తెంచుకుంది. బడికి వెళ్లాల్సిన ఒక్కగానొక్క కొడుకు రోజు కూలీగా మారాడు. అన్నిటికీ తోడు సొంతూళ్లో అవమాన భారం. ఇదంతా ఏ తప్పూ చేయకుండానే భరించాడు రాజ్ వీర్. దాదాపు రెండు దశాబ్దాల పాటు అనుభవించిన వేదన పోలీసు అధికారి చేసిన చిన్న పొరపాటు ఫలితం కావడం గమనార్హం..! యూపీలోని మెయిన్‌పురి జిల్లా నగ్లా భంట్ గ్రామంలో ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవపై పోలీసులు నలుగురిపై 2008 ఆగస్ట్ 31న కేసు నమోదు చేశారు. వీరు మనోజ్ యాదవ్, పర్వేష్ యాదవ్, భోలా యాదవ్, రాంవీర్ సింగ్. అనంతరం వీరిపై గ్యాంగ్‌స్టర్ చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. రాంవీర్ సోదరుడే రాజ్ వీర్. కొత్వాలీ ఇన్స్పెక్టర్ రాం వీర్‌కు బదులుగా అతడి సోదరుడు రాజ్ వీర్ సింగ్ పేరు నిందితుల పేర్లలో చేర్చారు. దీంతో అతడి జీవితమే మారిపోయింది. రికార్డుల్లో ఉన్న ప్రకారం పోలీసులు రాజ్ వీర్‌ను పట్టుకెళ్లారు. పట్టుకోవాల్సింది రాంవీర్‌నని, తాను అమయాకుడిననీ ఎంత మొత్తుకున్నా అధికారులు వినిపించుకోలేదు. 22 రోజులపాటు జైలులో ఉన్నాక బెయిల్ లభించింది. అప్పటి నుంచి అతడి కష్టాలు మొదలయ్యాయి. అసలు దోషి తాను కాదని నిరూపించుకునేందుకు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. కేసు ఆగ్రా నుంచి మెయిన్‌పురి కోర్టుకు మారే వరకు దాదాపు 300 సార్లు వాయిదాలకు హాజరయ్యాడు. ‘నా క్లయింట్ గోడును ఎవరూ పట్టించుకోలేదు. అతడికి ఎలాంటి నేర చరిత్ర లేదు. ఏ కేసులూ లేవు. అయినా 22 రోజులు జైలులో ఉండాల్సి వచ్చింది. ఈ వ్యవస్థపై ఇన్నేళ్లూ ఒంటరిగా పోరాటం సాగించాడు’అని లాయర్ వినోద్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ‘రాజ్ వీర్ కుటుంబం బాగోగులను చూసుకోలేకపోయాడు. ఇద్దరి కూతుళ్లకు ఎలాగోలా పెళ్లిళ్లు చేయగలిగాడు. కుటుంబ పోషణకు కుమారుడు వ్యవసాయ కూలీగా మారాడు’అని వివరించారు. గురువారం వాదనలు విన్న మెయిన్‌పురి కోర్టు రాజ్ వీర్‌ను నిర్దోషిగా ప్రకటించింది. జీవితంపై ఎంతో ఆశతో కష్టపడి పనిచేసే వ్యక్తి చట్టపరమైన చిక్కుల్లో పడిపోయాడు. దాచుకున్న డబ్బు హరించిపోయింది. పరువు పోయింది. కుటుంబ జీవితంపై తీవ్ర ప్రభావం చూపింది. తన తప్పు లేకున్నా ఇవన్నీ అనుభవించాల్సి వచ్చింది రాజ్ వీర్. ఈ నెల 24న మెయిన్‌పురి కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి స్వప్న దీప్ సింఘాల్ రాజ్ వీర్‌కు సాంత్వన నిచ్చేలా తీర్పు వెలువరించారు. ‘పోలీసులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒక అమాయకుడు 22 రోజుల పాటు జైలులో ఉండాల్సి వచ్చింది. ఒక తప్పుడు కేసులో 17 ఏళ్లపాటు పోరాడాల్సి వచ్చింది. దీనిపై విచారణ చేపట్టి, ఇందుకు కారణమైన అధికారులపై తగు చర్యలు తీసుకోవాలి’అని జడ్జి ఆదేశించారు. -
బక్రీద్ రోజు జంతు వధ బ్యాన్.. కఠిన చర్యలు!
సాక్షి, సంభల్: బక్రీద్ పూట ఉత్తర ప్రదేశ్‌లోని సంభల్ ప్రాంతంలో జంతు బలి నిషేధంపై అధికారులు వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేశారు. ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడితే వారిపై గ్యాంగ్ స్టర్ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ రషీద్ ఖాన్ హెచ్చరించారు. ‘కుర్బానీ పేరిట ఎవరైనా ఆవు, ఎద్దు, దున్నపోతు, ఒంటెలను బలి ఇవ్వటం నిషేధం. సెప్టెంబర్ 2 నుంచి 4 వరకు ఈ ఆజ్ఞలు అమలులో ఉంటాయి. ఉల్లంఘించిన వారిపై గ్యాంగ్ స్టర్ యాక్ట్ కింద కఠిన చర్యలు ఉంటాయి’ అని ఆయన తెలిపారు. ఆదేశాలు తక్షణమే అమలులోకి వచ్చినట్లు రషీద్ వెల్లడించారు. గ్యాంగ్ స్టర్ యాక్ట్ ప్రకారం సదరు వ్యక్తి పేరును పోలీస్ రికార్డుల్లో చేరుస్తారు. వారిపై నిఘా కూడా ఎక్కువగా ఉంటుంది. మాములు పరిస్థితుల్లో 14 రోజులు, ఉద్రిక్తల సమయంలో 60 రోజులపాటు పోలీస్ రిమాండ్‌లో ఉంచుకునేందుకు ఆస్కారం ఉంది. బకర్ ఈద్(ఈద్-ఉల్-జుహ). అంటే గొర్రెను బలిచ్చే పండుగ అని అర్ధం. ఇబ్రహీం త్యాగానికి ప్రతీకగా బక్రీద్ రోజు ప్రతి ముస్లిం జంతు బలి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. బలి ఇచ్చిన తర్వాత దానిని మూడు భాగాలుగా విభజించి ఒక భాగాన్ని పేదలకు, మరొక భాగాన్ని బంధువులకు పంచుతారు. ఇంకొక భాగాన్ని తమ కోసం ఉంచుకుంటారు. తక్బీర్ ను పఠిస్తూ ప్రార్థనలకు చేస్తూ బక్రీద్ ను జరుపుకుంటారు.