9న పంజాబ్‌కు ప్రధాని మోదీ.. వరద ‍ప్రభావిత ప్రాంతాల సందర్శన | PM Modi to Visit Flood Hit Punjab Gurdaspur On September 9, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

9న పంజాబ్‌కు ప్రధాని మోదీ.. వరద ‍ప్రభావిత ప్రాంతాల సందర్శన

Sep 7 2025 1:42 PM | Updated on Sep 7 2025 1:56 PM

PM Modi to Visit Gurdaspur on September 9

చండీగఢ్: పంజాబ్‌ను ఇటీవల వరదలు చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 9న ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ను సందర్శించి, వరద పరిస్థితిని, సహాయక చర్యలను సమీక్షించనున్నారు. ఈ పర్యటనలో ఆయన వరద బాధితులతో, రైతులతో నేరుగా మాట్లాడతారని బీజేపీ పంజాబ్ యూనిట్ ‘ఎక్స్’ (ట్విట్టర్)లో తెలిపింది.

ప్రధాని మోదీ గురుదాస్‌పూర్ పర్యటన
‘ఎక్స్’ పోస్ట్‌లో బీజేపీ.. ‘ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 9న పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌కు వస్తున్నారు. వరద బాధిత  రైతులతో ఆయన నేరుగా సమావేశమై వారి కష్టనష్టాలను తెలుసుకుంటారు. వారికి సహాయం చేయడానికి సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటారు’ అని పేర్కొంది. ఈ పర్యటన ద్వారా  బీజేపీ ప్రభుత్వం పంజాబ్ ప్రజలకు అండగా ఉంటుందని, ఈ క్లిష్ట సమయంలో సహాయాన్ని అందిస్తుందని పోస్ట్‌లో వివరించారు.

పంజాబ్‌లో వరదలు
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఇటీవల ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 500 మందికి పైగా జనం ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని మోదీ పంజాబ్‌తో పాటు జమ్ముకశ్మీర్, గుజరాత్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్‌లను సందర్శించనున్నారు. పంజాబ్‌లోని 23 జిల్లాల్లో సుమారు 1,650 గ్రామాలు నీటి మునిగాయి. దాదాపు 1.75 లక్షల ఎకరాల వ్యవసాయ భూములు, ముఖ్యంగా వరి పంట దెబ్బతింది. బియాస్, సట్లజ్, రావి, ఘగ్గర్ నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. భాక్రా, పాంగ్, రంజిత్ సాగర్ వంటి ప్రధాన ఆనకట్టల నుంచి నీటిని నియంత్రించి విడుదల చేయడం వల్ల సంక్షోభం మరింత తీవ్రమైంది.
 

గురుదాస్‌పూర్ జిల్లాలో అత్యధికంగా 1.45 లక్షల మంది ప్రజలు వరదలకు ప్రభావితమయ్యారు. అలాగే అమృత్‌సర్, ఫిరోజ్‌పూర్, ఫాజిల్కా జిల్లాలు కూడా ప్రభావితమయ్యాయి. పంజాబ్‌లో ఇప్పటివరకు 37 మంది మరణించగా, ముగ్గురు గల్లంతయ్యారు. సైన్యం, వైమానిక దళం, బీఎస్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ దళాలు సహాయక చర్యలను వేగవంతం చేశాయి. పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, సెప్టెంబర్ 7 వరకు అన్ని విద్యా సంస్థలను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

గత కొన్ని రోజులుగా పంజాబ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వేలాది ఇళ్లలోకి నీరు చేరింది. రవాణా వ్యవస్థను స్తంభించిపోయింది. గత నెల రోజులుగా సంభవిస్తున్న వరదల కారణంగా 46 మంది ప్రాణాలు కోల్పోయారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం ఈరోజు (ఆదివారం), రాబోయే రెండు రోజులలో పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement