Omicron Spread In India: సామాజిక వ్యాప్తి దశలో ఒమిక్రాన్‌

Omicron in community transmission in India says Insacog - Sakshi

మెట్రో నగరాల్లో అత్యధికంగా వ్యాప్తి

ఇన్సాకాగ్‌ హెచ్చరిక

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వేరియెంట్‌ సామాజిక వ్యాప్తి స్థాయికి చేరుకుందని కోవిడ్‌పై అధ్యయనం చేసే కేంద్ర సంస్థ ఇన్సాకాగ్‌ హెచ్చరించింది. మెట్రో నగరాల్లో ఒమిక్రాన్‌ కేసులు అత్యధికంగా వెలుగులోకి వస్తున్నాయని వెల్లడించింది. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై నగరాల్లో  ఈ కేసులు తారా స్థాయికి చేరుకున్నాయని చెప్పింది. సార్స్‌–కోవిడ్‌ జన్యుక్రమాన్ని విశ్లేషించడంతో పాటు వైరస్‌ వ్యాప్తిపై అవగాహన, దాని కట్టడికి మార్గాలు, ప్రజారోగ్యంపై సూచనలు సలహాలు ఇన్సాకాగ్‌ ఇస్తూ ఉంటుంది.

ఒమిక్రాన్‌ కేసుల్లో స్వల్ప లక్షణాలు, లేదంటే లక్షణాలు లేకుండా ఉన్న కేసులే ఎక్కువగా వస్తున్నాయని జనవరి 3,  10 తేదీలలో విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. ఆ బులెటిన్‌లో వివరాలను కేంద్ర ప్రభుత్వ అధికారులు ఆదివారం వెల్లడించారు. ఆస్పత్రిలో చేరే కేసులు, ఐసీయూ కేసులు ఎక్కువగా లేకపోయినప్పటికీ ముప్పు మాత్రం పొంచి ఉందని, అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. ‘‘భారత్‌లో ఒమిక్రాన్‌ ప్రస్తుతం సామాజికంగా వ్యాప్తి చెందే దశలో ఉంది. పలు మెట్రో నగరాల్లో ఈ కేసులు అత్యధికంగా వెలుగులోకి వస్తున్నాయి. ఒమిక్రాన్‌ సబ్‌ వేరియెంట్‌ బీఏ.2 కేసులు కూడా వ్యాపిస్తున్నాయి’’ అని ఆ బులెటిన్‌లో వెల్లడించింది.  

అంతర్గతంగా వ్యాప్తి
విదేశీ ప్రయాణికుల నుంచి కాకుండా అంతర్గతంగానే ఒమిక్రాన్‌ అధికంగా వ్యాప్తి చెందుతోందని ఇన్సాకాగ్‌ తన బులెటిన్‌లో పేర్కొంది. వైరస్‌లో జన్యుపరమైన మార్పులు అధికంగా చోటు చేసుకుంటూ ఉండడంతో నిరంతరం అందులో జరిగే మార్పుల్ని పర్యవేక్షిస్తున్నామని ఇన్సాకాగ్‌ స్పష్టం చేసింది. కరోనా వైరస్‌లో ఎన్ని రకాల జన్యు మార్పులు జరిగినప్పటికీ కోవిడ్‌ నిబంధనల్ని తు.చ తప్పకుండా పాటించడం, వ్యాక్సిన్‌ తీసుకోవడమే మనకి రక్షణ కవచాలని వివరించింది.  

తగ్గిన ఆర్‌ వాల్యూ : మద్రాస్‌ ఐఐటీ
కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో మద్రాస్‌ ఐఐటీ చేసిన అధ్యయనంలో కాస్త ఊరటనిచ్చే అంశం వెల్లడైంది. . కోవిడ్‌–19 వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే తీవ్రతను వెల్లడించే ఆర్‌ వాల్యూ 1.57కి తగ్గింది. ఆర్‌ వాల్యూ 1 కంటే ఎక్కువ ఉంటే ప్రమాద ఘంటికలు మోగుతున్నట్టుగానే భావించాలి.  ఆర్‌ వాల్యూ 1 కంటే తక్కువ ఉంటే వ్యాధి తగ్గుముఖం పడుతున్నట్టు లెక్క. జనవరి 14–21 మధ్య ఆర్‌ వాల్యూ 1.57 ఉన్నట్టుగా ఐఐటీ మద్రాస్‌ అధ్యయనం నివేదిక వెల్లడించింది.

జనవరి 7–13 మధ్య ఆర్‌ వాల్యూ 2.2 ఉండగా   జనవరి మొదటి వారంలో అత్యధిక స్థాయిలో ఆర్‌ వాల్యూ 4కి చేరుకుంది. ఇక డిసెంబర్‌ 25 నుంచి 31 మధ్య ఆర్‌ వాల్యూ 2.9గా ఉంది. ఐఐటీ మద్రాస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మ్యాథమెటిక్స్‌ కంప్యూటేషనల్‌  మోడల్‌ ద్వారా కరోనా వ్యాప్తిపై అధ్యయనం చేసింది. ప్రొఫెసర్‌ నీలేష్‌ ఎస్‌ ఉపాధ్యాయ, ప్రొఫెసర్‌ ఎస్‌. సుందర్‌లు ఈ అధ్యయనానికి నేతృత్వం వహించారు. దీని ప్రకారం ఆర్‌ వాల్యూ ముంబైలో 0.67, ఢిల్లీలో 0.98, చెన్నైలో 1.2, కోల్‌కతాలో 0.56గా ఉంది. ఇక వచ్చే 14 రోజుల్లో ఒమిక్రాన్‌ కేసులు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని ఆ అధ్యయనం అంచనా వేసింది.  

3.33 లక్షల కేసులు నమోదు
దేశంలో వరసగా నాలుగో రోజు 3 లక్షలకి పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 3,33,533 కేసులు నమోదయ్యాయి. ఇక క్రియాశీల కేసుల సంఖ్య 21, 87,205కి చేరుకుంది. తాజాగా ఒకే రోజు 525 మంది కరోనాతో మరణించారు. కరోనా రికవరీ రేటు 93.18గా ఉంది. కేరళలో కేసుల కట్టడికి ఆదివారం ఒక్క రోజు సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించారు. అత్యవసరాలకి తప్ప మరి దేనికి ఎవరూ బయటకు రాకుండా చర్యలు చేపట్టారు. ఉదయం 7 గంటల  నుంచి రాత్రి 9 గంటల వరకు లాక్‌డౌన్‌ అమలు చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా నిర్మానుష్య పరిస్థితులు నెలకొన్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top