రెండు దశాబ్దాల కల.. పాక్‌ సంతతి మహిళకు భారతీయ పౌరసత్వం | Pakistan Poonam Gets Indian Citizenship After Two Decades | Sakshi
Sakshi News home page

రెండు దశాబ్దాల కల.. పాక్‌ సంతతి మహిళకు భారతీయ పౌరసత్వం

Oct 29 2025 7:54 AM | Updated on Oct 29 2025 7:54 AM

Pakistan Poonam Gets Indian Citizenship After Two Decades

రాంపూర్‌/లక్నో: పాకిస్తాన్‌లోని స్వాత్‌ లోయ ప్రాంతంలో పెచ్చరిల్లిన ఉగ్రవాదంతో విసిగిపోయిన ఓ అమ్మాయి ధైర్యంగా దేశం దాటింది. నేరుగా భారత రాజధాని ఢిల్లీకి చేరుకుంది. ఇక్కడే నిర్భయంగా స్థిరనివాసం ఏర్పర్చుకోవాలని కలలు కన్నది. అనుకున్నట్లే భారతీయ స్థానిక వ్యాపారి పునీత్‌ కుమార్‌ను పెళ్లాడి ఇక్కడే ఉండిపోయింది. వాళ్లకో పాప. కొత్త జీవితం మొదలెట్టినా ఇక్కడి అధికారులు మాత్రం ఆమెను విదేశీయురాలిగానే చూశారు. భారత పౌరసత్వం కోసం ఎన్ని సార్లు అర్జీ పెట్టుకున్నా ఆ దరఖాస్తులను బుట్టదాఖలుచేశారు. ఎట్టకేలకు 21 ఏళ్ల తర్వాత ఆమె నిరీక్షణ ఫలించింది. 38 ఏళ్ల పూనమ్‌కు భారత పౌరసత్వం ఇస్తున్నట్లు కేంద్రప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.  

ఎన్ని అభ్యర్థనలు తిరస్కరణకు గురైనా.. 
2004లో సోదరుడు గగన్‌తో కలిసి పూనమ్‌ పాక్‌ సరిహద్దు దాటి భారత్‌లోకి ప్రవేశించింది. పాకిస్తాన్‌తో ఉగ్రవాదం, మత ఛాందసవాదం, అత్యంత పేదరికంతో పోలిస్తే భారత్‌లో ఎంతో స్వేచ్ఛగా, హాయిగా జీవించవచ్చన్న ఆశతో భారత్‌లోనే ఉండిపోవాలని నిర్ణయించుకుంది. తొలుత ఢిల్లీ, రాంపూర్‌లకు తరచూ మకాం మారుస్తూ గడిపారు. 2005లో పూనమ్‌ స్థానిక వ్యాపారి పునీత్‌ను పెళ్లాడింది. అయితే తల్లిదండ్రులు, బంధువులపై మమకారంతో తరచూ స్వదేశం వెళ్లి వాళ్లను కలిసి వచ్చేది. పాకిస్తానీ గుర్తింపు కార్డు ఉండటంతో ఇదంతా సాధ్యమైంది. కొన్నాళ్లకు ఆ గుర్తింపు కార్డ్‌ గడువు ముగియడం, పాకిస్తానీ పాస్‌పోర్ట్‌ రెన్యూవల్‌ సాధ్యంకాకపోవడంతో సొంతింటి సందర్శన కల చెదిరిపోయింది.

దీంతో ఆమె భారత్‌నే తన సొంతింటిగా భావించడం మొదలెట్టింది. ఇక్కడికి వచ్చినప్పటికీ నుంచే భారత పౌరసత్వం కోసం ఎన్నో సార్లు దరఖాస్తుచేసుకుంది. అన్నీ తిరస్కరణకు గురయ్యాయి. అయినా సరే పట్టువిడవక ప్రయత్నించి సఫలీకృతమైంది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) నిబంధనల మేరకు ఆమెకు ఇటీవల సిటిజన్‌షిప్‌ను ప్రకటించారు. దీంతో దీపావళి పండగ వేళ తమ కుటుంబంలో ఆనంద కాంతులు విరజిమ్మాయంటూ ఆమె భర్త పునీత్‌ సంబరపడ్డారు.

‘ఈ పౌరసత్వం నిజంగా మాకు పండగ కానుకే. ఇది ఈసారి దీపావళి మరింత ప్రత్యేకంగా మార్చింది. లక్నోకు వెళ్లి పౌరసత్వ సంబంధ పత్రాలను సమర్పిస్తాం’ అని పునీత్‌ సంతోషంతో చెప్పారు. ‘నా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. త్వరలో ఆధార్, పాన్‌ కార్డ్, ఇతర భారతీయ గుర్తింపు కార్డ్‌ల కోసం దరఖాస్తు చేస్తా. ఇవేం లేకపోయినా నేను భారతీయురాలినే. కానీ ఇకపై నిజమైన భారతీయురాలిగా జీవిస్తా’ అని పూనమ్‌ ఆనందభాష్పాలు రాలుస్తూ చెప్పారు.

గర్వంగా వెళ్లి వస్తా 
‘పాక్‌లోని స్వాత్‌ లోయలో ఉగ్రవాదం కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి. కనీసం మేమైనా ఎక్కడో ఒకచోట బతుకుతామనే ఆశతో నన్ను, నా సోదరుడి నాన్న భారత్‌కు పంపేశారు. ఇక్కడికొచ్చాక హాయిగా ఉన్నాం. ఇప్పుడు నాకు భారత పౌరసత్వం వచ్చింది. త్వరలోనే ఇండియన్‌ పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేస్తాం. అది వచ్చాక గర్వంగా పాక్‌లోని సొంతింటికి వెళ్లి మా వాళ్లను కలుస్తా’ అని ఆమె చెప్పారు. స్వాత్‌ లోయలోని మిన్గోరా ప్రాంతంలో తమ ఇల్లు ఉందని ఆమె వెల్లడించారు. ‘ఈమెకు భారత పౌరసత్వం ఇవ్వడంలో మాకు ఎలాంటి అభ్యంతరాలు కనిపించలేదు. అందుకే ఈసారి దరఖాస్తుకు ఓకే చెప్పాం’ అని రాంపూర్‌ పోలీస్‌ సూపరింటెండెంట్‌ విద్యాసాగర్‌ మిశ్రా చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement