ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ (సీసీఎస్) సమావేశం జరిగింది. ఈ భేటీలో ప్రధాని మోదీతో పాటు రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్,హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌లు పాల్గొన్నారు. ఇరాన్‌పై అమెరికా యుద్ధం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఇంధన సరఫరాలు, ఎరువుల లభ్యత, భారతీయుల భద్రత వంటి కీలక అంశాలపై చర్చ జరిగింది.
ఫిబ్రవరి 28న అమెరికా–ఇజ్రాయెల్ దాడుల అనంతరం ఇరాన్‌లో యుద్ధం ప్రారంభమైంది. అప్పటి నుంచి పశ్చిమ ఆసియా ప్రాంతంలో పరిస్థితులు మరింత క్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో కేంద్రం మూడోసారి సీసీఎస్ సమావేశం నిర్వహించింది. గత సమావేశాల్లో అంతర్జాతీయ పరిస్థితులు, ఇంధన సరఫరాలపై తీసుకున్న చర్యలను సమీక్షించారు. ప్రభుత్వం తెలిపిన ప్రకారం దేశానికి ప్రస్తుతం 60 రోజుల క్రూడ్ ఆయిల్ నిల్వలు ఉన్నాయి. మొత్తం నిల్వ సామర్థ్యం 74 రోజులు. పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎటువంటి పెరుగుదల లేదు. ఎల్‌పీజీ ధరలు కూడా పెంచలేదు.
ఈ ఏడాది ఖరీఫ్ కోసం తగినంత విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. వ్యవసాయ ఇన్‌పుట్స్‌లో ఎటువంటి కొరత లేదని హామీ ఇచ్చారు. అంతర్జాతీయ ధరలు పెరిగినా, దేశీయ విమాన ప్రయాణ ఖర్చులు పెరగకుండా ప్రభుత్వం నియంత్రణ చర్యలు తీసుకుంది. గల్ఫ్ ప్రాంతం నుంచి ఇప్పటివరకు 5.98 లక్షల మంది భారతీయులు తిరిగి వచ్చారు. ప్రస్తుతం 485 మంది భారతీయ నావికులు పర్షియన్ గల్ఫ్‌లో ఉన్నారు. వారందరూ సురక్షితంగా ఉన్నారని ఓడరేవులు, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ తెలిపింది. గల్ఫ్ ప్రాంతంలో చదువుతున్న భారతీయ విద్యార్థుల విద్యా సంవత్సరం అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం ప్రకటించింది.
ఇరాన్‌పై అమెరికా యుద్ధ ప్రభావం దేశంపై నేరుగా పడకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఇంధన నిల్వలు, ఎరువుల లభ్యత, విద్యార్థుల భద్రత వంటి అంశాలను సమగ్రంగా సమీక్షించడం ద్వారా ప్రజలకు నమ్మకం కల్పించడానికి ప్రయత్నిస్తోంది.


