బీజేపీ హామీలన్నీ ఉత్తవే.. నమ్మొద్దు! హిమాచల్‌ ప్రచారంలో ప్రియాంక

Old Pension Scheme Not Election Jumla Says Priyanka At Himachal - Sakshi

సిర్మౌర్‌: పాత పింఛను విధానాన్ని పునరుద్ధరిస్తామన్న కాంగ్రెస్‌ హామీ ఆర్థికంగా ఆచరణ సాధ్యం కాదంటూ బీజేపీ చేస్తున్న విమర్శలపై ప్రియాంకా గాంధీ వాద్రా స్పందించారు. తమ హామీ ఎన్నికల స్టంట్‌ కాదన్నారు. బడా పారిశ్రామిక వేత్తలు తీసుకున్న వేల కోట్ల రుణాలను రద్దు చేయడంపై ముందుగా సమాధానం చెప్పాలని కాషాయ పార్టీని ఆమె ప్రశ్నించారు.  ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తోందో సమాధానం చెప్పాలని నిలదీశారు.

ఎన్నికల ప్రచారంలో చివరిరోజైన గురువారం ప్రియాంక హిమాచల్‌ ప్రదేశ్‌లోని సిర్మౌర్‌ జిల్లాలో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం సుస్థిర ప్రభుత్వాన్ని ఇవ్వలేదంటూ ప్రధాని మోదీ, ఇతర బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ప్రియాంక కొట్టిపారేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక సుస్థిర ప్రభుత్వాన్ని అందించిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, ప్రభుత్వాలను అస్థిర పరుస్తున్నదెవరు?అని ఆమె బీజేపీని నిలదీశారు. రాష్ట్రంలో 15 లక్షల మంది నిరుగ్యోగ యువత ఉండగా ఖాళీగా ఉన్న 63 వేల ప్రభుత్వ ఉద్యోగాలను బీజేపీ ప్రభుత్వం భర్తీ చేయడం లేదని ఆరోపించారు.

తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకు లక్ష ఉద్యోగాలను కల్పించడంతోపాటు పాత పింఛను విధానాన్ని పునరుద్ధరిస్తుందని ప్రియాంకా గాంధీ ప్రకటించారు. బీజేపీ హామీలను నమ్మవద్దని చెప్పారు. ధరల తగ్గింపు గురించి, ఉద్యోగ ఖాళీల గురించి ఆ పార్టీ నేతలు మాట్లాడటం లేదని వివరించారు. 

ఇదీ చదవండి: నిర్మలా సీతారామన్‌తో కాంగ్రెస్‌ కార్యకర్తల సెల్ఫీలు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top