
‘మార్నింగ్ కన్సల్ట్’సర్వేలో వెల్లడి
రెండో స్థానంలో దక్షిణ కొరియా అధ్యక్షుడు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఎనిమిదో ర్యాంకు
న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ, విశ్వసనీయత కలిగిన నాయకుడిగా మరోసారి ఘనత సాధించారు. అమెరికాకు చెందిన ఇంటెలిజెన్స్ సంస్థ ‘మార్నింగ్ కన్సల్ట్’నిర్వహించిన గ్లోబల్ లీడర్ అప్రూవల్ ట్రాకర్ సర్వేలో ఈ విషయం వెల్లడయ్యింది. మోదీకి ఏకంగా 75 శాతం అప్రూవల్ రేటింగ్ లభించడం విశేషం. అంటే సర్వేలో పాల్గొన్నవారిలో 75 శాతం మంది మోదీని ప్రజాస్వామ్య ప్రపంచ నేతగా ఆమోదించారు. 18 శాతం మంది మోదీ వైపు మొగ్గు చూపలేదు. మిగతా 7 శాతం మంది ఏదీ చెప్పలేకపోయారు.
ఈ సర్వే వివరాలను ‘మార్నింగ్ కన్సల్ట్’ విడుదల చేసింది. అత్యంత విశ్వసనీయ ప్రపంచ నాయకుల్లో మోదీ మొదటి స్థానంలో ఉండగా, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ రెండో స్థానంలో, అర్జెంటీనా అధినేత జేవియర్ మిలీ మూడో స్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కేవలం 44 శాతం అప్రూవల్ రేటింగ్‌తో ఎనిమిదో స్థానానికి పరిమితం కావడం గమనార్హం. ఈ నెల 4 నుంచి 10వ తేదీ దాకా ఈ సర్వే నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో ప్రజాభిప్రాయం సేకరించారు. డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాల కారణంగానే ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ తగ్గుతున్నట్లు తెలుస్తోంది.