పట్నా: ‘బిహార్‌లో 15 ఏళ్ల ఆటవిక పాలనలో.. ఎన్ని ఎక్స్‌ప్రెస్‌వేలు నిర్మించారు?.. జీరో. కోసి నదిపై ఎన్ని వంతెనలు నిర్మించారు?.. జీరో. ఎన్ని పర్యాటక సర్క్యూట్‌లు అభివృద్ధి చేశారు?.. జీరో. యువతకు ఎన్ని క్రీడా సముదాయాలు నిర్మించారు?.. జీరో. ఎన్ని వైద్య కళాశాలలు వచ్చాయి?.. జీరో.. ఐఐటీ, ఐఐఎం కూడా జీరో’.. ఒక తరం భవిష్యత్తును ఆర్జేడీ నేతలు బుగ్గిపాలు చేశారు’.. అని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) గురువారం అరారియా(బీహార్)లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పేర్కొన్నారు.
ఇప్పుడు బిహార్‌లోని అన్నివైపుల నుంచి ఒకే ఒక మాట వినిపిస్తున్నదని అది ‘మరోమారు ఎన్డీఏ సర్కార్’ అని అన్నారు. మొదటి దశ పోలింగ్‌లో బీహార్ ఓటర్లు అభివృద్ధి కోసం ఓటు వేస్తారని, చొరబాటుదారులను గుర్తించి, వెనుకను పంపుతారన్నారు. ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి.. చొరబాటుదారులను అక్రమంగా భారత పౌరులుగా మార్చడానికి ప్రయత్నిస్తోందని ప్రధాని ఆరోపించారు. ఆర్జేడీ జంగిల్ రాజ్.. బిహార్‌పై దాడి చేసిందని, జంగిల్ రాజ్ అంటే. పిస్టల్, క్రూరత్వం, అవినీతి దుర్మార్గపు పాలన అని అన్నారు.
తొలి దశ ఓటింగ్ గురించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, రాష్ట్రంలోని పలు మూలల నుండి సోషల్ మీడియాలో పలు ఫొటోలు వస్తున్నాయని అన్నారు. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద పొడవైన క్యూలు కనిపిస్తున్నాయని, మహిళలు ఓటు వేసేందుకుపెద్ద సంఖ్యలో వస్తున్నారన్నారు. బిహార్ యువతలో ఉత్సాహంతో ఉందన్నారు. ఓటర్లంతా ఓటు వేయాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: పోలింగ్ వేళ ‘బుర్కా’ వివాదం


