పట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ఓటింగ్ నేడు(గురువారం) ప్రశాంతంగా జరుగుతోంది. అధికారులు ఎన్నికల కమిషన్ నిబంధనలను అమలు చేస్తూ, పోలింగ్ సజావుగా జరిగేందుకు కృషి చేస్తున్నారు. అయితే మోసపూరిత ఓటింగ్‌ను నిరోధించేందుకు బుర్ఖా ధరించిన ఓటర్ల విషయంలో కఠినమైన తనిఖీలు చేయాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యానించడం వివాదానికి దారితీసింది.
గిరిరాజ్ సింగ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో షరియా చట్టం అమలులో లేదని, ఇది పాకిస్తాన్.. బంగ్లాదేశ్ కాదని.. భారత్ అని అన్నారు. దేశంలో లౌకికవాదం ఉందని, దేశంలో గుర్తింపు తనిఖీలు తప్పనిసరిగా జరగాలని, ఎన్నికల కమిషన్ నిబంధనలను పాటించాలని గిరిరాజ్ సింగ్ డిమాండ్ చేశారు. ఆధార్ నమోదు, విమానాశ్రయాల్లో తనిఖీల విషయంలో ఇప్పటికే ఈ తరహా ధృవీకరణ జరిగిందని అన్నారు.
తన ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ దేశంలో ఎన్నికల కమిషన్ నియమాలు వర్తిస్తాయని అన్నారు. బుర్ఖా ధరించిన మహిళలు ఆధార్ కార్డు తీసుకునేందుకు వెళ్లినప్పుడు, విమానాశ్రయానికి వెళ్లినప్పుడు, రిజర్వేషన్ పొందేందుకు వెళ్లినప్పుడు కూడా ఎందుకు ముసుగు తీయరని ప్రశ్నించారు. ఇది పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్ కాదని.. ఇది ఇస్లామిక్ దేశమా లేక లౌకిక దేశమా? అని ప్రశ్నించారు. ఇది లౌకిక దేశమని, సందేహమొస్తే మేము వారి ముఖాన్ని చూపించేలా చేస్తామన్నారు. గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యకు కేంద్ర మంత్రి, ల్జేపీ (రామ్ విలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ స్పందిస్తూ, ఆయన అనవసరంగా హిందూ-ముస్లింల మధ్య వివాదాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.


