
న్యూఢిల్లీ: అమెరికా- భారత్‌ల సంబంధాన్ని చాలా ప్రత్యేకమైనదని అభివర్ణించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాను, ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటికీ స్నేహితులుగానే ఉంటామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. దీనిపై ప్రధాని మోదీ స్పందించారు. అధ్యక్షుడు ట్రంప్ భావాలను తాను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని, ఆయనకు పూర్తిగా మద్దతు ఇస్తున్నానని అన్నారు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో ప్రధాని మోదీ ‘మా బంధం గురించి అధ్యక్షుడు ట్రంప్ వ్యక్తపరిచిన భావాలను, ఆయన సానుకూల అభిప్రాయాలను నేను అభినందిస్తున్నాను. భారత్- అమెరికాలు సానుకూల, దార్శనిక, సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి’ అని అన్నారు. సుంకాల విషయంలో భారత్-అమెరికా సంబంధాలు దెబ్బతిన్న ప్రస్తుత తరుణంలో ప్రధాని మోదీ అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలకు ఈ విధంగా స్పందించడం ఆసక్తకరంగా మారింది.
Deeply appreciate and fully reciprocate President Trump's sentiments and positive assessment of our ties.
India and the US have a very positive and forward-looking Comprehensive and Global Strategic Partnership.@realDonaldTrump @POTUS https://t.co/4hLo9wBpeF— Narendra Modi (@narendramodi) September 6, 2025
దీనికిముందు ట్రంప్ భారత్-అమెరికా సంబంధాలను చాలా ప్రత్యేకమైనవని అనడమే కాకుండా, తాను, ప్రధాని మోదీ ఎప్పటికీ స్నేహితులుగానే ఉంటామన్నారు. అయితే భారత్ రష్యన్ చమురు దిగుమతులను ప్రస్తావిస్తూ, ప్రధాని మోదీ ప్రస్తుతం చేస్తున్న దానిపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. భారతదేశంతో వాణిజ్య చర్చలు చక్కగా జరుగుతున్నాయని కూడా అమెరికా అధ్యక్షుడు అన్నారు. కాగా భారత్ ఎగుమతులపై అమెరికా సుంకాలు ఇప్పుడు 50 శాతానికి మించి ఉన్నాయి. భారతదేశం ఈ చర్యను ఖండించింది. దీనిని అన్యాయం, అసమంజసమైనదని పేర్కొంది.