కాక్రోచ్ దుమారం.. సీజేఐ కీలక వ్యాఖ్యలు | No Need To Be So Sentimental: CJI On Cockroach Party Row | Sakshi
Sakshi News home page

కాక్రోచ్ దుమారం.. సీజేఐ కీలక వ్యాఖ్యలు

May 25 2026 12:07 PM | Updated on May 25 2026 12:28 PM

No Need To Be So Sentimental: CJI On Cockroach Party Row

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ శర్మ చేసిన బొద్దింకల వ్యాఖ్యలతో ప్రారంభమైన వివాదం.. ఆ తర్వాత “కాక్రోచ్ జనతా పార్టీ” పేరుతో సోషల్ మీడియాను కుదిపేస్తోంది. సమర్థనలు, ఖండనలు.. తీవ్ర అభ్యంతరాలతో ఈ క్యాంపెయిన్‌పై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. అయితే అటు ఇటు తిరిగి చివరకు.. ఈ రాజకీయ సెటైర్‌ క్యాంపెయిన్‌ కోర్టు మెట్లెక్కింది. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు.. 

సీజేఐ చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ.. న్యాయవ్యవస్థను లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం సాగుతోందని సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని అత్యవసర విచారణలు జరపాలని.. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు. సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ ఆ పిటిషన్లను పరిశీలించారు. అయితే ఇది అత్యవసర విచారణ జరిపే పిటిషనేం కాదని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. 

మే 15న జరిగిన ఓ కేసు విచారణ సందర్భంగా ‘‘కొందరు బొద్దింకల్లా అన్నిచోట్లా కనిపిస్తున్నారు..’’ అంటూ సీజేఐ సూర్యకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు లేక, వృత్తుల్లో స్థానం దక్కని కొందరు యువకులు బొద్దింకల్లా అన్నిచోట్లా కనిపిస్తున్నారు. కొందరు మీడియాగా, ఇంకొందరు ఆర్టీఐ కార్యకర్తలుగా మారి అందరినీ టార్గెట్ చేస్తుంటారు అని పేర్కొన్నారాయన. 

ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో.. సీజేఐ తర్వాత వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలు యువతపై కాకుండా నకిలీ, బోగస్ డిగ్రీలతో వ్యవస్థల్లోకి చొరబడుతున్న వారినే ఉద్దేశించాయని స్పష్టం చేశారు. అయినప్పటికీ “కాక్రోచ్ జనతా పార్టీ” (సిజెపి) పేరిట సోషల్ మీడియాలో వ్యంగ్య ప్రచారం కొనసాగింది. ఈ పరిణామాలను ప్రాక్టీసింగ్ లాయర్ రాజా చౌదరి సుప్రీంకోర్టులో పిటిషన్ రూపంలో దాఖలు చేశారు. సీజేఐ వ్యాఖ్యలను కొందరు సోషల్ మీడియాలో వక్రీకరించి.. నిరుద్యోగ యువతను ఉద్దేశించి మాట్లాడినట్టుగా ప్రచారం చేశారని.. ఈ దుష్ప్రచారంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలని అందులో పేర్కొన్నారాయన. 

ఈ పిటిషన్లపై న్యాయవాది గోస్వామి వాదనలు వినిపించారు. కోర్టు విచారణల్లో జరిగిన మాటల మార్పిడిని.. వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు. అలాగే నకిలీ లా డిగ్రీలు, బోగస్ న్యాయవాదుల వ్యవహారాలపై సీబీఐతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ అంశాన్ని అంత సీరియస్‌గా తీసుకోవద్దంటూ సీజేఐ సూర్యకాంత్‌ పిటిషనర్‌కు సూచించారు. ఈ అంశంలో ఇంత ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం లేదు. దీనికి అత్యవసర విచారణ జరపాల్సినంత సీన్‌ లేదు. సమయం వచ్చినప్పుడు కోర్టు ఈ అంశాన్ని తప్పక  పరిశీలిస్తుంది అని లాయర్‌ గోస్వామిని ఉద్దేశిస్తూ సీజేఐ సూర్యకాంత్‌ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో తన వ్యాఖ్యల ప్రస్తావన, మళ్లీ వివరణ అంశాల్ని ఆయన ప్రస్తావించలేదు.

మరో పిటిషన్‌లో “కాక్రోచ్ జనతా పార్టీ” పేరిట సాగుతున్న ఆన్‌లైన్ క్యాంపెయిన్ కార్యకలాపాలపై కూడా సీబీఐ విచారణ జరిపించాలని దాఖలైంది. సీజేఐ వ్యాఖ్యలను సెలెక్టివ్‌గా తీసుకుని సోషల్ మీడియాలో వైరల్ చేయడం ద్వారా న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని పిటిషనర్లు ఆరోపించారు. మెర్చండైజ్‌, బ్రాండింగ్‌, రాజకీయ సెటైర్ పేరుతో ప్రచారం సాగిస్తూ వాణిజ్య లాభాలు పొందే ప్రయత్నం జరుగుతోందని కూడా పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను కోర్టు పరిశీలించాల్సి ఉంది. 

అలా మొదలై..
మహారాష్ట్రకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ అభిజిత్‌ దిప్కే ప్రారంభించిన “కాక్రోచ్ జనతా పార్టీ” మొదట సరదా సెటైర్‌లా మొదలైనా.. క్రమంగా ఇది వ్యవస్థలపై అసంతృప్తి వ్యక్తం చేసే డిజిటల్‌ ఉద్యమంగా మారింది. సీజేఐ సూర్యకాంత్ చేసిన “కాక్రోచ్” వ్యాఖ్యలను తమపై అవమానంగా భావించిన కొంతమంది నిరుద్యోగ యువత, సోషల్ మీడియా యూజర్లు ఈ పేరును వ్యంగ్య చిహ్నంగా మార్చుకున్నారు. “మమ్మల్ని బొద్దింకలు అంటారా..? అయితే ఇదే మా పార్టీ” అన్నట్లుగా ఈ క్యాంపెయిన్‌ను నడిపిస్తున్నారు.

ఈ గ్రూప్‌ సోషల్ మీడియాలో మీమ్స్‌, పోస్టర్లు, వ్యంగ్య నినాదాలు, డిజిటల్‌ పోస్టర్లతో భారీ ప్రచారం చేస్తోంది. “Wherever WiFi Works is our headquarters”, “Party for the unemployed and overqualified” లాంటి ట్యాగ్‌లైన్లతో యువతలో వైరల్ అవుతోంది. రాజకీయాలపై, న్యాయవ్యవస్థపై, ఉద్యోగ వ్యవస్థపై వ్యంగ్య వ్యాఖ్యలతో పోస్టులు పెడుతూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

ట్రోలింగ్‌ మాత్రమే కాదు..
అయితే ఇది కేవలం ట్రోలింగ్‌కే పరిమితం కాలేదు. మాజీ ప్రధాన న్యాయమూర్తులకు పదవీ విరమణ తర్వాత రాజ్యసభ అవకాశాలు ఇవ్వొద్దని, పార్టీ మారిన ఎమ్మెల్యేలు-ఎంపీలకు 20 ఏళ్ల అనర్హత విధించాలని, మహిళలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని, పరీక్షల లీకేజీలపై కఠిన చట్టాలు తీసుకురావాలని వంటి డిమాండ్లను కూడా తమ మేనిఫెస్టోలో చేర్చింది. దీంతో ఇది పూర్తిగా సరదా క్యాంపెయినా..? లేక వ్యవస్థలపై డిజిటల్ నిరసనా..? అనే చర్చ మొదలైంది.

మరోవైపు విమర్శకులు మాత్రం ఈ క్యాంపెయిన్‌ న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా మారుతోందని ఆరోపిస్తున్నారు. సీజేఐ వ్యాఖ్యలను సెలెక్టివ్‌గా కట్ చేసి వైరల్ చేయడం, మెర్చండైజ్‌, బ్రాండింగ్‌, రాజకీయ సెటైర్ పేరుతో ప్రచారం చేయడం ద్వారా వాణిజ్య ప్రయోజనాలు పొందే ప్రయత్నం జరుగుతోందని అంటున్నారు. ఇదే అంశం ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది.

Advertisement
 
Advertisement
Advertisement