గాల్వాన్‌ ఘటన తర్వాత భారత్‌లో చైనా అగ్రనేత.. ధోవల్‌కు చైనా ఆఫర్‌

NSA Ajit Doval Meets Chinese Foreign Minister Wang Yi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌-చైనా మధ్య లఢక్‌ సహా మరిన్ని సరిహద్దు వివాదాస్పద ప్రాంతాలపై వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ తరుణంలో భారత్‌ పర్యటనలో భాగంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ గురువారం ఢిల్లీకి చేరుకున్నారు. ​కాగా, శుక్రవారం విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్‌తో వాంగ్‌ యీ భేటీ అయ్యారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగిన ఈ సమావేశంలో.. పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. జైశంకర్‌తోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌తోనూ సమావేశం అయ్యారు.

మరోవైపు.. సమావేశంలో భాగంగా అజిత్ ధోవ‌ల్‌ను త‌మ దేశానికి రావాలంటూ చైనా విదేశాంగ మంత్రి ఆహ్వానం అందించారు. కాగా, ఆయన ఆహ్వానంపై అజిత్‌ ధోవల్‌ పాజిటివ్‌గా స్పంది‍స్తూ.. రెండు దేశాల మ‌ధ్య ఉన్న స‌రిహ‌ద్దు స‌మ‌స్య‌లు విజ‌య‌వంతంగా ప‌రిష్కారమైన త‌ర్వాత క‌చ్చితంగా చైనాకు వ‌స్తాన‌ని తెలిపారు. కాగా, ద్వైపాక్షిక సంబంధాలు బ‌ల‌ప‌డాలంటే, ల‌ఢక్‌తో పాటు ఇత‌ర వివాదాస్ప‌ద ప్రాంతాల నుంచి చైనా త‌మ ద‌ళాల‌ను ఉప‌సంహ‌రించాల‌ని ధోవ‌ల్ ఈ సంద‌ర్భంగా వాంగ్‌ యీని కోరారు. ప్ర‌స్తుతం స‌రిహ‌ద్దుల్లో ఉన్న ప‌రిస్థితులు యుద్ధ వాతావరణాన్ని తలపించేలా ఉ‍న్నాయని ఆమోద‌యోగ్యంగా లేవన్నారు. ఈ క్రమంలో శాంతి స్థాప‌న‌తోనే ఇరు వ‌ర్గాల మ‌ధ్య న‌మ్మ‌కం ఏర్ప‌డుతుంద‌ని రెండు దేశాలు పేర్కొన్నాయి.

ఇదిలా ఉండగా.. 2020 జూన్ 15న భారత్, చైనా బలగాల మధ్య గాల్వాన్ లోయలో తలెత్తిన ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు అమరులవడంతో ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. అప్పటి నుంచి ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నప్పటికీ.. అవి పెద్దగా ఫలితాన్ని ఇవ్వడం లేదు. కాగా, గాల్వాన్ ఘటన తర్వాత సీనియర్ స్థాయి చైనా నేత భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇక, రెండు రోజుల క్రితం పాకిస్తాన్‌ పర్యటనలో ఉన్న సమయంలో కశ్మీర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వాంగ్‌ యూ.. తాజాగా భారత్‌లో పర్యటించడం గమనార్హం. ఢిల్లీకి రాకముందు వాంగ్‌ యి.. పాకిస్తాన్‌, ఆప్ఘనిస్తాన్‌లోని కాబూల్‌లో పర్యటించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top