పార్లమెంట్‌లో రైతు గర్జన

Opposition corners Govt over Farm Laws and Centre stand  - Sakshi

గాంధీజీ విగ్రహం వద్ద ప్రతిపక్షాల ఆందోళన

ఉభయసభల్లో వెల్‌లోకి దూసుకెళ్లిన సభ్యులు

ఆందోళనలతో ఉభయసభలు వాయిదా

సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాల ఉపసంహరణ డిమాండ్‌తో సుదీర్ఘకాలంగా రైతులు చేస్తున్న ఆందోళన గురువారం పార్లమెంట్‌లో ప్రతిబింబించింది. రైతుల డిమాండ్లను ప్రస్తావిస్తూ విపక్షాలు ఆందోళన నిర్వహించాయి. తొలుత పార్లమెంట్‌ ఆవరణలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టాయి. తర్వాత ఉభయ సభలు సమావేశమయ్యాక వెల్‌లోకి దూసుకెళ్లి విపక్ష సభ్యులు సభాకార్యకలాపాలను స్తంభింపజేశారు.

రైతులు డిమాండ్లు నెరవేర్చాలని, నల్ల చట్టాలు రద్దు చేయాలని నినదించారు. రైతుల ఉద్యమం, పెగసస్‌ ఫోన్ల హ్యాకింగ్‌ వ్యవహారంపై లోక్‌సభలో కాంగ్రెస్‌ తదితర విపక్షాలు వాయిదా తీర్మానానికి నోటీసులు ఇవ్వగా, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పక్ష నేత మిథున్‌రెడ్డి పోలవరం అంశంపై సావధాన తీర్మానం కోసం నోటీసులు ఇచ్చారు. ఇక రాజ్యసభలో విపక్షాలు రైతు ఆందోళన, పెగసస్‌ ఫోన్ల హ్యాకింగ్‌ అంశాలపై చర్చకు నోటీసులిచ్చారు. లోక్‌సభ సభాపతి ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్య ఆయా నోటీసులను తిరస్కరించారు.

వాయిదాల పర్వం..
గురువారం ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్, తృణమూల్‌ కాంగ్రెస్‌ తదితర పార్టీల ఎంపీలు ఆందోళన ప్రారంభించారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభా కార్యక్రమాలు కొద్దిసేపు కొనసాగినా తర్వాత పదేపదే సభ వాయిదాపడింది. తొలుత 12 గంటల వరకు, తర్వాత మధ్యాహ్నం రెండు గంటల వరకు, ఆ తర్వాత నాలుగు గంటలకు వాయిదాపడింది. నాలుగింటికి సభ మొదలైనా నిరసనలు ఆగకపోవడంతో సభను శుక్రవారానికి వాయిదావేశారు.

అటు రాజ్యసభలో ఇదే గందరగోళం నెలకొంది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్, టీఎంసీ తదితర పార్టీలు ఆందోళన చేపట్టాయి. పోడియం చుట్టుముట్టి ప్లకార్డులు ప్రదర్శిస్తూ విపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ఆందోళన మధ్య చైర్మన్‌ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తర్వాత సభ ప్రారంభమైనప్పటికీ ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. దీంతో కొద్దిసేపటికే 2 గంటలకు వాయిదాపడింది. తర్వాత మొదలైనా గందరగోళం నెలకొనడంతో శుక్రవారానికి వాయిదా వేశారు.

గాంధీ విగ్రహం వద్ద ఆందోళన
నూతన వ్యసాయ చట్టాలకు వ్యతిరేకంగా పార్లమెంట్‌ ఆవరణలో గురువారం ఉదయం ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్, సీపీఎం, సీపీఐ, ఆర్జేడీ, డీఎంకే తదితర పార్టీలు వేర్వేరుగా ఆందోళన చేపట్టాయి. తొలుత కాంగ్రెస్‌ పార్టీ ఆందోళన చేపట్టింది. కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, లోక్‌సభ పక్షనేత అధిర్‌ రంజన్, శశి థరూర్, మనీష్‌ తివారీ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు, రక్షణ రంగ ఉపకరణాలు, ఉత్పత్తుల్ని తయారుచేసే ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీల్లో సిబ్బంది సమ్మెలను నిరోధించడానికి ఉద్దేశించిన ఎసెన్షియల్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ బిల్లును ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. దేశీయజల్లాల్లో సరకు రవాణాకు ఉద్దేశించిన ఇన్‌ల్యాండ్‌ వెసెల్స్‌ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

ఆంక్షల నడుమ ‘కిసాన్‌ సంసద్‌’
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు సుమారు ఎనిమిది నెలలుగా పోరాటం చేస్తున్న రైతన్నలు ఎట్టకేలకు పార్లమెంట్‌కు కూతవేటు దూరానికి చేరుకున్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా తమ గళాన్ని తీవ్రతరం చేసే దిశలో సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపులో భాగంగా ఏర్పాటుచేసిన కిసాన్‌ సంసద్‌(రైతు పార్లమెంట్‌) కార్యక్రమం గురువారం పోలీసు ఆంక్షల నడుమ ప్రారంభమైంది. ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద కిసాన్‌ సంసద్‌ కార్యక్రమం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రశాంతంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో 200 మంది రైతులు పాల్గొన్నారు. కిసాన్‌ సంసద్‌కు స్పీకర్‌గా ఏఐకేఎస్‌ ప్రధాన కార్యదర్శి హన్నన్‌ మొల్లా వ్యవహరించగా డిప్యూటీ స్పీకర్‌గా మన్‌జీత్‌ సింగ్‌ ఉన్నారు.

తమ నిరసనల వాడి తగ్గలేదనీ, పార్లమెంట్‌ సమావేశాలు ఎలా నిర్వహించాలో తమకు కూడా తెలుసుననే విషయం ప్రభుత్వానికి తెలిపేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ తికాయత్‌ చెప్పారు. పార్లమెంట్‌ సమావేశాల్లో రైతు సమస్యలను ప్రస్తావించని అధికార, ప్రతిపక్ష సభ్యుల నియోజకవర్గాల్లో వారికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామన్నారు.  పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు కిసాన్‌ పార్లమెంట్‌ వేదిక వద్దే ఉంటామని తెలిపారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, కేరళ, పశ్చిమబెంగాల్, గుజరాత్, పంజాబ్, హరియాణా, యూపీలకు చెందిన రైతులు వచ్చి సంఘీభావం తెలిపారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top