పంజాబ్‌లో వరద బాధితులకు రిలయన్స్‌ సాయం | Reliance multi pronged relief in flood hit Punjab | Sakshi
Sakshi News home page

పంజాబ్‌లో వరద బాధితులకు రిలయన్స్‌ సాయం

Sep 12 2025 1:10 PM | Updated on Sep 12 2025 1:12 PM

Reliance multi pronged relief in flood hit Punjab

పంజాబ్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన ప్రజలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అండగా ఉంటుందని కంపెనీ డైరెక్టర్ అనంత్ అంబానీ భరోసా కల్పించారు. బాధితుల కష్టాలు తీర్చే ఉద్దేశంతో సహాయక చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు. అందులో భాగంగా స్థానిక అధికారులు, రాష్ట్ర పరిపాలన విభాగం, పంచాయతీలు, వివిధ కమ్యూనిటీ భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని తీవ్ర ప్రభావిత ప్రాంతాల్లో ఈమేరకు సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా అమృత్‌సర్‌, సుల్తాన్‌పూర్ లోధిలోని 10,000 కుటుంబాలకు సహాయం అందించడానికి చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

‘ఈ క్లిష్ట సమయంలో పంజాబ్ ప్రజలకు మా మద్దతు ఉంటుంది. తీవ్ర వర్షాభావం వల్ల చాలా కుటుంబాలు ఇళ్లు, జీవనోపాధి, భద్రతను కోల్పోయాయి. రిలయన్స్ కుటుంబం వారికి తోడుగా ఉంటుంది. ఆహారం, నీరు, ఆశ్రయం, పారిశుద్ధ్య కిట్లు.. వంటి వాటితో ప్రజలు, జంతువుల సంరక్షణకు అన్ని చర్యలు అందిస్తోంది. పంజాబ్ ప్రజల భద్రతకు కట్టుబడి ఉన్నాం. ఈ క్లిష్ట సమయంలో వారితో కలిసి ఉంటాం’ అని అనంత్ అంబానీ అన్నారు.

రిలయన్స్‌ అందిస్తోన్న సహాయక చర్యలు..

న్యూట్రిషన్ సపోర్ట్

వరద బాధితుల కోసం అత్యవసర పోషకాహార అవసరాలను తీర్చేందుకు చర్యలు చేపడుతుంది. వారికి అవసరమైన ఆహార సామాగ్రి, డ్రై రేషన్ కిట్లను 10,000 కుటుంబాలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒంటరి మహిళలు, వృద్ధుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5,000 వంతున వోచర్ ఆధారిత సహాయం అందించనున్నారు. తక్షణ పోషణను నిర్దారించేందుకు కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు  చేస్తున్నారు. స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉండేలా పోర్టబుల్ వాటర్ ఫిల్టర్లను సిద్ధం చేస్తున్నారు.

షెల్టర్ సపోర్ట్

వరదల నేపథ్యంలో నిర్వాసిత కుటుంబాలను రక్షించడానికి రిలయన్స్ టార్పాలిన్లు, గ్రౌండ్ షీట్లు, దోమతెరలు, తాళ్లతో కూడిన అత్యవసర షెల్టర్ కిట్లను అందిస్తోంది. వరద నీటి నుంచి అత్యవసరంగా ఆశ్రయం అవసరమైన కుటుంబాలకు ఈ కిట్లను పంపిణీ చేస్తున్నారు. ప్రజారోగ్య ప్రమాద నిర్వహణలో భాగంగా నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల వ్యాప్తిని నివారించడానికి రిలయన్స్ ఆరోగ్య అవగాహన ప్రచారాలను చేపడుతోంది. నీటి వనరుల్లో క్రిమిసంహారక చర్యలకు పూనుకుంది. వ్యాధి వ్యాప్తి ప్రమాదాన్ని అరికట్టడానికి ప్రతి ప్రభావిత కుటుంబానికి అవసరమైన పారిశుద్ధ్య కిట్లను అందజేస్తున్నారు.

పశువుల ఆరోగ్యానికి మద్దతుగా..

వరదల వల్ల పశుసంవర్ధక రంగం కూడా తీవ్రంగా ప్రభావితమైంది. పశువుల ఆవాసాల్లో నీరు నిలిచిపోవడం వల్ల జంతువుల మనుగడకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తుంది. రిలయన్స్, పశుసంవర్ధక శాఖ సహకారంతో పశువైద్య సర్వేలు నిర్వహిస్తోంది. పశువుల సంరక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తోంది. ప్రభావిత జంతువులకు మందులు, చికిత్సలు అందిస్తున్నారు. దాదాపు 5,000 పశువులకు ఆహారం ఇవ్వడానికి 3,000 కట్టల సైలేజ్ (పశుగ్రాసం) పంపిణీ చేస్తున్నారు.

జంతు సంరక్షణ

జంతు సంరక్షణ కోసం రిలయన్స్‌కు చెందిన వంటారాలోని ప్రత్యేక బృందం సహాయక చర్యలను అందిస్తోంది. 50 మందికి పైగా శిక్షణ పొందిన నిపుణులతో ఈ బృందం జంతువులను రక్షించడం, వైద్య సంరక్షణను అందించడం, వ్యాధి వ్యాప్తిని నివారించడానికి పని చేస్తోంది.

కమ్యునికేషన్‌ పునరుద్ధరణ

వరద ప్రభావిత ప్రాంతాలకు కనెక్టివిటీని పునరుద్ధరించడంలో జియో బృందం కీలక పాత్ర పోషిస్తోంది. రాష్ట్ర కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలు చెక్కుచెదరకుండా ఉండేలా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్ఎఫ్)తో కలిసి పనిచేస్తోంది. విపత్తు సహాయ కార్యకలాపాలను సమన్వయం చేయడానికి ప్రభావిత ప్రాంతాలకు అత్యవసర ప్రతిస్పందన బృందాలకు సర్వీసులు అందించేందుకు చర్యలు చేపడుతోంది.

రిలయన్స్ ఫౌండేషన్ స్థానిక వాలంటీర్ల సహకారంతో క్యూరేటెడ్ డ్రై-రేషన్, పారిశుద్ధ్య కిట్లను పంపిణీ చేస్తోంది. పోషణ, పరిశుభ్రత కోసం 21 నిత్యావసర వస్తువులను కలిగి ఉన్న ఈ కిట్లను స్థానిక పంచాయతీల పరిధిలోని ప్రజలకు సరఫరా చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement