
విపక్షాల ఆరోపణలు, అధికారపార్టీ ప్రతివిమర్శలతో షురూ
పహల్గాం, ఆపరేషన్ సిందూర్‌పై చర్చకు అంగీకరించిన కేంద్రం
వచ్చేవారం చర్చించే ఛాన్స్
న్యూఢిల్లీ: ధూర్తదేశం పాక్‌పై భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలు తొలిరోజే తీవ్రస్థాయి వాదోపవాదాలతో మొదలయ్యాయి. పహల్గాం ఉదంతంలో కేంద్ర నిఘా వర్గాల ఘోర వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ ఆపరేషన్ సిందూర్‌పై వెనువెంటనే చర్చ మొదలెట్టాలన్న విపక్షాల డిమాండ్లు ఓవైపు.. ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భం, కేసులను మోస్తున్న రాబర్డ్ వాద్రాపై అధికార పార్టీ ప్రతివిమర్శలతో తొలిరోజు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వేడెక్కాయి.
బిహార్‌లో ఓటర్ల జాబితా విస్తృతస్థాయిలో సవరించడం, మణిపూర్‌లో జాతుల మధ్య వైరంపై అధికార, విపక్ష పార్టీల పరస్పర ఆరోపణలతో లోక్‌సభ, రాజ్యసభల్లో వాతావరణం ఓవైపు మరింత ఉద్రిక్తంగా మారినా.. కాలిన కరెన్సీ కట్టల వ్యవహారంలో అపకీర్తిని మూటగట్టుకున్న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన అంశంలో అంతా ఏకతాటి మీదకు రావడం విశేషం. అవినీతిమరకలు అంటుకున్న జడ్జీని న్యాయపీఠం నుంచి పక్కకు తప్పించే క్రతువులో పార్టీలకతీతంగా సభ్యులు ఒకేమాటపై నిలబడ్డ సందర్భానికీ పార్లమెంట్ వేదికైంది.
తొలిరోజే నాలుగుసార్లు వాయిదా
సోమవారం ఉదయం 11 గంటలకు ఉభయసభలు మొదలయ్యాయి. పహల్గాంలో అత్యంత పాశవికంగా ఉగ్రవాదులు చేసిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఇరు సభల్లో సభ్యులు నివాళులర్పించారు. అహ్మదాబాద్‌లో ఎయిర్‌ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో సజీవదహనమైన ప్రయాణికులకూ ఇరుసభల సభ్యులు నివాళిగా కొద్దిసేపు మౌనం పాటించారు. తర్వాత లోక్‌సభలో ప్రశ్నోత్తరాలను స్పీకర్ బిర్లా మొదలెట్టగానే విపక్ష సభ్యులు వెంటనే వెల్‌లోకి దూసుకొచ్చి ఆందోళనకు దిగారు.
ప్రభుత్వ ఘోర నిఘా వైఫల్యం వల్లే పహల్గాం ఉదంతం చోటుచేసుకుందని, ఆపరేషన్ సిందూర్‌పై తక్షణం చర్చ జరపాలని డిమాండ్లుచేశారు. ఈ అంశంలో సభకు వచ్చి ప్రధాని మోదీ వివరణ ఇవ్వాలని సభ్యులు పట్టుబట్టారు. ‘‘ప్రశ్నోత్తరాల గంట ముగిశాకే మీకు మాట్లాడే అవకాశం ఇస్తా. క్వశ్చన్ అవర్ సజావుగా సాగనివ్వండి. మనల్ని ఎన్నుకున్న ప్రజల సమస్యలపై చర్చ జరగనివ్వండి. మీరు నినాదాలు ఇవ్వాలనుకుంటే బయటికెళ్లి ఇచ్చుకోండి’’ అని బిర్లా సూచించినా విపక్ష సభ్యులు వినిపించుకోలేదు. దీంతో సభను 12 గంటల దాకా వాయిదావేశారు. తర్వాత 12 గంటలకు సభ ఆరంభమైనా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు.
మీరు ఎత్తిచూపిన అంశాలపై సుదీర్ఘ చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అప్పటిదాకా ఓపిక పట్టాలని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కోరారు. సభావ్యవహారాల సలహా కమిటీ(బీఏసీ) ఎదుట విపక్ష సభ్యులు తమ వాదనల్ని మధ్యాహ్నం 2.30గంటలకు వినిపించవచ్చని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సూచించారు. అయినా విపక్షసభ్యులు వినిపించుకోలేదు.
దీంతో అప్పుడు సభాధ్యక్షపీఠంపై కూర్చున్న జగదాంబికా పాల్ సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదావేశారు. తర్వాత సభ మొదలైనా ఎలాంటి మార్పులేదు. అప్పటి స్పీకర్ స్థానంలో కూర్చున్న సంధ్యా రాయ్ సభను మధ్యాహ్నం నాలుగు గంటలకు వాయిదావేశారు. నాలుగు గంటలకు సభ సమావేశమైంది. అప్పుడు కూడా విపక్షసభ్యులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తమ నిరసనలతో సభను హోరెత్తించారు. ఇక చేసేదిలేక సభాధ్యక్ష స్థానంలో కూర్చున్న దిలీప్ సైకియా లోక్‌సభను మంగళవారానికి వాయిదావేశారు. ఇలా తొలిరోజే లోక్‌సభ నాలుగుసార్లు వాయిదాపడింది. రాజ్యసభ లోనూ ఇదే వాయిదా పర్వం కొనసాగింది.
వచ్చే వారం సిందూర్‌పై చర్చ
పహల్గాంలో ఉగ్రదాది, ఆపరేషన్ సిందూర్, తదనంతర పరిణామాలపై విస్తృతస్థాయి చర్చకు కేంద్రప్రభుత్వం తన సమ్మతి తెలిపింది. వచ్చే వారం ఈ అంశాలపై సమగ్రస్థాయిలో లోక్‌సభలో చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్తున్న కారణంగా ఈవారం ఆయన పార్లమెంట్‌కు రాలేరని, వచ్చే వారం ఆయన సమక్షంలోనే పార్లమెంట్‌లో చర్చ జరుగుతుందని తెలుస్తోంది. పార్లమెంట్ వ్యవహారాల సలహా కమిటీ సమావేశంలో ప్రభుత్వ ప్రతినిధులు ఈ విషయాలను విపక్ష నేతలకు తెలియజేశారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు షిప్పింగ్ డాక్యుమెంట్ల సరళీకరణకు బాటలువేసే ‘ది బిల్స్ ఆఫ్ ల్యాడింగ్ బిల్లు– 2025’ కు రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లు మార్చిలోనే లోక్‌సభ ఆమోదం పొందింది.