వీధి కుక్కల వ్యవహారంలో(Stray Dogs Row) కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రాలపై సోమవారం సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఉత్తర్వులను అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యాయని.. తద్వారా అంతర్జాతీయ స్థాయిలో దేశం పరువు తీశారంటూ తీవ్ర వ్యాఖ్యలే చేసింది.
వీధి కుక్కల నియంత్రణకు ఆగస్టులో సుప్రీం కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. షెల్టర్ల ఏర్పాటు అంశం పరిశీలన నేపథ్యంలో.. శునకాలను పట్టుకుని, శస్త్రచికిత్స చేసి, తిరిగి వదిలే విధానాన్ని అమలు చేయాలని ఆగష్టు నెలలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశించింది. ఈ మేరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ అఫిడవిట్లు దాఖలు చేయాలని రాష్ట్రాలకు సూచించింది.
కానీ ఇప్పటివరకు పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఢిల్లీ ప్రభుత్వాలు మాత్రమే స్పందించాయి. అవి కూడా దీపావళి సెలవుల్లో అఫిడవిట్లు సమర్పించడంతో రికార్డుల్లో అధికారికంగా నమోదు కాలేదు. ఈ పరిణామంపై సోమవారం విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
రెండు నెలలు గడిచినా, ఇంకా స్పందన లేదు. దీని అర్థం ఏంటి?. మీరు స్పందించకపోవడంతో.. ప్రపంచస్థాయిలో దేశం పరువును మీరే తీస్తున్నారు. ఇది సిగ్గు చేటు.. అంటూ రాష్ట్రాలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో.. నవంబర్ 3న అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. అయితే.. తెలంగాణ, పశ్చిమ బెంగాల్ సీఎస్‌లకు మాత్రం మినహాయింపు ఇచ్చింది.
తమ ఆదేశాల తర్వాత కూడా దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడుల ఘటనలు నమోదు చేసుకున్నాయని కోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది. ప్రజల భద్రతను నిర్లక్ష్యం చేయడం సర్వసాధారణమైన విషయం కాదంటూ రాష్ట్రాలను ఉద్దేశించి కోర్టు స్పష్టం చేసింది. తాజా వ్యాఖ్యల నేపథ్యంతో.. వచ్చే సోమవారం జరిగే విచారణ కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది.
ఇదీ చదవండి: నెక్ట్స్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా.. ఆయనే!


